Sidda Ramaiah: పశువులకాపరి నుంచి పరిపాలనాదక్షుడిగా ఎదిగిన సిద్దరామయ్య పూర్తి రాజకీయ ముఖచిత్రం..
దేశ రాజకీయాలను శాసించే కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ గెలుపుతో రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నారు సిద్దరామయ్య. ఈయన జీవితంలో ఎటు చూసినా ఎడారి తెరలు, ఎదురు దెబ్బల కలలు కనిపిస్తాయి.
సిద్దరామయ్య 1948 ఆగస్ట్ 12 తేదీన మైసూరు జిల్లాలోని సిద్ధరామనహుండి అనే గ్రామంలో పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పదేళ్ల ప్రాయం వరకూ బడికి వెళ్లకుండా పశువుల కాపరిగా వెళ్లి ఇంట్లోని వారికి చేదోడు వాదోడుగా ఉండే వారు. కుటుంబంలోని ఐదుగురి సంతానంలో సిద్దరామయ్య రెండోవాడు. విద్యాభ్యాసం నిదానంగా సాగినప్పటికీ బీఎస్సీ డిగ్రీ చేసి మైసూరు యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. కర్ణాటక ప్రాంత బీసీ సామాజికవర్గంలోని కురబ వర్గానికి చెందిన వ్యక్తి. ఈ రాష్ట్ర జనాభాలో కురబలది 9 శాతం పైగా ఉంటుంది. న్యాయవాదిగానే కాకుండా న్యాయశాస్త్రాన్ని భోదించేవారు.
ఈయన సోషలిస్ట్ భావజాలానికి చెందిన వ్యక్తిగా చెబుతారు. ఎందుకంటే ఇతను పెరిగిన వాతావరణం అలాంటిది. సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియా భావజాలాలను పునికి పుచ్చుకున్నారు. మైసూరు జిల్లాకోర్టులో న్యాయవాద వృత్తి చేసే సమయంలో నంజుండ స్వామి అనే న్యాయవాది ప్రేరణమేరకు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇందిరాగాంధీ హయంలో కాంగ్రెస్ వ్యతిరేక శక్తిగా ఉన్న భారతీయ లోక్ దళ్ పార్టీ నుంచి టికెట్ లభించింది. తొట్టతొలిసారి చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1983లో అప్పటి ఏడవ కర్ణాటక శాసనసభకు శాసనసభ్యునిగా ఎన్నికైయ్యారు సిద్దరామయ్య. అప్పుడు వేసిన రాజకీయ ప్రస్థానం నేటి వరకూ సాగుతూనే ఉంది. ఆతరువాత కొంత కాలానికి జనతా పార్టీలో చేరి కన్నడ భాష నిఘా కమిటీ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైయ్యారు. 1985లో వచ్చిన ఉపఎన్నికల్లో శాసనసభ్యునిగా ఎన్నికవడంతో ఈ సారి రామకృష్ణ హెగ్డే క్యాబినెట్లో పశుసంవర్థక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 1989 ఎన్నికల్లో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఎం చంద్రశేఖర మూర్తి చేతిలో ఓటమిని చవిచూశారు సిద్దరామయ్య.
1992 లో దేవెగౌడ స్థాపించిన జనతాదళ్ పార్టీలో చేరి 1994లో మళ్లీ తిరిగి అసెంబ్లీకి ఎన్నికై దేవెగౌడ క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి 2004లో తిరిగి శాసనసభకు ఎన్నికయ్యారు. భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ధరమ్ సింగ్ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉపముఖ్యమంత్రిగా కూడా పదవిని అధిరోహించారు. రాజకీయంగా పార్టీలో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో దేవేగౌడ 2005లో జేడీఎస్ నుంచి సిద్దరామయ్యను బహిష్కరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరి 2006 ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి గెలుపొందారు. ఆతరువాత 2008లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.
2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో క్రియాశీలకపాత్రపోషించడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లపాటూ సంపూర్ణంగా కర్ణాటక ముఖ్యమంత్రిగా పరిపాలించిన రెండవ సీఎంగా పేరు గణించారు. 2018లోనూ బదామి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే అప్పుడు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో కుమారస్వామిని ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుంది. అప్పుడు కూడా ఆర్థికశాఖ మంత్రిగా కీలకమైన బాధ్యతలు చేపట్టారు. ఆర్థికమంత్రిగా 13సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా అరుదైన రికార్డును కూడా సాధించారు. ఇక సీన్ కట్ చేస్తే 2023 ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్దమయ్యారు.
నాలుగు పదుల రాజకీయ అనుభవం, దాదాపు అన్ని పార్టీల సిద్దాంతాలతో పనిచేసిన శైలి, ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన పాలనాతీరు, అనేకసార్లు ఆర్థికశాఖ మంత్రిగా రాష్ట్ర బడ్జెట్ పై పట్టు ఇవన్నీ వెరసి మరోసారి సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పీఠానికి దగ్గర చేశాయని చెప్పాలి.
T.V.SRIKAR