Sharad Pawar: ఎన్సీపీలో సంక్షోభం ముగిసిందా..? అజిత్‌తో పవార్ భేటీ..?
శరద్ పవర్.. ఆ పార్టీ తిరుగుబాటు నేత, తన అన్న కొడుకు అజిత్ పవార్‌తో భేటీ అవ్వడం సంచలనం కలిగిస్తోంది. నిజానికి ఈ భేటీ రహస్యంగానే జరిగినప్పటికీ, విషయం నెమ్మదిగా బయటకు వచ్చింది. దీంతో మహా రాజకీయాల్లో ఏం జరగబోతుంది అన్న చర్చ మొదలైంది.
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవర్.. ఆ పార్టీ తిరుగుబాటు నేత, తన అన్న కొడుకు అజిత్ పవార్‌తో భేటీ అవ్వడం సంచలనం కలిగిస్తోంది. నిజానికి ఈ భేటీ రహస్యంగానే జరిగినప్పటికీ, విషయం నెమ్మదిగా బయటకు వచ్చింది. దీంతో మహా రాజకీయాల్లో ఏం జరగబోతుంది అన్న చర్చ మొదలైంది. ఈ భేటీ శనివారమే జరిగింది. దీనిపై ఆదివారం శరద్ పవార్ మాట్లాడుతూ.. అజిత్ తన బంధువని, అందుకే కలిశానని, ఇందులో రహస్యమేమీ లేదన్నారు.
ఈ సందర్భంగా బీజేపీతో పొత్తు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. “కొందరు సన్నిహితులు నన్ను కూడా బీజేపీలో చేరాలి అని సూచించారు. బీజేపీవైపు తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఎన్సీపీ జాతీయాధ్యక్షుడిగా చెబుతున్నా.. మా పార్టీ బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు. బీజేపీతో ఏ రకమైన పొత్తైనా మా పార్టీ పాలసీలకు విరుద్ధం. మా పార్టీలో కొందరు (అజిత్ వర్గం) మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంతో కలిసి వేరే దారి ఎంచుకున్నారు. మమ్మల్ని కూడా అటువైపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం మాతో చర్చలు జరిపారు” అని వెల్లడించారు. ఈ అంశంపై ఎన్సీపీ రాష్ట్ర నేత ఒకరు మాట్లాడుతూ.. తాను కూడా ఈ భేటీకి వెళ్లానని, అయితే, కొంత సేపటి తర్వాత బయటకు వచ్చేశానన్నారు. ఈ భేటీలో ఏం చర్చించారో తనకు తెలియదన్నారు. గతంలో శివసేన, కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రలో ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, శివసేనలో చీలికతో ఈ కూటమి విడిపోయింది. శివసేనలో షిండే వర్గం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ షిండే కూటమిలో చేరిపోయారు.
మరోవైపు శరద్ పవార్ మాత్రం కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమితో ఉంటున్నారు. ఇలా ఒకే పార్టీ రెండు కూటముల్లో ఉండటం రాజకీయాల్లో ఒక విచిత్ర పరిణామమే. అయితే, దీని వెనుక శరద్ పవార్ మైండ్ గేమ్ ఉందని చాలా మంది అభిప్రాయం. బీజేపీకి, కాంగ్రెస్‌కు దగ్గరగా ఉంటూ రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. ఎన్సీపీలో చీలిక కూడా శరద్ పవార్ ప్లానే అని మరికొందరి వాదన. కొంతకాలంగా బయట మాత్రం అజిత్ వర్గం, శరద్ పవార్ వర్గం అంటూ ప్రచారం జరుగుతుంటే.. ఇద్దరూ రహస్యంగా చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలాంటి సమయంలో ఇండియా కూటమికి శరద్ పవార్ పూర్తిగా బైబై చెబుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శరద్ పవార్ ఈ ప్రచారాన్ని ఖండించినప్పటికీ.. ఆయన వ్యూహాల్ని అంచనా వేయడం కష్టం. ఒకవేళ నిజంగానే ఇండియా కూటమికి ఎన్సీపీ దూరమైతే.. జాతీయ రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.