Russia ukraine war: పిట్ట కథలు వద్దు పుతిన్.. ఫ్రూఫ్ చూపించు! అందుకేగా ఈ డ్రోన్ డ్రామా?
పుతిన్ మాస్ లీడరో.. డేంజరస్ కెప్టెనోనన్నది ఆయన భజనపరులుకే కాసేపు వదిలేస్తే.. కన్నీంగ్‌నెస్‌లో మాత్రం గుంటనక్కకు మించిన తెలివితేటలున్న ప్రపంచ మేధావి అయన. తాజాగా తమ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగిందని.. యుక్రెయినే దీని వెనుక ఉందని రష్యా వాదిస్తోంది. అయితే నిజంగానే జెలెన్‌స్కీ సేనలు ఈ పని చేశాయా? లేకపోతే దీనివెనుక పుతిన్ 'బ్లాస్టర్' ప్లాన్ దాగుందా?
యుక్రెయిన్‌లో ఏదో పొడిచేస్తామని.. క్రిమియా సీన్ రిపీట్ చేసేస్తామని.. అక్కడ డాన్‌బాస్ ప్రాంతాలకు స్వతంత్రం కల్పిస్తామని.. గతేడాది ఫిబ్రవరీ 24న జెలెన్‌స్కీ కంట్రీపై దండయాత్రకు దిగింది రష్యా. యుక్రెయిన్ పసికూన దేశమని..మూడు రోజుల్లోనే జెలెన్‌స్కీ బలగాలు పుతిన్ కాళ్ల దగ్గరకు వచ్చేస్తాయని చాలా మంది చిలక జోస్యం చెప్పారు. అది చిలక జోస్యమో.. ఎలుక జోస్యమో ఆ జాతకాలు చెప్పిన మేధావులకే వదిలేద్దాం కానీ.. ఊహించింది మాత్రం ఒక్కటి కూడా జరగలేదు. యుద్ధాన్ని వెనుక నుంచి ఎగదొస్తూ.. శవాలపై చిల్లర ఏరుకునే మైండ్‌సెట్ కలిగిన అమెరికా అండదండలతో యుక్రెయిన్ ఈ నాటికి రణాన్ని కొనసాగిస్తూనే ఉంది. యుద్ధంలో ఎవరిది పైచేయి అన్నది పక్కన పెడితే తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..
రష్యా వెర్షన్:
పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్న రెండు డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించడం పెను ప్రకంపనలు సృష్టించింది. రష్యా అధ్యక్షుడిపై జరిగిన ‘తీవ్రవాద’ హత్యాయత్నంగా ఈ చర్యను అభివర్ణించింది. రెండు మానవ రహిత వాహనాలు క్రెమ్లిన్ వైపునకు వచ్చాయని.. వాటిని నిర్వీర్యం చేశామని క్రెమ్లిన్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇది యుక్రెయిన్ పనేనని.. పుతిన్‌ను హతమార్చేందుకే వీటిని ప్రయోగించిందని రష్యా ఆరోపించింది. డ్రోన్ దాడి జరిగినప్పుడు పుతిన్ ఆ భవనంలో లేరని.. అలాగే క్రెమ్లిన్ భవనానికి ఎలాంటి నష్టం జరగలేదని రష్యా తెలిపింది.
యుక్రెయిన్ వెర్షన్:
రష్యా చేసిన ఆరోపణలను యుక్రెయిన్ తిప్పికొట్టింది. ఆ డ్రోన్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో రష్యా చేయనున్న దాడులను సమర్ధించుకోవడానికే క్రెమ్లిన్ తమపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందిని యుక్రెయిన్ తెలిపింది.
వేర్ ఇజ్ ది ఫ్రూఫ్:
అవును.. రష్యా చెప్పిన డ్రోన్ కథ నిజమే..! ఏవో రెండు డ్రోన్లు క్రెమ్లిన్ వైపు వచ్చినట్లు వీడియోలు రిలీజ్ చేశారు. అయితే అది యుక్రెయినే చేసిందా? ఓవైపు జెలెన్‌స్కీ సేనలే పుతిన్ హత్యకు ప్లాన్ వేశారని చెబుతున్న రష్యా.. మరోవైపు అందుకు తగిన ఆధారాలు మాత్రం చూపిండచంలేదు. ఒకవేళ నిజంగానే పుతిన్ టార్గెట్‌గా దాడి జరిగితే ఆ విషయాన్ని 12 గంటల పాటు ఎందుకు దాచినట్లు? దానిపై రష్యా ఇప్పటివరకు ఎందుకు వివరణ లేదు? అటు ఈ ఘటన జరిగి 24గంటలు కూడా తిరగకుండానే యుక్రెయిన్ భూభాగాలపై పుతిన్ సేనలు దాడులు తీవ్రతరం చేశాయి. యుక్రెయిన్ రాజధాని కివ్‌లో రెండు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అక్కడి మీడియా చెబుతోంది. ఖేర్సన్‌లోని సూపర్ మార్కెట్, రైల్వే స్టేషన్‌పై రష్యా బలగాలు దాడులు చేశాయని.. ఈ దాడిలో 21 మంది చనిపోయారని చెబుతోంది. ఇలా దాడులు జరుగుతాయని రష్యా హత్యాయత్నం ఆరోపణలు చేసిన వెంటనే యుక్రెయిన్ అంచనా వేసింది.
మే9 తర్వాత మరిన్నీ దాడులు:
ప్రతీ ఏడాది మే9న విక్టరీ డే జరుపుకుంటుంది రష్యా. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నాజీలపై సాధించిన విజయానికి గుర్తుగా ఆ రోజున రష్యాలో ఏటా ఘనంగా వేడుకలు చేస్తారు. నిజానికి గతేడాది మే9 నాటికి యుక్రెయిన్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవాలని పుతిన్ భావించారు.. అయితే మరో ఏడాది వచ్చేసినా ఇప్పటివరకు యుక్రెయిన్‌ను హస్తగతం చేసుకోలేకపోయారు.. ఇక ఈ ఏడాది మే9 తర్వాత పుతిన్ దాడులు మరింత ఉధృతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాన్ని సమర్ధించుకోవడానికే రష్యా ఈ హత్యాయత్నం కథ అల్లిందన్నది యుక్రెయిన్ మాట.. మరి చూడాలి..మే 9 తర్వాత ఏం జరుగుతుందో?