Sharad Pawar: ఒకే వేదికపైకి బాబాయ్-అబ్బాయ్.. మోదీతో కలిసి కనిపించనున్న శరద్ పవార్, అజిత్
మోదీ అవార్డు స్వీకరించనున్న ఈ కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయనతోపాటు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు, అజిత్ పవార్ కూడా హాజరవుతారు. ఎన్సీపీలో తిరుగుబాటు తర్వాత శరద్, అజిత్ కలవబోతుండటం ఇదే మొదటిసారి.
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇటీవల రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆ పార్టీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. అది కూడా ప్రధాని మోదీతో. వచ్చే నెల 1న మహారాష్ట్రలోని పూనేలో ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కార ప్రదానోత్సవం జరగనుంది. తిలక్ స్మారక మందిర్ ట్రస్టు ఈ పురస్కారాన్ని అందించనుంది. మోదీ అవార్డు స్వీకరించనున్న ఈ కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయనతోపాటు మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బియాస్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు, అజిత్ పవార్ కూడా హాజరవుతారు. ఎన్సీపీలో తిరుగుబాటు తర్వాత శరద్, అజిత్ కలవబోతుండటం ఇదే మొదటిసారి.
ఇటీవల ఎన్సీపీలో తిరుగుబాటు తలెత్తిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత శరద్ అన్న కొడుకు, ఆ పార్టీ కీలక నేత అజిత్ పవార్ కొంత మంది ఎమ్మెల్యేలతో పార్టీపై తిరుగుబాటు చేశాడు. తన అనుకూల ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరిపోయారు. దీంతో ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం శరద్‌కు మద్దతిస్తే, ఇంకో వర్గం అజిత్ వెంట నడిచింది. ఈ విషయంలో శరద్ పవార్.. అజిత్‌తోపాటు రెబల్ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. ఈ విషయంలో ఇద్దరిమధ్యా మాటల యుద్ధం నడిచింది. గతంలో ఎన్సీపీ గురించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా శరద్ పవార్ గుర్తు చేశారు.
గతంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఎన్సీపీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ స్కామ్, ఇరిగేషన్ స్కామ్, అక్రమ మైనింగ్ స్కామ్ వంటి వివిధ కుంభకోణాల్లో రూ.70 వేల కోట్ల అవినీతికి ఎన్సీపీ పాల్పడిందన్నారు. దీనిపైనే తాజాగా శరద్ పవార్ వ్యాఖ్యానిస్తూ “ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఎన్సీపీ నేతలను కలుపుకోవడం ద్వారా ఎన్సీపీ నేతలకు అవినీతి కేసులో విముక్తి కల్పించినట్లున్నారు. ఎన్సీపీ నుంచి కొందరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తుండటంపై కూడా నాకు సంతోషంగా ఉంది. దీని ద్వారా మా పార్టీ నేతలు అవినీతికి పాల్పడలేదని, మోదీ చేసిన ఆరోపణలు నిజం కాదని తేలిపోయింది. ఈ విషయంలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నా” అన్నారు. అంటే బీజేపీలో చేరడం ద్వారా తమ పార్టీ నేతలకు అవినీతి నుంచి విముక్తి కలిగిందని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. గతంలో శరద్ పవార్ గురించి కూడా మోదీ సానుకూలంగా మాట్లాడారు.
గుజరాత్ రాజకీయాల్లో తాను చేరిన తొలినాళ్లలో శరద్ పవార్ తనను గౌరవించినట్లు కూడా మోదీ 2016లో గుర్తు చేశారు. కాగా, ఇంతకాలం వరకు మోదీకి, ఎన్సీపీకి మధ్య విబేధాలు కొనసాగాయి. ఇప్పుడు అవన్నీ తొలగిపోయినట్లు కనిపిస్తోంది. ఇక శరద్ పవర్, అజిత్ పవార్ ఒకేసారి మోదీతో కలిసి వేదిక పంచుకోబోతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఆలోపు ఎన్సీపీలో విబేధాలు పూర్తిగా తొలగిపోయి ఇద్దరూ కలిసిపోతారేమో చూడాలి.