Statue politics: విగ్రహాలతో ఓట్లు పడతాయా? ఎన్టీఆర్, అంబేద్కర్ కేసీఆర్‌ను కాపాడగలరా?
విగ్రహా రాజకీయాలు కొత్తమీ కాదు.. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఇవి ఉండేవే. కాంగ్రెస్, బీజేపీ ఈ విగ్రహా రాజకీయాల్లో ఆరితేరిన పార్టీలు.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం తక్కువ కాదు. ఓటమి భయమో,ముందు చూపో.. ఏమో తెలియదు కానీ.. కేసీఆర్ విగ్రహాలు చుట్టూ తిరుగుతున్నారు.
ఒక వర్గం దృష్టిలో వీరుడు, శూరుడు అయినవాడు మరొకరి దృష్టిలో దుష్టుడు కావచ్చు. విగ్రహాలు నెలకొల్పడం, కూల్చడం..వాటీ చుట్టూ రాజకీయాలు చేయడం ఇదంతా సర్వసాధారణమైపోయి ఏళ్లు దాటిపోయాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయవతి అధికారంలో ఉండగానే తన విగ్రహాలు తానే కట్టించుకున్నారు. వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అయితే ఎవరి విగ్రహం వారు కట్టించుకుంటేనే ప్రజా ధనం దుర్వినియోగమైనట్లు కాదు కదా.. ఓట్లు కోసం, కులాలను ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రముఖుల విగ్రహాలు కట్టడం కూడా ఆ కోవకే వస్తుంది. కేసీఆర్ కూడా అదే చేస్తున్నారు.
2014లో టీఆర్ఎస్ గెలిస్తే సీఎంగా దళితుడే ముఖ్యమంత్రి పదవిని అధిష్టిస్తాడన్న ఆయన.. ఆ విషయాన్ని లేవనెత్తకుండా ఉండేందుకే అంబేద్కర్ భారీ విగ్రహాన్నీ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ఆ ఒక్క కారణమే కాకపోయి ఉండొచ్చు కానీ.. ప్రధాన కారణాల్లో అది కూడా ఉంటుంది. ఆ ప్రస్తావన జోలికి ప్రత్యర్థి పార్టీలు పోకుండా కొత్త సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరే పెట్టేసినట్లు ఉన్నారు. అసలే హంగులు, ఆర్భాటాలు..దానికి తోడు వాస్తు పిచ్చితో కాలం గడిపే కేసీఆర్..ఈ విగ్రహాలతో ఓట్లు పడతాయని భావిస్తున్నారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహంపై బీఆర్‌ఎస్ చూపిస్తున్న ఇంట్రెస్టు చూపిస్తూంటే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది.
ఎన్టీఆర్‌పై ప్రేమ నిజమే.. కానీ విగ్రహా ప్రేమ బూటకం:
ఎన్టీఆర్‌పై కేసీఆర్‌కు ప్రేమ వెలకట్టలేనిది. అందుకే ఆయన కుమారుడు కేటీఆర్‌కు కూడా తారకరామరావు పేరే పెట్టారు. కాంగ్రెస్‌లో మొదలైన కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలోనే పుంజుకుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో రవాణా మంత్రిగా కేసీఆర్ పనిచేశారు . అయితే ఇదంతా 2001 ముందు మాటలు.. ఇప్పుడు కేసీఆర్ బ్రాండ్ వేరు. తెలంగాణ ఆవిర్భంలో కీలక పాత్ర పొషించిన కేసీఆర్.. రాష్ట్ర ఏర్పడిన తర్వాత వరుస పెట్టి రెండుసార్లు సీఎం అయ్యారు.
ఇక మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2014, 2018 ఎన్నికలతో పొల్చితే ఈ సారి కేసీఆర్‌కు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఆయన గ్రాఫ్ కూడా పడిపోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజానికి 2018 తర్వాతే కేసీఆర్‌పై నెగిటివ్ ప్రచారం మొదలైంది. తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారీగా సీట్లు కోల్పోవడంతో పాటు పలు ఉప ఎన్నికల్లో పరాజయం పాలవడంతో నెక్ట్స్ టైమ్ బీఆర్‌ఎస్ డౌటేనన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లిపోయింది.
ముందు జాగ్రత్తతోనే విగ్రహాలు:
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావలన్నా దళితుల ఓట్లు కీలకం. రాష్ట్ర జనాభాలో దాదాపుగా 18శాతమున్న దళితులు ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. అందుకే దేశంలో ఎక్కడ చూడని దళితబంధు లాంటి పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టారు. అయితే దాన్ని అమల్లో పలు విమర్శలూ ఎదుర్కొన్నారు. ఇక దళితముఖ్యమంత్రి హామిని నేరవేర్చని కేసీఆర్..ఇటివలే భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. కొత్తగా కట్టిన సచివాలయం పక్కనే ఉంటుంది అది. కొత్త సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరే పెట్టారు. అంబేద్కర్‌పై కేసీఆర్‌కు ఇంత ప్రేమ పొడుచుకురావడం వెనుక ఓటమి భయం తప్ప మరేమీ కనిపించడలేదు. మరోవైపు ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఉన్న ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ విగ్రహంపై రచ్చ పీక్స్‌కు పోయింది.
కమ్మ ఓట్ల కోసమే:
లకారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసే ఎన్టీఆర్ విగ్రహం.. శ్రీకృష్టుడి రూపాన్ని పోలి ఉండటంపై తీవ్ర దుమారం చెలరేగుతంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో ‘తానా’, ఎన్‌ఆర్‌ఐలు, పలువురు పారిశ్రామికవేత్తల సహకారంతో భారీ విగ్రహా న్ని నిజామాబాద్‌కు చెందిన కళాకారుడు వర్మ రూపొందించారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఈ నెల 28న ఈ విగ్రహాన్ని జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేయాలన్నది ప్లాన్. అయితే దీనిపై యాదవ్ సంఘాలు అభ్యంతరం చెప్పడంతో పాటు కోర్టు స్టే విధించింది. అటు ఎన్టీఆర్ విగ్రహం బీఆర్‌ఎస్‌కు ప్లస్ అవుతుందా అంటే ఏమో చెప్పలేని పరిస్థితి. తెలంగాణలో కమ్మకులం జనాభా దాదాపు 5శాతంగా ఉంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్నికల్లో బరిలో టీడీపీకి ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.మరి ఎన్టీఆర్ విగ్రహం బీఆర్‌ఎస్‌కు ఏ విధంగా ప్లస్ అవుతుందో ఇప్పటికైతే చెప్పలేం..!