Sengol: పార్లమెంటులో కొలువుదీరనున్న చారిత్రక చిహ్నం రాజదండం.. దీని విశిష్టత ఏంటంటే..
బంగారు రాజదండాన్ని భవనం లోపల స్పీకర్ కుర్చీ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అయితే, సెంగోల్ గురించి తెలిసింది చాలా తక్కువ. దీనికో చారిత్రక నేపథ్యం ఉంది. రాజదండాన్ని సెంగోల్ అంటారు.
Sengol: నూతన పార్లమెంట్ భవనం ఈ నెల 28, వచ్చే ఆదివారం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఈ భవనాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ భవనాన్ని నూతనంగా నిర్మించినప్పటికీ మన చారిత్రక నేపథ్యాన్ని మరువడం లేదు. భవనం లోపల కొత్తగా ఏర్పాటు చేయనున్న రాజదండం (సెంగోల్) దీనికి నిదర్శనం. బంగారు రాజదండాన్ని భవనం లోపల స్పీకర్ కుర్చీ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అయితే, సెంగోల్ గురించి తెలిసింది చాలా తక్కువ. దీనికో చారిత్రక నేపథ్యం ఉంది.
రాజదండాన్ని సెంగోల్ అంటారు. తమిళ పదమైన సెమ్మాయ్ (ధర్మం) నుంచి ఈ పదం వచ్చింది. 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చిందనే సంగతి తెలిసిందే. అంటే బ్రిటీష్ వారి నుంచి మనకు అధికార బదిలీ జరిగింది. అప్పటి బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటెన్ అధికార బదిలీకి అంగీకరించిన తర్వాత దీనికి గుర్తుగా ఏదైనా చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని భావించారు. ఈ విషయంపై నెహ్రూను అడిగారు. ఆయన తన పక్కనే ఉన్న రాజగోపాలాచారి సలహా అడిగారు. తమిళ సంప్రదాయంలో రాజుల కాలంలో అధికార బదిలీ సందర్భంగా పాటించే ఒక విధానం గురించి ఆయన నెహ్రూకు చెప్పారు. కొత్త రాజు బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రధాన పూజారి ఆ రాజుకు రాజదండం అందజేసే సంప్రదాయం ఉందని చెప్పారు.
అప్పట్లో చోళ రాజులు ఈ పద్ధతిని పాటించేవాళ్లని వివరించారు. దీంతో ఇది బాగా నచ్చిన నెహ్రూ.. అలాంటి రాజదండాన్ని తయారు చేయించే బాధ్యతను రాజగోపాలాచారికి అప్పగించారు. దీనికి అంగీకరించిన ఆయన అప్పటి తిరువడుత్తురై అథీనాన్ని సంప్రదించారు. రాజదండం తయారు చేయించాలని అక్కడి పీఠాధిపతులను ఆయన కోరారు. దీనికి అంగీకరించిన పీఠాధిపతులు మద్రాసులో నిపుణులైన స్వర్ణకారులతో బంగారంతో రాజదండాన్ని తయారు చేయించారు. దీని పొడవు ఐదు అడుగులు ఉంటుంది. ఈ రాజదండం పై భాగంలో నంది చిహ్నం ఉంటుంది. దీన్ని న్యాయానికి చిహ్నంగా ఏర్పాటు చేశారు. ఈ రాజదండాన్ని తయారు చేయించిన పీఠాధిపతులు తర్వాత దాన్ని లార్డ్ మౌంట్ బాటెన్‌కు అప్పగించారు.
తర్వాత ఆయన దగ్గరి నుంచి వెనక్కి తీసుకున్నారు. అనంతరం గంగా జలంతో శుద్ధి చేయించి, ఊరేగింపుగా భారత నూతన ప్రధాని నెహ్రూ వద్దకు తీసుకెళ్లారు. భారత స్వాతంత్ర్య ప్రకటన వెలువడటానికి 15 నిమిషాల ముందు ఈ రాజదండాన్ని ఆయనకు అందజేశారు. బ్రిటీషర్ల నుంచి ఇండియాకు అధికారం బదిలీ అయిందని చెప్పడానికి గుర్తుగా దీన్ని అందించారు. ఆ తర్వాత ఈ రాజదండం అలహాబాద్‌లోని ఒక మ్యూజియంలో పొందు పరిచారు. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన ఈ దండాన్నే ఇప్పుడు పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేయబోతున్నారు.