Teegala Krishna Reddy: సబితా ఇంద్రారెడ్డితో తీగల భేటీ.. ఇద్దరూ కలిసిపోయారా..?
మహేశ్వరం నియోజకవర్గంలో రెండు బీఆర్ఎస్ వర్గాలు ఏర్పడ్డాయి. అయితే, ఇందులో సబిత వర్గానిదే ఆధిపత్యం. ఆమెకు మంత్రి పదవి ఉండటం, కేసీఆర్ అండదండలు ఉండటంతో సబిత ఆధిపత్యం కొనసాగింది.
Teegala Krishna Reddy: రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి కలిసిపోయారా..? భవిష్యత్తులో కలిసి పని చేసేందుకు నిర్ణయించుకున్నారా..? తాజా పరిణామం చూస్తూ నిజమే అనిపిస్తోంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి మధ్య కొంతకాలంగా పొలిటికల్ వార్ నడుస్తోంది. కారణం.. ఇద్దరూ ఒకే నియోజకవర్గానికి చెందిన నేతలు కావడం. ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటం. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తీగల కృష్ణారెడ్డి 2018లో బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఆ సమయంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, తీగలపై కాంగ్రెస్ తరఫున సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.
సబితకు ఏకంగా విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్. అప్పటి నుంచి బీఆర్ఎస్ తరఫున ఓడిపోయిన తీగలకు, ఆ పార్టీలో చేరి, మంత్రిగా మారిన సబితకు మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలో రెండు బీఆర్ఎస్ వర్గాలు ఏర్పడ్డాయి. అయితే, ఇందులో సబిత వర్గానిదే ఆధిపత్యం. ఆమెకు మంత్రి పదవి ఉండటం, కేసీఆర్ అండదండలు ఉండటంతో సబిత ఆధిపత్యం కొనసాగింది. మరోవైపు సబిత తనయుడు షాడో ఎమ్మెల్యేగా ఉంటూ, దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. దీంతో తీగల వర్గం అసంతృప్తితో రగిలిపోయింది. నియోజకవర్గంలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతానని తీగల బహిరంగంగా బీఆర్ఎస్‌ను హెచ్చరించాడు. సబితపై భూకబ్జా ఆరోపణలు కూడా చేశాడు. ఈ కారణంగా ఇద్దరిమధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో తీగల కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లోపు కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అనుకున్నారు.
కలిసి పని చేస్తారా..?
ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సబిత.. తీగల కృష్ణారెడ్డితో రహస్యంగా భేటీ అయ్యారు. స్థానిక నాయకుడి ఇంట్లో ఇద్దరూ కలిసి అరగంటకుపైగా చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరూ కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, పోటీపడితే.. ఇద్దరికీ నష్టమేననే నిర్ణయానికొచ్చారు. దాని బదులు కలిసి పనిచేయాలనుకుంటున్నారు. ఇద్దరిలో టిక్కెట్ ఎవరికి వచ్చినా.. బీఆర్ఎస్‌ను గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ రానివారికి అధిష్టానం మరో పదవి ఇస్తుందని భావిస్తున్నట్లు తీగల వర్గం తెలిపింది. భేటీ అనంతరం తీగల కృష్ణారెడ్డి “జై సబితమ్మ.. జై జై సబితమ్మ” అని కూడా అన్నారని అక్కడి కార్యకర్తలు తెలిపారు. దీంతో తీగల, సబిత కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. నియోజకవర్గంలో ఎవరికి టిక్కెట్ వచ్చినా.. మరొకరి గెలుపు కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. ఇదే జరిగితే బీఆర్ఎస్‌కు మంచి పరిణామంగానే చెప్పాలి. అయితే, ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.