ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న రష్యా అణు పరీక్షలతో శత్రువులకు పరోక్ష హెచ్చరిక

రష్యా దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రత్యర్థి దేశాలకు వణుకు పుట్టేలా నిర్ణయాలు తీసుకుంటోంది. అదే సమయంలో మాతో పెట్టుకోకు అంటూ పరోక్షంగా శత్రువులకు వార్నింగ్ ఇస్తోంది. రెండేళ్లుగా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న మాస్కో...ఎక్కడా తగ్గడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 31, 2024 | 12:38 PMLast Updated on: Oct 31, 2024 | 12:38 PM

Russia That Makes Opponents Tremble Indirect Warning To Enemies With Nuclear Tests

రష్యా దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రత్యర్థి దేశాలకు వణుకు పుట్టేలా నిర్ణయాలు తీసుకుంటోంది. అదే సమయంలో మాతో పెట్టుకోకు అంటూ పరోక్షంగా శత్రువులకు వార్నింగ్ ఇస్తోంది. రెండేళ్లుగా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న మాస్కో…ఎక్కడా తగ్గడం లేదు. ఉక్రెయిన్ అంతమే లక్ష్యంగా పని చేస్తోంది. తాజాగా మాస్కో భీకర అణు విన్యాసాలు నిర్వహించింది. ముప్పేట దాడులను తిప్పికొట్టడమే లక్షంగా పుతిన్ బలగాలను సన్నద్దం చేస్తున్నారు. రష్యా విన్యాసాలతో అణు యుద్ధం తప్పదన్న ఆందోళనలు మొదలయ్యాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్ తగ్గేదేలే అంటున్నారు. శత్రువులకు ఎంత బలవంతులు అండగా నిలిచినా…వెనుకడుగు వేసేది లేదంటున్నారు. ఉక్రెయిన్ కు ఎన్ని రకాలుగా సాయం చేసినా…తాను మాత్రం యుద్ధంలో ముందుకే అనేలా సంకేతాలు ఇచ్చేశారు. నాటో దేశాల అండతో రెచ్చిపోతున్న ఉక్రెయిన్ కు…వెన్నులో వణుకు పుట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాటో దేశాలు ఉక్రెయిన్‌కు ఇచ్చే సూదూర లక్ష్యాలను ఛేదించే మిస్సైల్స్‌…రష్యాపై ప్రయోగించే అవకాశం ఉండటంతో పుతిన్ అప్రమత్తమయ్యారు. ఒకవేళ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ను తమపై ప్రయోగిస్తే…నాటో దేశాలే తమతో నేరుగా యుద్ధాన్ని ప్రకటించినట్లు పరిగణిస్తామని పుతిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా అణ్వాయుధ దేశ మద్దతుతో…అణురహిత దేశం తమపై చేసే దాడినీ సంయుక్త దాడిగానే పరిగణిస్తామని రష్యా స్పష్టం చేసింది.

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం అత్యంత క్లిష్ట దశలో ఉన్న వేళ మాస్కో భారీ అణు బలగాల సన్నద్ధత విన్యాసాలను ప్రారంభించింది. రష్యాపై కయ్యానికి కాలు దువ్వుతున్న అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ముప్పేట ప్రత్యర్థుల దాడులను తిప్పి కొట్టేలా…అణు బలగాల విన్యాసాలు నిర్వహించింది. లాంచ్‌ ప్యాడ్స్‌, సబ్‌మెరైన్స్, బాంబర్ల నుంచి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఆదేశాలతో అణు విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు క్రెమ్లిన్‌ ప్రకటించింది. రష్యా చేపట్టిన అణు విన్యాసాలతో…అణు యుద్ధం తప్పదన్న ఆందోళన మొదలయింది. ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాల్లో 88 శాతం కేవలం రష్యా, అమెరికా అమ్ముల పొదిలో ఉన్నాయి. రష్యాపై నాటో దేశాలు దాడి చేస్తే…మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచానికి అణు యుద్ధం ముప్పు పొంచి ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించారు.

అమెరికా, నాటోను దృష్టిలో పెట్టుకునే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అణు విన్యాసాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉపరితల, సముద్ర, గగనతల అణుదాడుల్ని తిప్పికొట్టేందుకు…ఈ పరీక్ష నిర్వహించింది. డ్రిల్స్‌లో భాగంగా ప్లెసెట్స్‌ లాంఛ్‌ ప్యాడ్‌ నుంచి ఖమ్‌చట్కా ద్వీపకల్పంపై యార్స్‌ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను మాస్కో ప్రయోగించింది. సముద్రం నుంచి గగనతల దాడుల్ని తిప్పికొట్టేలా బారెంట్స్‌, ఓఖోత్స్‌ సముద్రాల్లోని అణు జలాంతర్గాముల నుంచి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించింది. TU-95అణు బాంబర్లలోని దీర్ఘశ్రేణి క్రూయిజ్‌ మిస్సైల్స్‌ విజయవంతంగా లక్ష్యాలను ఛేదించాయి. భూ, సముద్ర, గగనతలాల గుండా రష్యా పరీక్షించిన అన్ని అణు సామర్థ్య క్షిపణులే. రష్యా పరీక్షించిన అణు క్షిపణులకు అమెరికా భూభాగంలోని ప్రతీమూలకూ వెళ్లే సామర్థ్యం ఉంది. మరోవైపు 12వేల మంది ఉత్తరకొరియా సైనికులను…ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా మోహరిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. ఉత్తరకొరియా యుద్ధంలో పాల్గొంటుండంతో…అమెరికా అప్రమత్తమైంది. లాంగ్‌రేంజ్‌ మిస్సైల్స్‌ ప్రయోగంపై ఆంక్షలను సవరించనున్నట్లు తెలుస్తోంది.

అణ్వాయుధ వ్యవస్థలను ఏడాది క్రితమే అప్రమత్తం చేశారు అధ్యక్షుడు పుతిన్. ఏ క్షణంలోనైనా అణుదాడి చేసేందుకు సిద్ధం కావాలని…2022 చివరిలోనే సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచే విన్యాసాల కోసం అణు జలాంతర్గాములను బేరెంట్స్‌ సముద్ర జలాల్లోకి తరలించారు. సైబీరియా మంచు ప్రాంతాల్లోనూ క్షిపణి ప్రయోగ వ్యవస్థలను మోహరించారు. అప్పటి నుంచే సముద్ర జలాల్లో నిర్వహించే విన్యాసాలకు అణు జలాంతర్గాములు మోహరించారు. కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ చక్కగా పనిచేసేలా…వీటిని సిద్ధంగా ఉంచడమే విన్యాసాల లక్ష్యమని మాస్కో ప్రకటించింది.