MLC Elections: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ..

వైసీపీకి వరుసగా రెండో షాక్‌ తగిలింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన ఝలక్‌తో వైసీపీకి దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. 23 ఓట్లతో గెలిచారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 23, 2023 | 10:00 PMLast Updated on: Mar 23, 2023 | 10:00 PM

Shock To Ysrcp In Mlc Elections

ఇది వైసీపీకి కోలుకోలేని దెబ్బగా మారింది. నిజానికి టీడీపీకి ఉన్న ఒరిజినల్‌ బలం 19 ఎమ్మెల్యేలు మాత్రమే. కోటం రెడ్డి, ఆనం రెబల్స్‌గా మారడంతో ఈ బలం 21కి చేరింది. ఆ 22వ ఎమ్మెల్యే ఎవరనేదానిపై ఉదయం నుంచి టెన్షన్‌ కనిపించింది. అయితే టీడీపీ మాత్రం విజయంపై మొదటి నుంచి ధీమాగా కనిపించింది. ఒక్కరు మాత్రమే క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడతారనుకుంటే.. ఇద్దరు టీడీపీ అభ్యర్థికి ఓటేయ్యడం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఆ ఇద్దరు ఎవరన్నదానిపై వైసీపీలో చర్చ మొదలైంది. రకరకాల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. టీడీపీకి హ్యాండ్‌ ఇచ్చి వైసీపీకి మారిన వాసుపల్లి గణేష్‌, కరణం బలరాం వైపే వేళ్లన్నీ చూపిస్తున్నాయి.

టీడీపీ కోవర్టులుగానే వాళ్లు వైసీపీలో చేరారని ఓ వర్గం అంటోంది. ఈ ఇద్దరితోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి మీద కూడా అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఫ్యాన్‌ పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఈ ఇద్దరే క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి ఉంటారా అన్న అనుమానాలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక ఎన్నికలకు ముందే వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ టచ్‌లోకి వెళ్లిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సరైన బలం లేకపోయినా టీడీపీ తరఫున చంద్రబాబు అభ్యర్థిని నిలబెట్టడం ఆ అనుమానాలకు మరింత బలమిస్తోంది.

ఈ క్రాస్‌ ఓటింగ్‌ మీద రాజకీయ వర్గాలతో పాటు జనాల్లోనూ వినిపిస్తున్న చర్చ ఒక్కటే! ఇద్దరు ఎమ్మెల్యేలు చేజారిపోతుంటే వైసీపీ ప్రభుత్వం నిద్రపోతుందా.. ఇంత పెద్ద ఇంటలిజెన్స్‌ వ్యవస్థ ఉండి ఏం లాభం. ఇదేనా ప్రభుత్వం పనితీరు అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏమైనా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఫలితంతో వైసీపీకి భారీ నష్టమే. అసలే రాష్ట్రం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో షాక్‌ తగిలింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలోనూ అదే పరిస్థితి. ఈ ఫలితాలతో వైసీపీ భవిష్యత్తు ఏంటో తేలిపోయిందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలో వచ్చేది తమ ప్రభుత్వమేనని టీడీపీ వర్గాలంటున్నాయి.