సదర్‌ ఉత్సవం అసలు చరిత్ర హైదరబాద్‌లోనే ఎందుకు జరుపుతారంటే

హైదరాబాద్‌ పేరు చెప్తే గుర్తొచ్చే ఉత్సవాల్లో సదర్‌ పండగ ఒకటి. తెలంగాణ మొత్తంలో కేవలం హైదరాబాద్‌లో మాత్రమే సదర్‌ ఉత్సవం నిర్వహిస్తారు. యాదవులంతా ఎంతో విశేషంగా జరుపుకునే ఈ ఉత్సవాన్ని హైదరాబాద్‌ వాసులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 4, 2024 | 03:43 PMLast Updated on: Nov 04, 2024 | 3:43 PM

Sadr Utsav Is A Real History Why Is It Celebrated In Hyderabad

హైదరాబాద్‌ పేరు చెప్తే గుర్తొచ్చే ఉత్సవాల్లో సదర్‌ పండగ ఒకటి. తెలంగాణ మొత్తంలో కేవలం హైదరాబాద్‌లో మాత్రమే సదర్‌ ఉత్సవం నిర్వహిస్తారు. యాదవులంతా ఎంతో విశేషంగా జరుపుకునే ఈ ఉత్సవాన్ని హైదరాబాద్‌ వాసులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. దున్నపోతులను ఆడిస్తూ ఎంజాయ్ చేస్తారు. దేశ నలుమూలల నుంచి దున్నలను తీసుకువచ్చి వాటితో డాన్స్‌లు చేయిస్తారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కడూఆ వివిధ రాష్ట్రాల నుంచి సదర్ ఉత్సవాల కోసం భారీ దున్నలు నగరానికి తీసుకువచ్చి ఉత్సవాన్ని నిర్వహించారు. అయితే ఈ సదర్ వేడుకలు హైదరాబాద్‌లోనే జరుపుకోడానికి చాలా కారణాలున్నాయి. హైదరాబాద్ నగరంలో సదర్ ఉత్సవాలను ధూమ్ ధామ్‌గా నిర్వహిస్తారు. సదర్ అనే ఉర్దూ పదానికి ఆత్మవిశ్వాసం, లీడర్ అనే అర్థాలు ఉన్నాయి. సదర్ అంటే హైదరాబాదీ వ్యవహారికం ప్రకారం ప్రధానమైనది అని అర్థం.

హైదరాద్‌లో జరిగే ప్రధాన ఉత్సవాల్లో సదర్ ఉత్సవం ఒకటి. నగరంలోని యాదవులు మాత్రమే సదర్ ఉత్సవాలను జరుపుకుంటారు. దీపావళి ముగిసిన రెండు రోజులకు సదర్ ఉత్సవాలను జరుపుకుంటారు. దీన్ని దున్నపోతుల ఉత్సవం అని కూడా అంటారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవం ప్రత్యేకత. యాదవులు జరుపుకునే ఈ సదర్ ఉత్సవాలు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి సింధు నాగరికతలో భాగంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలో సదర్ ఉత్సవాలు దేవగిరి యాదవ రాజుల కాలంలో వ్యాప్తి చెందాయి. వీరు కాకతీయుల కన్నా ముందే గొల్లకొండగా పిలిచే ప్రస్తుత గోల్కొండను కేంద్రంగా చేసుకుని జీవించేవాళ్లు. తర్వాతి కాలంలో గొల్లకొండ ప్రాంతాన్ని పాలించే గొల్లల రాణి కుతుబ్ షాహీ దండయాత్రలను ఐదు దున్నపోతుల సహాయంతో ఎదుర్కొని.. పోరాడి వీర మరణం పొందింది. ఈ నేపథ్యంలో దున్నపోతుల వీరత్వానికి ప్రతీకగా సదరు ఉత్సవాలు జరుపుతుంటారు. కుతుబ్ షాహిలు, మొగలులు, నిజాంముల కాలంలో యాదవ వీరులు సైనికాధికారులుగా, అంగరక్షకులుగా సమర్థవంతంగా పనిచేశారు.

నిజాం వారి సేవలను గుర్తించి గౌలిగూడను ఇనామ్‌గా ఇచ్చేశాడు. అక్కడి నుంచే సదర్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని కాచిగూడ, నారాయణగూడ, ఖైరతాబాద్‌, సైదాబాద్‌, బోయిన్‌పల్లి, ఈస్ట్‌మారెడ్‌ పల్లి, చప్పల్‌బజార్‌, మధురాపూర్‌, కార్వాన్, పాతబస్తీ ప్రాంతాల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. అన్ని ఏరియాల్లో కంటే నారాయణగూడలో జరిగే సదర్‌ ఉత్సవాలు ఇప్పటికీ హైలెట్‌గా నిలుస్తున్నాయి. యాదవ కులస్తులు ఎక్కువగా ఉండే మున్సిపల్‌ డివిజన్లు, కాలనీల్లో ఎక్కువ జరుగుతున్నాయి. సదర్ ఉత్సవాల కోసం పంజాబ్, హర్యానాల నుంచి భారీ శ‌రీరం క‌లిగిన దున్నపోతుల‌ను న‌గ‌రానికి తీసుకువ‌స్తారు. యాదవులకు ఈ ఉత్సవమే లక్ష్మీ పూజ లాంటింది. అందుకనే ప్రత్యేకించి సదరు ఉత్సవం రోజున వాటికి శుభ్రంగా స్నానం చేయించి, పూలదండలతో అలంకరించి పండుగలా జరుపుకుంటారు. యాదవుల ఐక్యతకు, మూగ జీవాల పట్ల వారికున్న ప్రేమానురాగాలకు నిదర్శనంగా నిలుస్తాయి సదర్ ఉత్సవాలు.

సదర్ పండగను దృష్టిలో పెట్టుకొని దున్నపోతులను పెంచుతారు. అవి దృఢంగా ఉండడంకోసం కొన్ని నెలలపాటు వాటికి మంచి పౌష్టికాహారం ఇస్తారు. పండగకు వారం ముందుగానే అలంకరణ ప్రారంభిస్తారు. దున్నపోతు శరీరంపై ఉన్న వెంట్రుకలను తొలగించి నల్లగా నిగనిగలాడేలా తయారు చేస్తారు. కొమ్ములను రంగురంగుల రిబ్బన్లతో చుడతారు. ఆ తర్వాత డప్పు చప్పుల్లతో డ్యాన్సులతో దున్న రాజులు బయలుదేరి తన చురుకుదనాన్ని, బలిష్టతను ప్రదర్శిస్తాయి. వాటిని ప్రధానంగా దాని వెనుక కాళ్లపై నిలబడేలా చేస్తారు. ఏ దున్నపోతైతే ఎక్కువ ఎత్తుకు తన ముందు కాళ్ళను లేపుతుందో ఆ దున్నపోతుకు బహుమతి ఇస్తారు. ఈ సదర్ ఉత్సవాలను హైదరాబాద్‌ వాసులే కాకుండా చుట్టుపక్క ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వస్తుంటారు.