South India BJP: దక్షిణాదిపై బీజేపీ ఆశలు గల్లంతేనా.. సౌత్‌లో బీజేపీ ఎందుకు ఫెయిల్ అవుతోంది?
నిద్రలో వచ్చేది కల.. నిద్ర లేపేది కళ ! దక్షిణాదిన సత్తా చాటాలని కలలు కంటున్న బీజేపీ.. పెంచుకోవాల్సిన కళ అదే ! ఉత్తరాదిన సక్సెస్ అయిన వ్యూహాలను.. దక్షిణాదిన ఫాలో అవుతాం అంటే సదరన్ స్పైస్ ఏంటో చూపిస్తారు ఇక్కడి జనం. కర్ణాటకలో అదే జరిగింది కూడా ! కర్ణాటక విజయం మీద బీజేపీ పెట్టుకున్న ఆశలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ సత్తా చాటి.. దక్షిణాదిన జోరు కొనసాగించాలని రకరకాల ప్లాన్లు చేసింది కమలం పార్టీ. ఐతే సీన్ మొత్తం రివర్స్ అయిన పరిస్థితి.
కమలం వద్దే వద్దు అని.. ఘోర పరాభవాన్ని పరిచయం చేశారు కన్నడ ఓటర్లు. దీంతో కాషాయం పార్టీకి కషాయం మింగినట్లు అయింది సీన్. కర్ణాటక ఓటమితో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దక్షిణాదిపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయ్. కర్ణాటక మినహాయిస్తే.. దక్షిణాదిలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా. ప్రత్యర్థి ఏ మార్గంలో వెళ్తున్నాడో.. అదే దారిలో అడ్డుకోవాలి తప్ప.. కొత్తగా దారి క్రియేట్ చేసి అడ్డుకుంటామంటే.. చేతులు కాలిపోవడం ఖాయం. బీజేపీ ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు !
తెలంగాణలో సత్తాచాటాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అది అంత ఈజీగా సక్సెస్ అయ్యే వ్యవహారం కాదు. తమిళనాడు సంగతి సరేసరి. ఎలా చూసినా.. దక్షిణాదిపై బీజేపీ హోప్స్ అటకెక్కినట్లే క్లియర్‌గా అర్థం అవుతోంది. సీబీఐ దాడులు, మతతత్వ రాజకీయాల్లాంటి పరిణామాలతో.. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మీద రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. ఉత్తరాదితో కంపేర్ చేస్తే దక్షిణాది రాజకీయాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయ్. రకరకాల సెంటిమెంట్లు ఇక్కడ వర్కౌట్ అవుతాయ్. ఆ సెంటిమెంట్‌లను క్యాచ్ చేయడంలో బీజేపీ విఫలం అవుతోంది. ప్రత్యర్థి మీద జనాల్లో సింపథీ క్రియేట్ అయ్యేలా… బీజేపీ తన మార్క్ రాజకీయాలు చేస్తోంది. అదే భారీ దెబ్బ కొడుతోంది.
కర్ణాటకలో ఒకరకంగా జరిగింది అదే ! దక్షిణాది సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కర్ణాటకలో భారీగా ఓటు షేర్ పెంచుకున్న కాంగ్రెస్.. సూపర్‌స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలలోపు ఆ బలాన్ని తమవైపు తిప్పుకోవడం బీజేపీకి కత్తిమీద సామే! గత లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. 28 సీట్లకు 27 చోట్ల విజయం సాధించింది. ఐతే ఇప్పుడా పరిస్థితి ఉందా అంటే.. కచ్చితంగా లేనే లేదు. మిగతా రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలవగా.. కాంగ్రెస్ స్ట్రాంగ్ అయితే వాటిని నిలబెట్టుకోవడం కమలం పార్టీకి కష్టమే. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సంగతి సరేసరి ! ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులో చేరితే ఫలితం ఉంటుందేమో కానీ.. ఒంటరిపోరు అంటే సింగిల్ సీట్ కూడా గెలవలేదు బీజేపీ. ఇలా ఎలా చూసినా.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బోల్తాపడడం ఖాయంగా కనిపిస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయ్.