సౌందర్య ప్రమాదంలో చనిపోలేదా.. ప్లాన్ చేసి చంపేశారా.. మోహన్ బాబుపై పోలీసులకు సెన్సేషనల్ కంప్లైంట్..!

అసలే మోహన్ బాబు కుటుంబం ఈ మధ్య చాలా వివాదాల్లో ఉంది. వాళ్ల ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి 2 స్టేట్స్ మొత్తం మాట్లాడుకుంటున్నారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2025 | 07:14 PMLast Updated on: Mar 12, 2025 | 7:14 PM

Soundarya Didnt Die In An Accident Or Was She Killed By Planning Sensational Complaint To The Police Against Mohan Babu

అసలే మోహన్ బాబు కుటుంబం ఈ మధ్య చాలా వివాదాల్లో ఉంది. వాళ్ల ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి 2 స్టేట్స్ మొత్తం మాట్లాడుకుంటున్నారు. కొడుకు మంచు మనోజ్ తో మోహన్ బాబు ఆస్తి పంపకాల కాంట్రవర్సీ మామూలుగా లేదు. ఇలాంటి సమయంలో మరో కొత్త తలనొప్పి ఈయన మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది. ఈసారి ఇంకాస్త పెద్ద కేసు మోహన్ బాబు ముందుకు వచ్చింది. దివంగత హీరోయిన్ సౌందర్యను మోహన్ బాబు చంపాడు ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. సౌందర్యది ప్రమాదవశాత్తు జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ కాదని.. ఆమెది ప్లాన్ ప్రకారం చేసిన హత్యేనని.. ఆ హత్యకు మోహన్ బాబు కారణమంటూ ఓ వ్యక్తి ఖమ్మం జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

అసలు విషయం ఏంటంటే.. ఖమ్మం జిల్లా ఏదులాపురం గ్రామ పంచాయితీ పరిధిలోని ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి సౌందర్యది ప్రమాదవశాత్తు వచ్చిన కాదంటూ ఖమ్మం జిల్లా కలెక్టర్, ఏసీపీకి ఫిర్యాదు చేశాడు. స్వర్గీయ సౌందర్యకు శంషాబాద్ పరిధిలోని జల్పల్లి గ్రామంలో 6 ఎకరాల భూమి ఉందని.. ఆమెను ఆ భూమి విక్రయించమని మోహన్ బాబు అడిగాడని.. అందుకు సౌందర్య, ఆమె సోదరుడు అమర్ నాథ్ నిరాకరించారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు చిట్టిమల్లు. 6 ఎకరాల భూమి అమ్మడానికి నిరాకరించడంతో సౌందర్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై మోహన్ బాబు కక్ష్య పెంచుకున్నాడని ఆ ఫిర్యాదులో రాసుకొచ్చాడు. ఇక అదే అదునుగా 2004, ఏప్రిల్ 17వ తేదీన తెలంగాణలోని ఒక రాజకీయ పార్టీ ప్రచారానికి బెంగళూరు నుంచి వస్తున్న సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ హెలికాప్టర్ ప్రమాదం రూపంలో హత్య చేయించాడు.. సాక్ష్యాలు దొరకకుండా చేశాడు.. అంటూ మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు చేశాడు సదర్ వ్యక్తి. సౌందర్య మరణించిన తర్వాత జల్పల్లిలో ఉన్న 6 ఎకరాల భూమిని అక్రమంగా అనుభవిస్తున్నాడని తన ఫిర్యాదులో తెలిపాడు. మోహన్ బాబు కబ్జాలో ఉన్న ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అనాథ ఆశ్రమానికి గానీ.. లేదా మిలిటరీ సోదరులకు గానీ.. పోలీసులకు గానీ.. మీడియా మిత్రులకు గానీ ఇవ్వాలని కోరుతున్నానని ఖమ్మం ఏసీపీకి, కలెక్టర్ కు చిట్టిమల్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

వెంటనే దివంగత సౌందర్య మృతిపై రీ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశాడాయన. అక్కడితో ఆగకుండా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాన్ని కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించాడు. మంచు మనోజ్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదులో రాసుకొచ్చాడు. జల్పల్లిలోని 6 ఎకరాల్లో ఉన్న గెస్ట్ హౌజ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నానని తెలిపాడు చిట్టిమల్లు. అలాగే తనకు మంచు మోహన్ బాబు నుంచి ప్రాణహాని ఉందని.. కాబట్టి రక్షణ కల్పించాలని సదరు వ్యక్తి పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో వెల్లడించాడు. ఈ కేసులో న్యాయం కోసం నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపాడు. ఈ మధ్య మోహన్ బాబు అనుచరులు తరచుగా వేధిస్తున్నారని.. చంపేస్తామంటూ వార్నింగ్స్ ఇస్తున్నారంటూ పోలీసులకు తెలిపాడు. ఇందులో నిజం ఏమాత్రం లేదని కేవలం.. పాపులారిటీ కోసం చేస్తున్న చీప్ ట్రిక్ అది కొంతమంది దీని మీద వాదిస్తున్నారు. సౌందర్య చనిపోయిన 20 ఏళ్ల తర్వాత ఇప్పుడొచ్చి ఆమె చనిపోలేదు చంపేశారు అంటూ నాటకాలు ఆడుతున్నారు అంటూ కంప్లైంట్ ఇచ్చిన చిట్టి మల్లుపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఈ వివాదంపై మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.