Kokapet: అమ్మడమే అభివృద్ధా…! కేసీఆర్ గారు ఇలా ఎంతకాలం…?

ప్రభుత్వం సంపద సృష్టించాలి. దాన్ని పంచాలి. కానీ ఇక్కడ మాత్రం సంపదను కరిగిస్తోంది. భవిష్యత్ తరాలకు భరోసా ఇవ్వాల్సింది పోయి భవిష్యత్తుపై భయం కల్పిస్తోంది. బాతు బంగారు గుడ్లు పెడుతుంటే తీసుకోవాలని కానీ దాన్ని కోసేస్తే ఎలా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 4, 2023 | 08:35 PMLast Updated on: Aug 04, 2023 | 8:35 PM

Selling Lands Is Development Kokapet Lands Got Highest Value In Auction

తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకాలను జోరుగా సాగిస్తోంది. సంపద సృష్టించాల్సిన సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిపోయి ఆస్తులను తెగనమ్ముతోంది. దాన్ని కూడా తమ ఘనతగా ఘనంగా చెప్పుకుంటోంది. ఇంతక భూములు అమ్మితేనే అభివృద్ధి జరిగినట్లా…? ఇలా ఎంతకాలం అమ్ముకుంటూ పోతారు…?

సంక్షేమ పథకాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం భూములు అమ్ముతోంది. రైతు బంధు అమలు చేయాలన్నా, దళిత బంధు ఇవ్వాలన్నా, రుణమాఫీ చేయాలన్నా ఒక్కటే మార్గం.. భూములు అమ్మేయ్… ఆ డబ్బును పథకాలకు పంచెయ్ అన్నట్లుంది సీన్. నిన్న నియోపొలిస్, రేపు మోకిలా, ఎల్లుండి బుద్వేల్, ఆ తర్వాత రాజేంద్రనగర్… రేపు మరి ఇంకెక్కడో..

భూములను అమ్మడమే అభివృద్ధా…?
నిజంగా భూములు అమ్మడమే అభివృద్ధా..? సంపద సృష్టించాల్సింది పోయి అమ్మడమే అభివృద్ధా…? ఇలా అమ్ముకుని వాటితో పథకాలు అమలు చేసుకుంటూ పోతే ఏంటి ఉపయోగం…? ఇలా ఎన్నాళ్లు భూములు అమ్ముకుని పోతారు…? ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి కొన్ని అమ్మారు. ఈసారి పథకాలకు 20వేల కోట్లు కావాలి కొంత భూమి అమ్మేశారు. మరో పథకానికి మరో పదివేల కోట్లు కావాలంటే మరో వంద ఎకరాలు అమ్ముతారా…? ఆ తర్వాత ఎన్నికల వేళ అవసరాలకు మరో పదివేల కోట్లు కావాలంటే ఏం చేస్తారు…? ఇంకొంత అమ్మేస్తారా…? ఇలా ఎన్నాళ్లు అమ్ముకుంటూ పోతారు…? కొన్నేళ్లు గడిస్తే అసలు భూములంటూ మిగులుతాయా….? భవిష్యత్ తరాలకు అసలు భూములు మిగులుతాయా..? కొన్నేళ్ల తర్వాత అసలు ప్రభుత్వ భూములంటూ ఉంటాయా… అప్పుడు అవసరాల కోసం ఏం చేస్తారు…?.. హైదరాబాద్‌లో భూములు అయిపోతే ఇక జిల్లాలపై పడి అక్కడివి కూడా అమ్మేస్తారా…? ఇవి సమాధానం లేని ప్రభుత్వం నుంచి సమాధానం రాని ప్రశ్నలే.

కేటీఆర్ గారు ఇదేంటి…?
తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకాలను గర్వంగా చెప్పుకుంటోంది. అభివృద్ధి కారణంగానే ఎకరం భూమి వంద కోట్లు పలికిందని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అభివృద్ధి కారణంగా ఎకరం వంద కోట్లు పలికితే మరి ఆ ఎకరం అమ్ముకోవడం ఎందుకు సార్.. ? అంత అభివృద్ధి జరిగితే ఆస్తులు పెరగాల్సింది పోయి అమ్ముకోవడాలెందుకు….? ఆంధ్రోళ్ల భూములు అమ్ముతున్నారంటూ ఉద్యమ సమయంలో తెగ ఆరోపించారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి.. వారికి మీకు తేడా ఏంటి…? బంగారు తెలంగాణ అంటే భూములు అమ్ముకోవడమేనా…? అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లైంది కదా నగరంలో ఒక్క పార్క్ కట్టారా..? హైదరాబాద్ చుట్ట ఇన్ని భూములున్నాయి కదా మరి ఒక్క ఎకరంలోనైనా చిన్న పిల్లల కోసమో, వృద్ధుల కోసమే ఒక్క పార్క్ కట్టారా…? లేదు పాతవాటిని ఏదో చేసామంటే చేసామనిపించడం తప్ప ఒక్కటీ కొత్తగా సిద్ధం చేయలేదు.

హైదరాబాద్‌లో మౌలిక వసతులేవి…?
హైదారాబాద్‌లో ఎకరం వంద కోట్లు పలుకుతోంది. వెరీగుడ్.. రియల్ ఎస్టేట్‌కు మంచి స్కోపుంది మంచిదే..ఎకరం ఇన్ని కోట్లు పలుకుతుంది కదా మరి నగరంలో ఆ స్థాయికి తగిన మౌలిక సదుపాయాలున్నాయా అంటే సమాధానం మాత్రం రాదు. వర్షం పడితే నగరవాసి బయటకు రాలేడు. రెండు సెంటీమీటర్ల వాన కురిస్తే నగరం వాగవుతుంది. అదే ఐదు సెంటీమీటర్లు పడితే పడవలపై తిరగాలి. ఎండాకాలంలో మురుగునీరు రోడ్లపై జీవనదిలా పారుతుంటుంది. హైటెక్ సిటీ లాంటి చోట్ల తప్ప చాలాచోట్ల ఇరుకురోడ్లు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు. మరి భూములు అమ్ముతున్నారు కదా ఆ డబ్బులతో ఏమైనా మౌలిక సదుపాయాలు కల్పిస్తారా అంటే అది లేదు. ఆ డబ్బు పంచుకుంటూ పోవడమే. మరి హైదరాబాద్ అభివృద్ధి అయ్యేది ఎప్పుడు…?

ప్రభుత్వం సంపద సృష్టించాలి. దాన్ని పంచాలి. కానీ ఇక్కడ మాత్రం సంపదను కరిగిస్తోంది. భవిష్యత్ తరాలకు భరోసా ఇవ్వాల్సింది పోయి భవిష్యత్తుపై భయం కల్పిస్తోంది. బాతు బంగారు గుడ్లు పెడుతుంటే తీసుకోవాలని కానీ దాన్ని కోసేస్తే ఎలా..?