చంద్రబాబు వరస్ట్.. పవన్ సైలెంట్ గా ఉండకు: మాజీ మంత్రి
చంద్రబాబు 14 ఏళ్లు సీఎం గా ఉండి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా తీసుకు రాలేకపోయారని ఆరోపించారు మాజీ మంత్రి సిదిరి అప్పల రాజు.
చంద్రబాబు 14 ఏళ్లు సీఎం గా ఉండి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా తీసుకు రాలేకపోయారని ఆరోపించారు మాజీ మంత్రి సిదిరి అప్పల రాజు. ఇంతటి దౌర్భాగ్యకరమైన ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. ఆయనకు ఎప్పుడూ ప్రయివేటు మీదే ఆసక్తని ఆరోపించారు. వైఎస్ఆర్, ఆ తర్వాత జగన్ మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చారని 2014-19 లో చంద్రబాబు కేంద్రంలో భాగస్వామిగా ఉండికూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా తీసుకు రాలేదన్నారు. జగన్ ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తెచ్చి చరిత్ర సృష్టించారని తెలిపారు.
జగన్ ని చూసి ఇతర రాష్ట్రాలు సైతం మెడికల్ కాలేజీల కోసం పోటీ పడ్డారని పాడేరు, పులివెందులలో మెడికల్ సీట్లు వద్దు అని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారన్నారు. సీట్లు వద్దని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే అని మండిపడ్డారు. జగన్ ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించటం వలన 750 సీట్లు కలిసి వచ్చాయన్నారు. ఈ ఏడాది మరో 750 సీట్లు కలిసొచ్చేవని కానీ చంద్రబాబు చేసిన పని బలన మొత్తం 2 వేలకు పైగా సీట్లకు నష్టం జరిగిందన్నారు. బిల్డింగులు, సదుపాయాలు అన్నీ ఉన్నా చంద్రబాబు వైఖరి వలన మెడికల్ సీట్లు కోల్పోయామన్నారు.
మెడికల్ కాలేజీలు రావటం వలన ఉచితంగా ప్రభుత్వ ఆస్పత్రులు కూడా వస్తాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యసేవలు అందేవని వాటన్నిటినీ చంద్రబాబు చేతులారా నాశనం చేశారని మండిపడ్డారు. చివరికి ఆరోగ్యశ్రీ ని కూడా ప్రయివేటు కంపెనీలకు ఇచ్చేస్తున్నారన్నారు. ఆ ప్రయివేటు కంపెనీలు వ్యాపారం చేస్తాయే తప్ప ప్రజలకు మేలు చేస్తాయా? అని నిలదీశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు. ప్రయివేటుకు అప్పగింతలను పవన్ అడ్డుకోవాలన్నారు.