షాకింగ్: రాజ్యసభకు షర్మిల.. కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్ రెడీ
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న పేరు వైయస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనంగా ఉన్నా సరే షర్మిల మాత్రం బలంగా తన వాయిస్ వినిపిస్తున్నారు.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న పేరు వైయస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనంగా ఉన్నా సరే షర్మిల మాత్రం బలంగా తన వాయిస్ వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా సరే బలోపేతం చేయాలని షర్మిల కంకణం కట్టుకుని మరీ పనిచేస్తున్నారు. రాజకీయంగా వైసిపి బలహీనంగా కనబడటం దానికి తోడు వైఎస్ జగన్ ప్రజల్లోకి రాకపోవడాన్ని షర్మిలా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అలాగే బిజెపి కూటమిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న షర్మిల.. వైయస్ జగన్ ను కూడా గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో షర్మిల చేస్తున్న పోస్ట్లు ఈ మధ్యకాలంలో కాస్త సెన్సేషన్ అవుతున్నాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా షర్మిల పనితీరుపై సంతృప్తికరంగానే కనపడుతుంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సంబంధించి షర్మిలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ షర్మిల విషయంలో చాలా పాజిటివ్ ఒపీనియన్ తో ఉన్నారు. 2029 లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనీసం 10 నుంచి 15 ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా షర్మిల ఒక రూట్ మ్యాప్ కూడా ఇప్పటికి రెడీ చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. తెలంగాణ కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల తన వ్యూహాలను పార్టీ అధిష్టానం ముందు ఉంచారు.
ఇక త్వరలోనే రాష్ట్రంలో ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని షర్మిల కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను పార్టీ అధిష్టానానికి పంపించారు షర్మిల. ఇక షర్మిల దూకుడు చూసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమెకు కీలక పదవి కట్టబెట్టేందుకు కూడా సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా భావించే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆమెకు చోటు కల్పించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. షర్మిల మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఈ పదవి చాలా ఉపయోగపడుతుంది అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది. వైయస్ మరణం తర్వాత ఏపీలో పెద్దగా కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు కనబడలేదు.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కాస్త బలంగా కనపడిన ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. రాజకీయ పార్టీ పెట్టడం ఆ తర్వాత బిజెపిలో జాయిన్ అవ్వడం వంటివి జరిగాయి. ఇక ఆ తర్వాత షర్మిల మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కాస్త బలంగా కనబడుతున్నారు. వైయస్ అభిమానులను ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పేందుకు కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను వాడుకోవాలని భావిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కూడా షర్మిల మేలు చేయడంతో ఆమె రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాలని కాంగ్రెస్ అగ్ర నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
ఇక మరో విషయం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సెన్సేషన్ అవుతుంది. షర్మిలను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైనట్లు సమాచారం. రాజ్యసభ నుంచి షర్మిలను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు కల్పించడంతో పాటుగా రాజ్యసభలో కూడా అవకాశం కల్పించాలని అదే జరిగితే కచ్చితంగా షర్మిల మరింత దూకుడుగా పని చేస్తారని ఏపీలో అది కచ్చితంగా పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.