Seethakka: అసెంబ్లీ బరిలోకి సీతక్క కొడుకు.. ఆ సెగ్మెంట్ పై కన్ను!
ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కుమారుడు రాజకీయాల్లోకి రానున్నారు.
సీతక్క.. తెలంగాణ రాజకీయాల్లో క్రెడిబిలిటీకి మారుపేరు. ప్రజల మనిషిగా పేరున్న లెజెండరీ లీడర్. కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య పొలిటికల్ ఎంట్రీపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక అసెంబ్లీ స్థానం నుంచి సూర్య పోటీ చేస్తారనే టాక్ మొదలైంది. పినపాక అసెంబ్లీ స్థానాన్ని తాను ఆశిస్తున్నానంటూ సూర్య ఇటీవల అప్లై చేయగా.. సీతక్క సిఫార్సుతో ఆయన అభ్యర్థిత్వానికి ఇటు ఢిల్లీ పెద్దలు, అటు తెలంగాణ సీనియర్ నేతలు అప్రూవల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఒక కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం కొన్ని నెలల కింద కీలక నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారమైతే.. సీతక్క లేదా సూర్య ఎవరికో ఒకరికే టికెట్ దక్కుతుంది. ఇదంతా పక్కన పెట్టి.. సీతక్క కుమారుడు సూర్య గత కొన్ని నెలలుగా పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తరుచుగా పర్యటిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ట్రైం చేస్తున్నారు.
సీతక్క చరిష్మాపై నమ్మకంతో..
వాస్తవానికి ఈ ఎన్నికల్లో పినపాక నుంచి సీతక్క పోటీచేసి.. ములుగు నుంచి సూర్యను పోటీ చేయిస్తారని తొలుత భావించారు. కానీ సడెన్ గా వ్యూహం మారింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలపై సీతక్క ప్రభావం ఎక్కువగా ఉంది. పినపాకలో కూడా సీతక్క చరిష్మా వర్క్ ఔట్ అవుతుందనే అంచనాతో హస్తం పార్టీ ఉంది. అందుకే అక్కడి నుంచి సూర్యకు ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందట. పినపాకలో 2018 ఎన్నికల్లో రేగా కాంతారావు కాంగ్రెస్ తరఫున పోటీచేసి.. బీఆర్ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుపై 19,565 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత రేగా కాంతారావు బీఆర్ఎస్ గూటిలో చేరారు. అప్పటి నుంచి రేగా, పాయం మధ్య వర్గ విబేధాలు నడుస్తున్నాయట. ఈ పరిణామాలు సూర్యకు కలిసొచ్చినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు లెక్కలు కడుతున్నారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలం..
రేగా కాంతారావు బీఆర్ఎస్ లోకి జంప్ అయినా.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని స్థానికులు అంటున్నారు. ఈ పాయింట్ సూర్యకు పెద్ద అడ్వాంటేజ్ గా మారే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనప్పటికీ సూర్య ఎదుర్కోబోయేది.. సిట్టింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావునే. ఎందుకంటే రేగాకే కేసీఆర్ టికెట్ ను కన్ఫార్మ్ చేశారు. కేసీఆర్ పార్టీలో చేరినా నియోజకవర్గానికి రేగా చేసిందేమీ లేదని అభిప్రాయంతో ప్రజలు ఉన్నారట. ఇక ములుగులో సీతక్కను ఢీకొట్టగల సరైన అభ్యర్థి బీఆర్ఎస్‌కు దొరక లేదు. దీంతో మావోయిస్టు కుటుంబ నేపథ్యం ఉన్న ములుగు జడ్పీ వైస్ చైర్ పర్సన్ బడే నాగజ్యోతిని ములుగు బరిలోకి గులాబీ దళం దింపింది. ఏదిఏమైనా ములుగులో సీతక్కకు ఎదురుగాలి వీచే ఛాన్సే లేదు. పినపాకలో సీతక్క కొడుకు ఛాన్స్ దక్కుతుందా ? దక్కితే ఏం జరుగుతుంది ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.