ట్రంప్ కు చెక్ పెట్టేలా సౌదీ అరేబియా ప్లాన్ గాజా అభివృద్ధి, భవిష్యత్తుకు 4 ప్రతిపాదనలు
ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల వర్షానికి గాజా ధ్వంసమైంది. 15 నెలలకుపైగా యుద్ధం సాగడంతో...వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది పక్క దేశాల్లో తలదాచుకుంటున్నారు.

ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల వర్షానికి గాజా ధ్వంసమైంది. 15 నెలలకుపైగా యుద్ధం సాగడంతో…వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది పక్క దేశాల్లో తలదాచుకుంటున్నారు. రెండు దేశాలు శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి. యుద్ధానికి విరామం ప్రకటించాయి. శిథిలమైన గాజాను అభివృద్ధి చేయాలని ట్రంప్ ప్రణాళికలు వేస్తే…అందుకు ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా ఆలోచన చేస్తోంది. ఇంతకీ ఏంటది ?
ఇజ్రాయెల్ యుద్ధంతో గాజా శిథిలమైంది. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన గాజాను అభివృద్ది పేరుతో స్వాధీనానికి ట్రంప్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే గాజా పునర్నిర్మాణంలో భాగంగా పాలస్తీనా ప్రజలకు ఈజిప్టు, జోర్డాన్‌లో పునరావాసం కల్పించాలని ట్రంప్ ప్రతిపాదన చేశారు. దీనికి ఆ దేశాలు విముఖత వ్యక్తం చేశాయి. పునర్ నిర్మాణం పేరుతో పాలస్తీనా ప్రాంతాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రంప్‌పై ముస్లిం దేశాలు అనుమానం చేస్తున్నాయి.
గాజాను స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ పథకం వేస్తుంటే…దానికి ప్రత్యామ్నాయంగా మరో ప్రణాళికను సౌదీ అరేబియా నాయకత్వం ఆలోచిస్తోంది. హమాస్‌ను దూరం పెట్టి గల్ఫ్ దేశాల నేతృత్వంలో గాజా పునర్నిర్మాణానికి నిధిని సమకూర్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గాజా అభివృద్ధికి కొత్త పథకాన్ని తయారు చేసి…ట్రంప్ ముందు పెట్టాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే గాజా అభివృద్ది కోసం 4 ప్రతిపాదనలు అరబ్ దేశాలు రూపొందించినట్టు తెలుస్తోంది. వాటిలో ట్రంప్ ఆలోచనకు ప్రత్యామ్నాయంగా…ఈజిప్టు చేసిన ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాయి. హమాస్ ప్రమేయం లేకుండా గాజాను పాలించేందుకు…జాతీయ పాలస్తీనా కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసింది ఈజిప్టు. పాలస్తీనా ప్రజలను విదేశాలకు తరలించకుండా…అంతర్జాతీయ భాగస్వామ్యంతో గాజా అభివృద్ధి చేపట్టాలని సూచించింది.
గాజాను పాలించే అంశంలో జోక్యం చేసుకోబోమని ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది. తాము నిర్మించిన వాటిని నాశనం చేయదని ఇజ్రాయెల్ హామీ ఇచ్చిన తర్వాతే…గాజా పునర్నిర్మాణంలో ముందుకెళ్లాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. ఈ నెల 27న రియాద్‌లో జరగనున్న అరబ్ శిఖరాగ్ర సమావేశంలో…ఈజిప్ట్ ప్రతిపాదనపై సౌదీ అరేబియా, ఈజిప్టు, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చర్చించనున్నాయి. ఈ చర్చల్లో ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కీలకంగా వ్యవహరించనున్నారు. మరోవైపు గాజా అభివృద్ధి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పథకం ఒక్కటే ఉందని విదేశాంగ శాఖ మంత్రి రూబియో స్పష్టం చేశారు. నచ్చనివారు అంతకంటే మెరుగైన ప్రణాళికతో ముందుకు రావాలని అరబ్ శిఖరాగ్ర సమావేశంలో కామెంట్స్ చేశారు. దీంతో ఈజిప్టు నాలుగు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.