SIRICILLA KTR : సిరిసిల్లలో మారుతున్న సీన్ …. కేటీఆర్ కి ముచ్చెమటలు !

సిరిసిల్ల... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత నియోజకవర్గం. ఇక్కడి  నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారాయన. కానీ... ఇప్పుడా కంచుకోటలో కలకలం రేగుతోందట. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగాక... నిరాశగా ఉన్న కేడర్‌ను తిరిగి సిద్ధం చేసేందుకు రాష్ట్రమంతా తిరుగుతూ సమీక్షలు,  సమావేశాలు నిర్వహిస్తున్నారు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కానీ... ఆయన సొంత నియోజకవర్గంలోనే వ్యవహారం తేడా కొడుతోందన్నది లోకల్‌ టాక్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2024 | 09:16 AMLast Updated on: Jan 31, 2024 | 9:17 AM

Siricilla Ktr Tension

సిరిసిల్ల… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత నియోజకవర్గం. ఇక్కడి  నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారాయన. కానీ… ఇప్పుడా కంచుకోటలో కలకలం రేగుతోందట. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగాక… నిరాశగా ఉన్న కేడర్‌ను తిరిగి సిద్ధం చేసేందుకు రాష్ట్రమంతా తిరుగుతూ సమీక్షలు,  సమావేశాలు నిర్వహిస్తున్నారు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కానీ… ఆయన సొంత నియోజకవర్గంలోనే వ్యవహారం తేడా కొడుతోందన్నది లోకల్‌ టాక్‌.

తెలంగాణలోని మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో…ద్వితీయ శ్రేణి నేతలు, ప్రజా ప్రతినిధులు రాజీనామాల అస్త్రాలను సంధిస్తున్నారు. అదే సమయంలో కేటీఆర్ టార్గెట్‌గా అసంతృప్త నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ రెండో టర్మ్‌ అధికారంలోకి వచ్చాక… సిరిసిల్ల పేరు రాష్ట్రమంతా మార్మోగింది… పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలకు నిధులు,  ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు లాంటి వాటితో ఓ రేంజ్‌లో అభివృద్ధి చేశామన్నది బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పేమాట. కానీ… ఆ పనుల విషయంలో కొద్ది మందికే అత్యంత ప్రాధాన్యం ఇచ్చి మిగతా వాళ్ళని అస్సలు పట్టించుకోలేదన్నది లేటెస్ట్‌ టాక్‌. మండలానికి ఒకరికి చొప్పున బాధ్యతలు అప్పగించి వాళ్ళతోనే కేటీఆర్ పాలన చేశారనీ, దాని ఫలితమే ఈ వ్యతిరేకత అంటోంది సిరిసిల్ల క్యాడర్…  భారీగా నిధులు వచ్చి పనులు జరిగినప్పటికీ… ఐదారుగురి కనుసన్నల్లోనే పనులు జరిగాయనీ… మిగతా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారన్న విమర్శలున్నాయి. ఈ విషయాన్ని ఎప్పుడు కేటీఆర్‌కు చెబుదామన్నా వీలవలేదని అంటున్నారట ఆ ప్రజా ప్రతినిధులు.

SHIVA BALAKRISHNA: శివ బాలకృష్ణ కేసు.. కేటీఆర్‌ మెడకు చుట్టుకోనుందా..?

మొదట సిరిసిల్ల మున్సిపాలిటీలో మొదలైన ముసలం… క్రమంగా నియోజకవర్గం అంతా పాకిందట… మున్సిపాలిటీలో 16 మంది కౌన్సిలర్లు చైర్మన్‌పై అవిశ్వాసానికి రెడీ అయి అజ్ఞాతంలోకి వెళ్లారనే వార్తలు వచ్చాయి…  సిరిసిల్లలో కేటీఆర్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన రోజే… కొందరు కార్పొరేటర్లు  తిరుగుబాటు జెండా ఎగరేశారు. మున్సిపల్ చైర్మన్ భర్త, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అయిన చక్రపాణికి ఇచ్చిన ప్రాధాన్యతలో పావలా వంతు కూడా తమకు ఇవ్వలేదని కేటీఆర్‌ని నిలదీశారట కొందరు నాయకులు. తర్వాత నయానో భయానో వారిని ఒప్పించి అవిశ్వాసం ఏమీలేదనే ప్రకటన ఇప్పించారట పార్టీ పెద్దలు. ఇది జరిగిన తెల్లారే… ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నర్సయ్య సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రావు సహా ఆరుగురు సర్పంచ్‌లు అసంతృప్తి రాగం ఆలపించారు. ప్రెస్‌మీట్ పెట్టి మరీ కేటీఆర్‌ మీద ఘాటైన పదజాలం వాడారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో బిజీగా ఉండే కేటీఆర్‌కు సిరిసిలలో తలనొప్పిగా మారిన ఈ పరిణామాలను ప్రత్యర్థి పార్టీలు కూడా నిశితంగా గమనిస్తున్నాయట. వాటిని తమకు అనుకూలంగా మార్చుకునే పని మొదలుపెట్టడంతో…బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర మంతటా వ్యవహారాలను చక్కబెడుతున్న కేటీఆర్‌కు సొంత నియోజకవర్గ పరిస్థితులు ఏ మాత్రం మింగుడు పడటం లేదంటున్నారు. ఒకరిని బుజ్జగించేలోపే మరొకరు గులాబీ కండువాను పక్కన పెట్టేస్తూ ఉండటంతో నియోజకవర్గ నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారట కేటీఆర్. అయితే సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ నమ్మిన బ్యాచ్ నిర్వాకాలతోనే ఆయనకు అసలు ఇబ్బందులు పెరుగుతున్నాయంటున్నారు స్థానిక పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నవారు.

అవమానాలకు గురైన నేతలంతా ఎవరి దారి వారు చూసుకుంటున్న పరిస్థితుల్లో… కేటీఆర్‌ నేరుగా వాళ్ళతో మాట్లాడాల్సి ఉందంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఎక్కువ మంది హస్తం వైపే చూస్తున్నారనే చర్చ సాగుతోంది.  సోమవారం రాజీనామా చేసిన నేతలంతా మంత్రి పొన్నం సమక్షంలో హస్తం పార్టీలో చేరేందుకు సిద్దమైనట్టు తెలిసింది. ముఖ్యనాయకులు కూడా కాంగ్రెస్‌ వైపు చూస్తుండటంతో పార్టీ ముఖ్యుల్లో అంతర్మథనం మొదలైంది. స్థానిక పరిస్థితుల్ని నిర్మోహమాటంగా విశ్లేషించుకుంటే…2018 ఎన్నికలకు, తాజా ఎన్నికలకు పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందంటున్నారు. అప్పుడు కేటీఆర్‌కు దాదాపు 90 వేల మెజారిటీ వస్తే… అది ఈసారి 29 వేలకు పడిపోయింది. దీంతో నియోజకవర్గంలో చేసిన అభివృద్దికీ…వచ్చిన మెజారిటీకీ పొంతన లేదని రుసరుసలాడారట కేటీఆర్. కార్‌ సర్వీసింగ్‌కి మాత్రమే వెళ్లింది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల్లో చెబుతున్న కేటీఆర్‌…  సిరిసిల్ల కారుకు చేయాల్సిన రిపేర్ల గురించి ఏంచెబుతారన్నది పొలిటికల్‌ పండిట్స్‌ క్వశ్చన్‌. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందును ఆ లోగా కేటీఆర్‌ అసమ్మతిని సెట్‌ చేసుకుని ఇంట గెలుస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.