Karnataka CM: ముగిసిన కర్ణాటకం.. సీఎంగా సిద్ధరామయ్య.. డిప్యూటీ సీఎంగా డీకే!
సీఎం పదవి కోసం సిద్ధ రామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో వీరిలో సీఎం పదవి ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర చర్చలు జరిపింది. సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసింది అధిష్టానం. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా కొనసాగనున్నారు.
Karnataka CM: నాలుగు రోజులుగా కర్ణాటక సీఎం పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసింది అధిష్టానం. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా కొనసాగనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ ఇంఛార్జి రణ్‌దీప్ సూర్జేవాలా మీడియా సమక్షంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
సీఎం పదవి కోసం మాజీ సీఎం సిద్ధ రామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో వీరిలో సీఎం పదవి ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర చర్చోపచర్చలు జరిపింది. ఇద్దరూ తమకు సీఎం పదవి కావాలనే పట్టుబట్టారు. దీంతో ఎవరికి పదవి ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం తల పట్టుకుంది. ఇద్దరితోనూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నేత రాహుల్ గాంధీ పలుదఫాలు చర్చలు జరిపారు. సిద్ధ రామయ్య, శివ కుమార్.. ఇద్దరికీ చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి అంటూ అధిష్టానం చేసిన ప్రతిపాదనను ఇద్దరూ తిరస్కరించారు. నిజానికి సీఎంగా సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గుచూపింది. శివ కుమార్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. కానీ, శివ కుమార్ ఈ విషయంలో మొండిపట్టుతో ఉన్నారు. తనకే సీఎం పదవి కావాలని పట్టుబట్టారు. అనేకసార్లు జరిపిన చర్చల అనంతరం శివ కుమార్ త్యాగానికి సిద్ధపడ్డారు. సిద్ధ రామయ్యను ముఖ్యమంత్రిని చేసేందుకు అంగీకరించారు. శివ కుమార్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ప్రభుత్వంలో ఆయన ఒక్కరికి మాత్రమే డిప్యూటీ సీఎం పదవి ఉంటుంది. అలాగే కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఆయనే కొనసాగుతారు. కీలక మంత్రిత్వ శాఖలు కూడా ఆయనకు ఇస్తారు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ పదవులు ఉంటాయి. ఆ తర్వాత శివ కుమార్ పదవిపై తుది నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానం. హైకమాండ్ నిర్ణయం అనంతరం డీకే శివకుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కర్ణాటక ప్రజల సంక్షేమం, భద్రతే తమ ప్రాధాన్యమని, తాము ఐక్యంగా ఉండి దీని కోసం కృషి చేస్తామని వెల్లడించారు.
డీకేను ఎలా ఒప్పించారు?
సీఎం పదవి కోసం డీకే శివ కుమార్ చివరి వరకు పట్టుబట్టారు. తానే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని గెలిపించినట్లు మీడియాకు చెప్పారు. అందువల్ల తనకు సీఎం పదవి కావాల్సిందే అని అధిష్టానానికి సూచించారు. అయితే, సిద్ధ రామయ్య, డీకే శివ కుమార్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే వారికే సీఎం పదవి ఇస్తామని రాహుల్ చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో సిద్ధరామయ్యే ముందున్నారు. ఆయనకు 90 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. డీకే శివ కుమార్‌కు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ఈ విషయంలో సిద్ధరామయ్య పైచేయి సాధించారు. మరోవైపు శివ కుమార్‌పై పలు అవినీతి కేసులు ఉండటం కూడా ఆయనకు ప్రతికూలంగా మారింది. ఈ కేసుల్లో గతంలో జైలుకు కూడా వెళ్లొచ్చారు. భవిష్యత్తులో సీబీఐ కూడా ఆయనను అవినీతి కేసుల విచారణ పేరుతో ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. నేరుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి సీబీఐ విచారణ ఎదుర్కొంటే అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద మచ్చగా ఉంటుంది. అందుకే ఈ విషయాన్ని కూడా శివ కుమార్‌కు వివరించి ఆయన సీఎం పదవి వదులుకునేలా చూశారు. అయితే, భవిష్యత్తులో శివ కుమార్ సీఎంగా మాత్రం ఎంపికయ్యే అవకాశం ఉంది.
20న ప్రమాణస్వీకారం
కర్ణాటక నూతన సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివ కుమార్, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 20న బెంగళూరులో ఘనంగా జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. సీఎం ప్రమాణ స్వీకారానికి ముందు కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు సీఎంను ఎన్నుకుంటారు. అనంతరం తమ నిర్ణయాన్ని గవర్నర్‌కు తెలియజేస్తారు. దీంతో మే 20న అధికారికంగా నూతన ప్రభుత్వం కొలువుదీరుతుంది.