Sankaramma : శ్రీకాంతాచారి తల్లికి మరోసారీ నిరాశే..!
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా శ్రీకాంతాచారి తల్లికి కచ్చితంగా అవకాశం దక్కుతుందని బావించారు. అయితే ఇప్పుడు ఆ చాన్స్ కూడా లేకుండా పోయింది. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అసలైన తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందనే భావన చాలా మందిలో ఉంది. ప్రత్యేక తెలంగాణ సాధించుకుంటే అందుకోసం అశువులు బాసిన కుటుంబాలకు న్యాయం జరుగుతుందని భావించారు. అయితే అసలు ఉద్యమకారుల లెక్క తేల్చడంలో కూడా కేసీఆర్ సర్కార్ విఫలమైందనే ఆరోపణలున్నాయి. ఉద్యమ సమయంలో ఒక లెక్క చెప్పిన నేతలు.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక తగ్గించేశారు. దీంతో అనుమానాలు మొదలయ్యాయి. చాలా మంది ఉద్యమకారులను కేసీఆర్ సర్కార్ విస్మరించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ వాదులంతా డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ మలిదశ పోరులో తొలుత అశువులు బాసింది శ్రీకాంతాచారి. ఆయన మరణం తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. దీంతో శ్రీకాంతాచారి పేరు మార్మోగింది. శ్రీకాంతాచారిని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమకారులు పోరుబాట పట్టారు. చివరకు తెలంగాణ సాధించుకున్నారు. దీంతో శ్రీకాంతాచారి లేకపోయినా ఆయన కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. అయితే ఆమె ఓడిపోయింది. దీంతో శ్రీకాంతాచారి కుటుంబం తెరమరుగైపోయింది.
గత నెలలో హైదరాబాద్ లో అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఆ సందర్భంగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. అంతేకాక.. ఆమెను త్వరలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అనౌన్స్ చేయబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. పీఏతో పాటు గన్ మెన్లను కూడా ప్రభుత్వం కేటాయించిందని మీడియా ఊదరగొట్టింది. అయితే ఆ రోజు వేదికపై శంకరమ్మకు శాలువా సత్కారం తప్ప ఏమీ దక్కలేదు. కనీసం ఆ వేదికపై శ్రీకాంతాచారి పేరు కూడా పిలవలేదని, ఆయన ఫోటో కూడా పెట్టలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా శ్రీకాంతాచారి తల్లికి కచ్చితంగా అవకాశం దక్కుతుందని బావించారు. అయితే ఇప్పుడు ఆ చాన్స్ కూడా లేకుండా పోయింది. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కోటాలో కూడా శంకరమ్మకు అవకాశం దక్కలేదు. ఉద్యమకారులను కేసీఆర్ విస్మరించిందని.. ఈ దఫా కూడా శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం చేయలేదని పలువురు విమర్శిస్తున్నారు.