షరీఫ్ ప్రభుత్వం పాలిట సివంగి, ఒక్క అరెస్టుతో పాకిస్తాన్‌ ధ్వంసం

మహరంగ్ బలోచ్.. బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో చరిత్ర గుర్తుంచుకునే యోధుల్లో మొదటి వరుసలో నిలిచే పేరిది. ఒంటరిగా మొదలై వందలు, వేల మందిగా మారి ఇస్లామాబాద్‌ను నిలువునా వణికించిన హిస్టరీ ఆమెది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2025 | 01:29 PMLast Updated on: Mar 26, 2025 | 1:29 PM

Sharifs Government Is In Shambles Pakistan Is Destroyed With One Arrest

మహరంగ్ బలోచ్.. బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో చరిత్ర గుర్తుంచుకునే యోధుల్లో మొదటి వరుసలో నిలిచే పేరిది. ఒంటరిగా మొదలై వందలు, వేల మందిగా మారి ఇస్లామాబాద్‌ను నిలువునా వణికించిన హిస్టరీ ఆమెది. తమ ప్రాంతానికి స్వేచ్ఛ సాధించడం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ హింసాత్మక మార్గాన్ని ఎంచుకుంటే.. మహరంగ్ బలోచ్ మాత్రం శాంతి మార్గాన్ని ఎంచుకుంది. బలూచిస్తాన్ మహిళలను కొదమసింహాలుగా మార్చి ఇస్లామాబాద్‌పై గర్జించేలా చేసింది. కట్‌చేస్తే.. పాక్ ప్రభుత్వం ఆ పోరాటయోధురాలిని అరెస్టు చేసి మాయం చేసేసింది. బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరులో ఇది అతిపెద్ద మలుపుగా, పాకిస్తాన్ చేసిన అతిపెద్ద తప్పుగా మారబోతోంది. ఎందుకంటే, మహరంగ్‌కు మద్దతుగా బలూచిస్తాన్ తగలబడిపోతోంది. ఇంతకూ, ఎవరీ మహరంగ్ బలోచ్? ఒక సాధారణ డాక్టర్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎదురించే ఉద్యమ శక్తిగా ఎలా మరింది? బలూచిస్తాన్ పోరాటాన్ని ఆమె అరెస్టు ఎలా మలుపుతిప్పబోతోంది? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

పాకిస్తాన్ ఆర్మీకి ఎదురు నిలిచిన ఈ డేరింగ్ లేడీనే మహరంగ్ బలోచ్. 18 ఏళ్ల క్రితం ఒక సాధారణ వైద్యురాలు. ఇప్పుడు మాత్రం ఓ పోరాట యోధురాలు. బలూచిస్తాన్‌లో దశాబ్దాలుగా జరిగిన అణచివేతలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మహిళా లోకాన్ని ముందుండి నడిపిస్తున్న ధీర వనిత. ఓ సాధారణ వైద్యురాలు ఉద్యమకారిణిగా మారి మహిళలందరినీ నడిపించడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. మహరంగ్ కుటుంబం బలూచిస్తాన్‌లోని కలాత్‌లో నివాసముంటుంది. ఆమెకు ఐదుగురు సోదరీమణులు, ఒక సోదరుడున్నాడు. ఆమె తండ్రి అబ్దుల్ గఫార్ బలోచ్ కార్మికుడు, వామపక్ష రాజకీయ కార్యకర్త. మహరంగ్ తండ్రిని 2009లో కరాచీలోని ఆసుపత్రికి వెళుతుండగా పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసింది. ఆ సమయంలో మహరంగ్ బలోచ్ వయస్సు కేవలం 16 ఏళ్లు మాత్రమే. అయినప్పటికీ ఆమె భయపడలేదు.. తండ్రి కోసం పాకిస్తాన్ ప్రభుత్వానికే వ్యతిరేకంగా నిరసనకు దిగింది. ఆ సమయంలో విద్యార్థి ప్రతిఘటన ఉద్యమంలో ప్రజాదరణ పొందింది. అయితే, మహరంగ్ బలోచ్ తండ్రిని 2011లో పాకిస్తాన్ ఆర్మీ చిత్ర హింసలుపెట్టి చంపేసింది. ఇక్కడితో పాకిస్తాన్ ఆర్మీ ఆగలేదు.. తర్వాత మహరంగ్ సోదరుడినీ కిడ్నాప్ చేసింది. 2017లో ఆమె సోదరుడిని ఎత్తుకుపోయిన పాక్ ఆర్మీ.. 3 నెలలపాటు నిర్బంధంలో పెట్టింది. ఈ పరిస్థితులే ఒక సాధారణ వైద్యురాలిని ఉద్యమకారిణి గా మార్చాయి.

