మోదీతో దక్షిణాది యుద్ధం.. సౌత్ సక్సెస్ అయినట్లేనా ?
2026నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం... దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోంది.

2026నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం… దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోంది. నిజానికి నియోజక వర్గాల పునర్విభజన ఎప్పుడో జరగాల్సి ఉంది. జనగణన నిలిచిపోవడంతో ఆలస్యం అయింది. 2026లో డీలిమిటేషన్ తప్పకుండా ఉండబోతోంది. ఐతే జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తే.. దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బందులు తప్పవు. దీంతో సదరన్ స్టేట్స్ అన్నీ ఏకం అవుతున్నాయ్. డీలిమిటేషన్‌పై కేంద్రంతో ఢీ అంటున్నాయ్. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై.. తమిళనాడు సీఎం స్టాలిన్ మొదటినుంచి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమ కార్యాచరణకు సిద్ధపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. చెన్నైలో భేటీ జరిగింది. ఈ మీటంగ్‌కు తెలంగాణ సీఎం రేవంత్‌తో పాటు.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా హాజరయ్యారు. వారితో పాటు కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఒడిశా నుంచి బీజేడీ ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీ నుంచి వైసీపీ కూడా యుద్ధానికి సిద్ధమే అన్నట్లుగా పరోక్షంగా ప్రకటన చేస్తోంది. డీలిమిటేషన్ వ్యవహారంపై మోదీకి జగన్ లేఖ రాశారు.
డీలిమిటేషన్‌పై చెన్నై మీటింగ్ తర్వాత.. దేశ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏక తాటిపైకి రావడంతో.. కాషాయం పార్టీకి కషాయం మింగినట్లు అవుతోంది. దక్షిణాదికి అన్యాయం జరగదు అని పదేపదే చెప్తున్నా.. చెన్నై మీటింగ్ గురించే ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఎక్కువ చర్చ జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే.. నిధులు తెచ్చుకోవడంలో, అభివృద్ధి ప్రాజెక్టులను సాధించుకోవడంలో.. దక్షిణాది రాష్ట్రాలు వెనకే ఉండిపోయే చాన్స్ ఉండదని.. ఉత్తరాదిలో వచ్చిన మెజార్టీతోనే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు అయితే.. దక్షిణాదిని పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదనే ప్రచారాన్ని సౌత్ పార్టీలు జనాల్లోకి తీసుకెళ్లాయ్. ఒకరకంగా ఈ విషయంలో సౌత్ పార్టీలు సక్సెస్ అయినట్లే. మరి ఇప్పుడు దక్షిణాది ఆందోళనతో కేంద్రం వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. వెనక్కి తగ్గకపోతే.. రాజకీయంగా ఎలాంటి సంచలనాలు చూడాల్సి వస్తుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయ్. సరికొత్త కూటమి రాజకీయాలు తెరమీదకు వచ్చే చాన్స్ ఉందా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్. ఇక అటు డీలిమిటేషన్ ఏంటి అనే దానిపై కూడా ఇప్పుడు జనాల్లో చర్చ జరుగుతోంది.
జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో ప్రజా ప్రతినిధుల సంఖ్యను పెంచడమే డీలిమిటేషన్. 1952లో దేశంలో మొదటిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయ్. 1951 జనాభా లెక్కల ఆధారంగా 1952లో డీలిమిటేషన్ జరిగింది. 1952లో 489ఎంపీ సీట్లతో ఎన్నికలు జరిగాయ్. 1963లో మరోసారి డీలిమిటేషన్ జరిగింది. ఈ సమయంలో 489 నుంచి 522 వరకు ఎంపీ సీట్లు పెరిగాయ్. ఆ తర్వాత 1973లో 545కు లోక్‌సభ స్థానాలు పెరిగాయ్. 1976లో 42వ చట్ట సవరణ ద్వారా.. డీలిమిటేషన్ ప్రక్రియను నిలిపివేశారు. జనాభా నియంత్రణను ప్రోత్సహించడం ఈ సవరణ ఉద్దేశం. 2001లో సవరణ ద్వారా… 2026 వరకు దీన్ని వాయిదా వేశారు. కరోనా కారణంగా 2021లో జనాభా లెక్కలు నిర్వహించలేదు. 2026నాటికి భారతదేశ జనాభా 142 కోట్లకు చేరుకుంటుందని అంచనా. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గే అవకాశం ఉందని దక్షిణాదికి చెందిన పార్టీల నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభలో మొత్తం ఎంపీ సీట్లు 543 ఉండగా.. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 129 సీట్లు. అంటే జాతీయ స్థాయిలో 24 శాతం అన్నమాట. డీలిమిటేషన్ తర్వాత.. లోక్‌సభ సీట్ల సంఖ్య 753 పెరిగే అవకాశం ఉందని అంచనా. కర్ణాటకలో 28 నుంచి 36 సీట్లు.. తెలంగాణలో 17 నుంచి 20.. ఏపీలో 25 నుంచి 28.. తమిళనాడులో 39 నుంచి 41 సీట్లు పెరిగే అవకాశం ఉంది.
కేరళలో 20 నుంచి 19కి తగ్గొచ్చు. అప్పుడు మొత్తం ఎంపీ స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 24శాతం నుంచి 19 శాతానికి పడిపోతుంది. ఇదే ఇప్పుడు సదరన్ స్టేట్స్‌కు టెన్షన్. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్ధానాలు పునర్విభజిస్తే.. ఉత్తరాదిలో భారీగా సీట్లు పెరుగుతాయ్. జనాభా కంట్రోల్ చేయడంతో.. దక్షిణాదిలో తక్కువ సంఖ్యలో ఎంపీ సీట్లు పెరుగుతాయ్. యూపీలో 80 నుంచి 128కి.. బిహార్‌లో 40 నుంచి 70కి ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా ఎక్కువ సీట్లు వస్తాయ్. ఐతే డీలిమిటేషన్‌లో దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదని కేంద్రం అంటున్నా.. ఈ యుద్ధం ఆగడం లేదు. మరో 25ఏళ్ల పాటు.. లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచొద్దని.. 543గానే ఉంచాలని దక్షిణాది డిమాండ్ చేస్తోంది. జనాభా పెరుగుదలను కంట్రోల్ చేసినందుకు.. శిక్షించడం కరెక్ట్ కాదని దక్షిణాది రాష్ట్రాలు వాదిస్తున్నాయ్. డీలిమిటేషన్ అనేది రాజకీయంగా సెన్సిటివ్ ఇష్యూ. జనాభా ఆధారంగా న్యాయమైన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం దీని లక్ష్యం అయినా.. ఇది తమ రాజకీయ ప్రభావాన్ని దెబ్బతీస్తుందని దక్షిణాది రాష్ట్రాలు భయపడుతున్నాయ్.