Hatred Politics: మత విద్వేషాలు లేవు సరే! మరి దక్షిణాదిన కుల కంపు, ప్రాంతీయ పిచ్చి మాటేమిటి?

కర్ణాటక ఎన్నికల్లో ఓటమితో దక్షిణాదిన బీజేపీ అడ్రస్‌ గల్లంతవడంతో మత రాజకీయాలను పూర్తిగా వ్యతిరేకించే వాళ్లు పండుగ చేసుకుంటున్నారు. ఇక్కడవరకు బాగానే ఉంది.. అయితే దక్షిణాదిన పేరుకుపోయిన కుల కంపు, ప్రాంతీయ పిచ్చి మాటేమిటి?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 14, 2023 | 06:20 PMLast Updated on: May 14, 2023 | 6:20 PM

South India Is Full Caste Language Region Politics

బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టే అధికారంలోకి వచ్చే పార్టీనే కావొచ్చు.. చాలా రాష్ట్రాల్లో అలానే గెలిచింది కూడా..! అసలు ఆ పార్టీ మూలాలే హిందుత్వ మూలాలు. దాని ఎజెండానే హిందుత్వ ఎజెండా! అది అబద్ధమని ఆ పార్టీ కూడా ఎప్పుడూ చెప్పుకున్నది లేదు. ఇలా మత రాజకీయాలు చేయడంలో ఏ పార్టీకి ఆ పార్టీకి భిన్న విధానాలున్నా బీజేపీ ఓపెన్‌గా తన పని తాను చేసుకుపోతుంది. గెలవడం కోసం విద్వేషాలను రెచ్చగొట్టడం రాజకీయ పార్టీలకు కొట్టిన పిండి. అయితే ఆ విద్వేషం కేవలం మతానికే పరిమితం కాదు కదా? కులం పేరిట దూషణలు, ప్రాంతీయతత్వం ముసుగులో ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలపై వివక్ష చూపించడం కూడా ద్వేషంలో భాగమే కదా! మరి బీజేపీ దక్షిణాదిన ఏ రాష్ట్రాంలో రూలింగ్‌లో లేకపోయినంత మాత్రానా ఏం మారబోతున్నట్లు? ట్రెడిషనల్‌గా దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న రోగాలు అలానే ఉండగా..ఎందుకా సంబరాలు?

అసలు ఏపీలో కుల పిచ్చి లేని మనుషులు వందలో ఒకరైనా ఉంటారా అంటే చెప్పలేం.. బహుశ వెయ్యిలో ఒకరు ఉండొచ్చు..లేకపోతే లక్ష మందిలో ఒకరు ఉండొచ్చు. అది కూడా గ్యారెంటీ నంబర్‌ లేదు. అక్కడ కుల పిచ్చి రేంజ్‌ని కొలిచే గణిత సూత్రాలు ఇంకా మనువుడు కనిపెట్టలేదు. అది అసాధ్యం కూడా. ‘మీరు ఏమిట్లు’.. ‘వీడు మనోడేనా’.. ‘వీళ్లతో జాగ్రత్త’.. ‘వాళ్ల జోలికిపోకూడదు’..’వాళ్లు ఎదురొస్తే అయిష్టం’.. అబ్బో ఇలాంటి పదాలకు లెక్కలేదు. ఇవ్వని ఏపీలో ఎక్కడపడితే అక్కడ.. దాదాపు అన్ని చోట్లా వినపడే మాటలు. మతం విషయంలో అందరూ సమానమేనని భావించే ప్రజలు.. కులం విషయంలో మాత్రం గిరీగీసుకొని కూర్చుంటారు. ఇక కులాల కొట్లాటలు, గొడవలు, హత్యలు ఏపీలో తరతరాలగా ఉన్నమాట నిజమే కదా.. అలాంటప్పుడు కేవలం మత విద్వేషాలపైనే ఎందుకా వివక్ష?

అవును.. నిజమే..తెలంగాణ ప్రజలపై కోస్తా ప్రాంతాల వారి వివక్ష మాటల్లో కనిపించేదే.. అవి భరించలేకే కదా అంత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాలు జరిగినవి. మరి తెలంగాణలో అలాంటి వివక్ష ఉండదా అంటే..ఎందుకుండదు.. కనపడే ప్రతీ ఆంధ్రోడు చాలా మందికి ద్రోహుల్లాగా కనిపిస్తారు. ప్రాంతియతత్వమో..ఇతర ప్రాంతాలపై ద్వేష భావమో తెలియదు కానీ..ఇరు ప్రాంతాల ప్రజలది ఈ విషయంలో దాదాపు ఓకే తీరు. అన్నిటికంటే..అన్నిరంగాల్లో..వివక్షకు గురైనా రాయలసీమ ప్రాంతంపై మాత్రం వీళ్లు ఎలాంటి కామెంట్స్ చేయరు.. ఎందుకంటే అక్కడలేనివి ఉన్నట్లు చూపించడానికి సినిమా డైరెక్టర్లూ ఉండనే ఉన్నారు.. అక్కడి ప్రజలంటే ఎందుకో అదో టైప్ చిన్నచూపు. కానీ ఇది వివక్ష కాదు.. బీజేపీ చూపించేది మాత్రమే వివక్ష! ఇదేం లెక్క..?

అటు ప్రపంచంలో తమ భాషే గొప్ప అన్న భావన తమిళులది. మిగిలిన భాషాలను తక్కువ చేసి మాట్లాడడం వారి హాబి. పక్క భాషల సినిమాలపై కూడా విషం చిమ్మడం ఎప్పుడూ మనం చూసేదే. ఎవరి భాషను వారు గౌరవించుకోవచ్చు కానీ మిగిలిన భాషాలపై బురద చల్లడం అక్కడ విద్వేష బుర్రలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సోషల్‌మీడియాలోనూ అదే చేస్తారు. మా భాషే గొప్పంటూ బిల్డప్‌లకు పోతారు. లాంగ్వేజ్‌ వార్స్‌ను మొదలుపెట్టి..వాటిని పెంచి పెద్దది చేసేది వాళ్లే..ఈ క్రమంలో ఇతర భాషాలు, ప్రాంతాలపై ద్వేషంతో కూడిన ప్రచారం మొదలుపెడతారు. మరోవైపు కర్ణాటకలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ప్రాంతీయత కోసం పాకులేడా పిచ్చి వాళ్లది. మరి ఇన్ని రోగాలున్న దక్షిణాది రాష్ట్రాలకు కేవలం మతాన్ని రుద్దే పార్టీ మాత్రమే దూరమైతే అది ద్వేషరహిత ప్రాంతంగా ఎలా మారినట్లు..? సోషల్‌మీడియాలో సౌతిండియా గురించి డప్పులు కొడుతున్న మేధావులకే ఈ విషయం తెలియలి..!