ఇది ఆమె ఒక్కరి కథే కాదు.. బలూచిస్తాన్‌లోని చాలా మంది మహిళల కథే ఇది. అందుకే ఆమె మొదలు పెట్టిన పోరాటంలో బలూచిస్తాన్ మహిళలు ఒక్కొక్కరిగా చేరారు. తమ కుటుంబ సభ్యులను ఎత్తుకుపోయిన పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిడికిళ్లు బిగించారు. కట్‌చేస్తే.. బీఎల్ఏకు దీటుగా మహిళా లోకం పోరాటం మొదలైంది. ఆ పోరాటం 2023లో ఇస్లామాబాద్ వెన్నులో వణుకు పుట్టించింది. బలూచిస్తాన్‌ అణచివేత, కిడ్నాపింగ్‌లకు వ్యతిరేకంగా ఆ ప్రాంత మహిళలను ఉద్యమంలోకి దించారు మహరంగ్ బలోచ్.. 2023 డిసెంబర్‌లో దాదాపు 200మంది మహిళలతో ఇస్లామాబాద్‌వైపు దూసుకెళ్లారు. ఈ పరిణామాన్ని ఊహించలేకపోయిన పాకిస్తాన్ ప్రభుత్వం మహరంగ్‌తో పాటు పలువురు మహిళలను అదుపులోకి తీసుకుంది. కానీ, ఈ ర్యాలీ ద్వారా బలూచిస్తాన్ గొంతును ప్రపంచానికి వినిపించడంలో మహరంగ్ బలోచ్ విజయం సాధించారు. నాటి నుంచి ఆమె పేరు వినిపిస్తేనే ఇస్లామాబాద్‌ ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. తాజాగా షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహరంగ్ పోరాటంలో గేరు మార్చారు. బలూచిస్తాన్‌లో భారీ నిరసనకు పిలుపునిచ్చారు. బలూచిస్తాన్ అణచివేతలకు వ్యతిరేకంగా క్వెట్టాలో ఆందోళనలు నిర్వహించారు. అసలే బీఎల్ఏ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న షరీఫ్ సర్కార్ మహరంగ్ బలోచ్‌ను అరెస్టు చేయాలని డిసైడ్ అయింది. ఇప్పుడా నిర్ణయమే పాక్ కొంప ముంచబోతోంది.

బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటాన్ని అణచివేసే క్రమంలో షరీఫ్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు ఇదే. క్వెట్టాలో శాంతియుతంగా నిరసన చేస్తున్న మహరంగ్, మరికొంత మందిరిని అరెస్టు చేసింది. పాకిస్తాన్‌లోని హుడ్డా జైలులో మహరంగ్‌ను బంధించినట్టు ఆమె సోదరుడు సోషల్ మీడియాలో తెలిపాడు. 18 ఏళ్ల క్రితం మహరంగ్ తండ్రిని బంధించిన జైలు కూడా అదే. పైగా నాడు తమ తండ్రిని కలవనివ్వకుండా అడ్డుకున్నట్టే ఇప్పుడు తన సోదరిని కూడా కలవనీయడం లేదని ఆమె సోదరుడు భావోద్వేగానికి గురయ్యాడు. తర్వాతే బలూచిస్తాన్‌లోని మహిళా లోకం స్వాతంత్ర్య ఉద్యమంలో గేరు మార్చింది. మహరంగ్ అరెస్టుకు నిరసనగా వేల మంది రోడ్లపైకి వస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫలితంగా ఈ ఉద్యమం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవడం కారణంగా బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటాన్ని అంతర్జాతీయ సమాజం పెద్దగా పట్టించుకోలేదు. కానీ, మహరంగ్ అరెస్టుతో అంతర్జాతీయ సమాజం అటెన్షన్ బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంపై పడింది. బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేతలపైనా ప్రశ్నలు మొదలయ్యాయి. వివరంగా చెప్పాలంటే మహరంగ్ బలోచ్ అరెస్టు బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో కీలక మలుపుగా మారుతోంది. మహరంగ్ బలోచ్‌కు కనుక జరగకూ డనిదేదైనా జరిగితే ఇస్లామాబాద్ తగలబడిపోవడం ఖాయం.