విసా గడువు ముగిశాక అమెరికాలోనే ఉంటే జైలుకే?
అమెరికాలో అక్రమంగా నివసించేవారి పట్ల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీసా నిబంధనలను మరింత పకడ్బందీగా చేసి.. అక్రమ నివాసితులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అయింది. ఈ క్రమంలోనే అమెరికా జారీ చేసే స్టూడెంట్ వీసాలు..
అమెరికాలో అక్రమంగా నివసించేవారి పట్ల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీసా నిబంధనలను మరింత పకడ్బందీగా చేసి.. అక్రమ నివాసితులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అయింది. ఈ క్రమంలోనే అమెరికా జారీ చేసే స్టూడెంట్ వీసాలు.. హెచ్-1బీ వీసాల రూల్స్‌ను, ఇమ్మిగ్రేషన్ పాలసీలను మరింత కఠినతరం చేయాలని వైట్‌హౌస్ కమిటీకి తాజాగా నిపుణులు సిఫార్సు చేశారు. అమెరికాలో వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్ కమిటీ విచారణ చేపట్టగా.. చట్టసభ సభ్యులు పలు కీలక సూచనలు చేశారు. ఒక్క 2023లోనే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా 7 వేల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోనే ఉన్నారని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్‌కు చెందిన సిబ్బంది హౌస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. 32 దేశాలకు చెందిన స్టూడెంట్లు, స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ విజిటర్లలో 20 శాతానికి పైగా మంది.. వీసా గడువు దాటినా అమెరికాలోనే ఉంటున్నారని తెలిపారు.
ఎఫ్, ఎం కేటగిరీల్లో వీసాలు తీసుకున్నవారే అధికంగా ఇలా వీసా గడువు ముగిసిన తర్వాత అక్రమంగా ఉంటున్నారని తెలిపారు. వీరంతా స్టూడెంట్ విసాలైన ఎఫ్-1, ఎం-1 వీసాలు, ఎక్స్‌చేంజ్ విజిటర్ వీసాలైన జే వీసాలపై అమెరికాకు వెళ్లారని చెప్పారు. 2023లో వీరి వీసాల గడువు ముగిసిందని స్పష్టం చేశారు. ఈ 7 వేల మందిలో 2 వేల మంది విద్యార్థులున్నట్లు చెప్పారు. బ్రెజిల్, చైనా, కొలంబియా, భారత్ నుంచి రెండేసి వేల మందికి పైగా విద్యార్థులు గడువు ముగిసినా.. అమెరికాలోనే నివసిస్తున్నట్లు కాంగ్రెస్ దృష్టికి తీసుకువచ్చారు. 32 దేశాలకు చెందిన విద్యార్థులు, ఎక్స్‌చేంజ్ విజిటర్లలో 20 శాతానికి పైగా వీసా గడువు దాటినా.. అమెరికాలోనే ఉంటున్నారు. ఎఫ్, ఎం కేటగిరీల్లో వీసాలు తీసుకున్నవారే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు అనేది వాళ్లు చేస్తున్న ప్రధాన ఆరోపణ. కాగా.. హెచ్-1 వీసాలను అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఫుల్‌టైమ్ కోర్సులు చేసేవారు, స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునేవారికి జారీ చేస్తారు.
వృత్తివిద్య, నాన్-అకడమిక్ ప్రోగాములు చదివేవారికి ఎం1 వీసాలను అందజేస్తారు. వీసాల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో వ్యవస్థలో, చట్టాల్లో ప్రక్షాళన అవసరమని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేయాలని.. వీసా గడువు ముగిశాక మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న వారిని కూడా గుర్తించి, వెనక్కి పంపేలా ఇంటీరియర్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను అభివృద్ధి చేయాలి అనేది అమెరికా ప్రభుత్వానికి నిపుణుల నుంచి అందుతున్న సూచనలు. ఇందుకోసం కాంగ్రెస్ చట్టసవరణ చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే అమెరికాకు చదువుకునేందుకు వెళ్లే ప్రతీ విద్యార్థి.. చదువు పూర్తవ్వగానే వారి సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధపడాలి. అమెరికాలో వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్-1బీ వీసాల జారీని కూడా అమెరికా కఠినతరం చేయాలని భావిస్తోంది. ‘రీసెర్చ్, నాన్ ప్రాఫిట్ వంటి వీసాలు అపరిమితంగా ఉండకూడదు. వాటి సంఖ్యను 75 వేల లోపునకు కుదించాలి. ