తుంగభద్ర గేటు ఏర్పాటు ఇంత రిస్కా…? ప్రాసెస్ ఇదే…!
తుంగభద్ర డ్యామ్ క్రస్ట్‌గేట్ కొట్టుకుపోయిన ఘటనలో పనులు వేగవంతం చేసారు అధికారులు. కొత్త స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. స్టాప్ లాగ్ ఏర్పాటు చేయాలంటే మరో ఎనిమిది టీఎంసీల నీరు డ్యామ్ నుంచి విడుదల కావాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ లో 83 టీఎంసీల నీరు ఉందని అధికారులు వెల్లడించారు. నీటి సామర్థ్యాన్ని 76.48 టీఎంసీలకు తగ్గించి గేట్లు బిగించాలని ఇరిగేషన్ నిపుణుడు కన్నయ్య నాయుడు సూచించారు.
ఈ నేపథ్యంలో మరికొన్ని గంటలు వేచి చూడాలని అధికారులు భావిస్తున్నారు. ఆగష్టు 20వ తేదీ వరకు తుంగభద్ర డ్యామ్ పై రాకపోకలపై నిషేధాన్ని అమలు చేయాలని కొప్పల జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. ఆనకట్ట మరియు నది పరిసర ప్రాంతాలలో ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఆనకట్ట చుట్టూ మరియు నదికి 100 మీటర్ల వరకు నిషేధం అమలు అవుతుంది.
డ్యాం కు గేటు అమర్చడం అనేది ఒక సాహసం అనే చెప్పాలి. నీటి ప్రవాహం కొనసాగుతున్న సమయంలోనే గేటుని అమరుస్తారు. దీనికి మొత్తం పది మంది బృందం చేస్తుంది. భారీ గేటు కావడంతో… గేటును కత్తిరించి తీసుకొస్తారు అధికారులు. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా గేటుని ఏర్పాటు చేసి ఆ తర్వాత అతికిస్తారు. ఇది ఒకరకంగా ఇంజనీరింగ్ సాహసం అనే చెప్పాలి. ఈ గేటు ఏర్పాటు పనులు దాదాపు నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.