South India: అంత ఆనందం ఎందుకు బ్రదరూ! ముందుంది ముసళ్ల పండగ
కర్ణాటకలో బీజేపీ పోయి కాంగ్రెస్ అధికారంలోకి రానుంది. ఈ దెబ్బకు దక్షిణాదిన బీజేపీ అడ్రెస్ గల్లంతైంది. దీన్ని కొన్ని వర్గాలు గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటుండగా.. మరికొందరు మాత్రం మిగిలిన పార్టీలైనా చేస్తుందేముందని ప్రశ్నిస్తున్నాయి.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన తలరాతాలు మారతాయా అంటే కచ్చితంగా లేదని సమాధానం చెప్పేవాళ్లే ఎక్కువ! ఎందుకంటే కాంగ్రెస్ పోయి బీజేపీ రావడం..బీజేపీ పోయి కాంగ్రెస్ రావడం కర్ణాటకలో సాధారణ విషయం. ఈ ఇద్దరి పాలనలో బాగుపడిన బతుకులేన్నో తెలియదు..! కేవలం కర్ణాటక గురించే కాదు.. ఇది దేశంలోని మిగిలిన రాష్ట్రాలకూ వర్తిస్తుంది. దక్షిణాదిన బీజేపీ తుడుచుపెట్టుకుపోయిందని ఆనందపడుతూ సోషల్‌మీడియా వేదికగా సెలబ్రేట్ చేసుకుంటున్న వారి సంఖ్య కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఇవాళ్టి వరకు కర్ణాటకని బీజేపీనే పాలించింది. మరి తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళలో బీజేపీ అధికారంలోనే లేదు కదు..! మరి అక్కడ అధికార పార్టీలు అంత గొప్పగా రూల్ చేస్తున్నాయా అంటే లేదనే సమాధానమే వినిపిస్తుంది.
తెలంగాణలో విద్యవ్యవస్థ దారుణం:
కొట్లాడి సంపాదించుకున్న తెలంగాణలో విద్యవ్యవస్థ రోజురోజుకు తీసికట్టుగా తయారవుతుంది. ఎన్నో వివాదాలు కాలేజీల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రాంతాంలో విద్యవ్యవస్థ బెటర్‌గా ఉండేది. నిజానికి విద్యార్థులే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఓవైపు కేసీఆర్..మరోవైపు విద్యార్థుల పోరాట ఫలితమే తెలంగాణ ఆవిర్భావం. ఉద్యమంలో అంతటి కీ రోల్ ప్లేస్ చేసిన యువత ఇప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఉద్యోగాలు లేక.. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ.. స్టడీ హాల్స్‌లో, లైబ్రరీల్లో చదువుతూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. ఒకవేళ నోటిఫికేషన్ రిలీజై.. పరీక్ష రాసి..పాసైనా ఆ ఎగ్జామ్‌ని ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో తెలియని దుస్థితి. ఎందుకంటే క్వశ్చన్స్ పేపర్స్ లీకుల బెడద ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణనే. 9ఏళ్లుగా తెలంగాణను కేసీఆరే పరిపాలిస్తున్నాడు.. ఇందులో 7ఏళ్ల పాటు కేంద్రంలోని బీజేపీతో సయోధ్యతోనే మెలిగాడు.. అయినా హైదరాబాద్ అభివృద్ధి మినహా సాధించిందేమీ లేదు. అటు ఏపీ పాలకులు చేసిందే కేసీఆర్ కూడా చేస్తున్నాడు.
ఏపీ గతి ఏంటో దేవుడే చెప్పాలి:
ఏపీలో పరిస్థితి నానాటికి దారుణంగా తయారవుతుంది. ఉద్యోగాలు లేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏవో ప్రభుత్వ పథకాలతో జగన్ సర్కార్ ప్రజల ఖాతాలో డబ్బులు జమ చేసి పబ్బం గడుపుకుంటోంది. అంతే కానీ అభివృద్ధి ఊసే ఎత్తడంలేదు వైసీపీ. అటు చంద్రబాబు హయంలోనూ ఒరిగిందేమీ లేదు.. అమరావతిని ఎలివేట్ చేయడం కోసం దాని గ్రాఫిక్స్‌పై పెట్టిన శ్రద్ద కూడా ప్రజల సంక్షేమంపై పెట్టలేదు. ఐదేళ్ల అధికారంలో ఉన్న చంద్రబాబు నాలుగేళ్లు కేంద్రలోని బీజేపీతోనే కలిసున్నారు. అయినా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టడంతో విఫలమయ్యారు.
పరోక్షంగా బీజేపీ ఉన్నట్లే లెక్క:
2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిపక్షాలకు లేని యూనిటీ మోదీ టీమ్‌కు కలిసి రావొచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం దక్షిణాదిన బీజేపీని ప్రజలు పక్కన పెట్టడం ఆనందించే విషయమే కావొచ్చు.. కానీ అభివృద్ధి పనులకు కేంద్రం అడ్డుపడదని గ్యారెంటీ ఏముంది? కేంద్రం సహాకారం లేనిదే చాలా పనులు జరగవు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ కక్షపూరితంగా వ్యవహరించినా ఆశ్చరమేమీ లేదు. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ నైజం! ప్రత్యేక్షంగా బీజేపీ దక్షిణాదిలో లేకున్నా.. పరోక్షంగా మాత్రం ఇక్కడి ప్రజల జీవితాలు వాళ్లపైనే ఆధారపడి ఉన్నట్లు లెక్క! వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి మరో పార్టీ రూల్ చేస్తే కానీ సెలబ్రేట్ చేసుకునే స్టేజీలో మనంలేమని తెలుసుకుంటే మంచిది!