Janasena: ఏపీలో ఫ్లెక్సీల వార్.. పవన్‌కు వ్యతిరేకంగా వైసీపీ ఫ్లెక్సీల ఏర్పాటు.. కౌంటర్ ఇస్తున్న జనసేన!
ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జనసేన, టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫ్లెక్సీల విషయంలో జనసేన ధీటుగా స్పందిస్తోంది. జనసేన కూడా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. వైసీపీ అధినేత సీఎం జగన్, ఆ పార్టీ నేతల అవినీతిని చూపించేలా ఈ ఫ్లెక్సీలు రూపొందించి ఏర్పాటు చేసింది.
Janasena: ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. జనసేనకు, టీడీపీకి వ్యతిరేకంగా అధికార వైసీపీ ఫ్లెక్సీలు రూపొందించింది. వాటిని దాదాపు ఏపీలోని అన్ని ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో ఏర్పాటు చేయించింది. స్థానిక నాయకుల పేర్లతో ఈ ఫ్లెక్సీలు రూపొందాయి. వీటిని ఏర్పాటు చేయడంపై జనసేన, టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫ్లెక్సీల విషయంలో జనసేన ధీటుగా స్పందిస్తోంది. వీటిల్లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కించపరిచేలా ఉండటమే దీనికి కారణం. దీంతో జనసేన కూడా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. వైసీపీ అధినేత సీఎం జగన్, ఆ పార్టీ నేతల అవినీతిని చూపించేలా ఈ ఫ్లెక్సీలు రూపొందించి ఏర్పాటు చేసింది. దీంతో ఏపీలో పార్టీల మధ్య ఫ్లెక్సీల పేరుతో వార్ నడుస్తోంది.
గుంటూరు, విశాఖపట్నం, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. వైసీపీ వర్సెస్ జనసేన, టీడీపీ అన్నట్లుగా ఈ వార్ సాగుతోంది. పేదలకు, పెత్తం దారులకు మధ్య యుద్ధం అంటూ కొన్నిచోట్ల వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. కొన్ని ఫ్లెక్సీల్లో చంద్రబాబు, లోకేష్ కూర్చున్న పల్లకీని పవన్ మోస్తున్నట్లుగా వేశారు. వీటిపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలు ఎక్కడ ఏర్పాటు చేశారో, ఆ పక్కనే పోటీగా జనసేన కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసింది. ‘రాక్షస పాలన పోవాలి- నియంతలతో యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అంటూ జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీల్లో ఇసుక, మద్యం ద్వారా జగన్ సొమ్ము సంపాదించుకుంటున్నట్లు, అలాగే రుషికొండను బోడికొండ చేసినట్లు జనసేన నేతలు ఫ్లెక్సీలు వేశారు. వీటిని కూడా రోడ్డు పక్కన, కూడళ్ల వద్ద ఏర్పాటు చేశారు.
కానీ, స్థానిక అధికారులు, పోలీసులు జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. వైసీపీ ఏర్పాటు చేసిన వాటిని మాత్రం ఉంచుతున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. వైసీపీ అధికార పార్టీ కావడం, నిధులకు కొరత లేకపోవడంతో ఎక్కువ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయిస్తోంది. వాటిని అధికారులు, పోలీసులు కూడా అలాగే చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఇతర పార్టీలు ఏర్పాటు చేసిన వాటిని మాత్రం వెంటనే తొలగిస్తున్నారు. ఒంగోలులో కూడా మాజీ మంత్రి బాలినేని అనుచరులు కూడా ఇలాంటి ఫ్లెక్సీలే ఏర్పాటు చేయగా, జనసేన కార్యకర్తలు తొలగించారు. చాలా చోట్ల ఎంపీ మార్గాని భరత్, గుడివాడ అమర్నాథ్ సహా పలువురు నేతల పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటవుతున్నాయి. దీంతో వాటిని తొలగించేందుకు అధికారులు భయపడుతున్నారు. ఈ ఫ్లెక్సీల కారణంగా పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వివాదాలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నాయి.
ఇది వైసీపీ రాజకీయం
కారణం ఏదైనా ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేయడం వైసీపీ రాజకీయంలో భాగం. ఏ పార్టీని వాళ్ల రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోనివ్వదు. అన్ని చోట్లా అడ్డుతగులుతుంది. ఎవరైనా ఒక కార్యక్రమం చేపడితే, పోటీగా మరో కార్యక్రమాన్ని వైసీపీ సిద్ధం చేస్తుంది. ఇటీవలి మహానాడుకు కూడా వైసీపీ అనేక అడ్డంకులు కల్పించింది. తాజాగా ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో ప్రచారం నిర్వహిస్తోంది.