తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ పరిచయం అవసరం వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం తరువాత బీఆర్ఎస్ మీద అదే స్థాయి పట్టు ఉన్న ఏకైక నేత ఈటెల రాజేందర్. కానీ అంతర్గత విభేదాల కారణంగానే అదే పార్టీకి ఆయన దూరమయ్యారు. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. హుజురాబాద్ బైపోల్‌లో బీజేపీ నుంచి పోటీ చేసి.. అప్పటి అధికార పక్షాన్ని కూడా పక్కకి నెట్టి ఘన విజయం సాధించారు. దీంతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ అప్పటి నుంచి ఈటెల టైం అస్సలు బాలేదు. ఏం చేసినా రివర్స్ అవుతూనే వచ్చింది. కేసీఆర్‌ను ఓడిస్తానంటూ గజ్వేల్ నుంచి బరిలో దిగిన ఈటెలకు.. అటు గజ్వేల్ ఇటు హుజురాబాద్.. రెండు ప్రాంతాల ప్రజలు హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఆయన అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేకపోయారు. కానీ ఇప్పుడు అదే ఈటెల మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి రాజీనామాతో ఖాళీ ఐన మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఈటెల ఉన్నట్టు తెలుస్తోంది. కొడంగల్ నుంచి ఓడిపోయిన తరువాత మల్కాజ్‌గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచారు. రీసెంట్‌గా సీఎం ఐన తరువాత తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో మల్కాజ్‌గిరి ఇప్పుడు ఖాళీ అయ్యింది. రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో బీజేపీకి మంచి ఓట్ బ్యాంక్ ఏర్పడింది. వ్యక్తిగతంగా తనకున్న ఇమేజ్, పార్టీ సపోర్ట్.. ఈ రెండు కలిసివచ్చే అంశాలు ఉన్నట్లు ఈటెల లెక్కలు వేసుకుంటున్నారట. దీంతో ఇప్పుడు అదే మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయాలని ఈటెల డిసైడ్ ఐనట్టు తెలుస్తోంది. కాకపోతే ఇదే స్థానాన్ని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు కూడా ఆశిస్తున్నారు. ఒకవేళ మల్కాజ్‌గిరి నుంచి తనకు టికెట్ ఇవ్వకపోతే జహీరాబాద్, మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ ఈటెల రాజేందర్ కోరే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఈటెల ఓ పాఠం నేర్చుకున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లబోతున్నట్టు కనిపిస్తోంది. మరి బీజేపీ హైకమాండ్ ఈటెలను ఎక్కడి నుంచి బరిలో దింపుతుందో చూడాలి