Sidda Ramaiah: ఇరకాటంలో సిద్ధరామయ్య.!

కర్ణాటకలో( Karnataka) కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మాజీ సీఎం సిద్ధరామయ్యకు (Siddaramaiah) తెలివిగా చెక్‌ పెట్టింది పార్టీ హైకమాండ్. అంతా నీ చేతుల మీదుగా అంటూనే ఆయన చేతులు కట్టేసింది. పార్టీకి పాజిటివ్ వేవ్ ఉన్న సమయంలో మరోసారి గెలిచి సీఎం సీటుపై కూర్చోవాలనుకున్న సిద్ధూకు పరాభవం తప్పేలా లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2023 | 08:15 PMLast Updated on: Apr 16, 2023 | 8:15 PM

Sidda Ramaiah Vs Dk Siva Kumar

కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రజాభిమానం ఉంది. ఇక డీకే శివకుమార్‌కు( DK. Shiva Kumar) అంగ, ఆర్ధికబలం ఉంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఇరువురు నేతలు గట్టిగానే పోరాడుతున్నారు. మనసులో ఏమున్నా పైకి మాత్రం కలిసే పనిచేస్తున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే వీళ్లిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది ఆసక్తిని రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రిగా ప్రజల్లో పరపతి ఉన్న సిద్ధూను సీఎంను చేస్తారా లేక పార్టీ బాధ్యతలను మోస్తున్న డీకేను సీటులో కూర్చోబెడతారా అన్నది ఆసక్తిగా మారింది. అయితే కాంగ్రెస్ ( Congress) హైకమాండ్ సిద్ధూ విషయంలో వ్యవహరించిన తీరు కొత్త అనుమానాలు రేపుతోంది. అసలు సిద్ధరామయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారా లేదా అన్నదే సందేహాలు రేపుతోంది.

ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధరామయ్యకు పర్మనెంట్ సీటు లేదు. అయితే గతంలో రెండుసార్లు వరుణ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన కొడుక్కు ఆ సీటును ఇప్పించుకుని తాను చాముండేశ్వరి, బాదామి నుంచి పోటీ చేశారు. అందులో చాముండేశ్వరిలో ఓడిపోయారు. బాదామిలో కూడా స్వల్ప ఆధిక్యంతో గెలిచారు. ఈసారి ఆయన మళ్లీ వరుణ ( Varuna) నుంచే బరిలోకి దిగుతున్నారు. అయితే సిద్ధూ కోలార్ (Kolar) నుంచి కూడా పోటీ చేయాలని ఆశించారు. రెండు సీట్లలో పోటీ చేస్తే ఒకటి పోయినా మరోటి ఉంటుందని ఆయన భావించారు. పైగా అక్కడ పోటీ చేయాలన్నది ఆయన చిరకాల కోరిక కూడా. అయితే పార్టీ ఆలోచన వేరేగా ఉంది. ఒక్కరికి ఒక్క సీటు అని చెబుతూ ఈసారికిలా సర్దుకుపొమ్మని సిద్దూకు చెప్పింది. పైగా రెండు సీట్లలో బరిలోకి దిగితే అది రాష్ట్రమంతా ప్రచారంలో పాల్గొనడం కష్టమవుతుందని చెప్పింది. పైగా ఇది తప్పుడు సంకేతాలు ఇస్తుందని నచ్చచెప్పింది. సన్నిహితులు కూడా అదే సూచించడంతో సిద్ధరామయ్య కూడా అన్యమనస్కంగానే వెనక్కు తగ్గారు.

నిజానికి వరుణ గతంలో సిద్ధరామయ్యకు సేఫ్ సీట్ అయినా ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ప్రజల్లో కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. దానికి మించి సిద్ధూను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. అందుకే ఎవరూ ఊహించని విధంగా గృహనిర్మాణశాఖ మంత్రి సోమన్న( Somanna)ను రంగంలోకి దించింది. సోమన్న సీనియర్‌ మాత్రమే కాదు లింగాయత్‌ల్లో గట్టి పట్టున్న నేత. సోమన్న ఎంట్రీ సిద్దరామయ్యకు గట్టి షాక్ ఇచ్చేదే.. ఇప్పుడు ఆయన గెలుపుకోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి. ఎక్కువగా తన నియోజకవర్గానికే పరిమితం కావాలి. ఏమైనా తేడా వచ్చి ఓడిపోతే మాత్రం మరోసారి సీఎం కావాలన్న ఆయన కల ముగిసినట్లే. అందుకే ఆయన తన మద్దతుదారులతో గెలుపుపై మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు అటు సిద్ధరామయ్య, ఇటు సోమన్న ఇద్దరూ మఠాల చుట్టూ తిరుగతున్నారు.

పార్టీ ఎన్నికల్లో గెలిచి, సిద్ధరామయ్య కూడా విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పీఠం కోసం డీకే శివకుమార్‌తో పోటీ పడాల్సి ఉంటుంది. డీకేకు రాహుల్‌ గాంధీ కేండిడెట్‌గా పేరుంది. పైగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడమే కాకుండా అవసరాలను తీరుస్తున్నారు కూడా. ఒకవేళ తేడా వచ్చి సిద్ధూ ఓడిపోతే మాత్రం డీకేకు తిరుగుండదు. గెలిస్తే మాత్రం ఎవరిని చేస్తారన్నది ఆసక్తికరమే.. కాంగ్రెస్‌లో ఏదైనా సాధ్యమే..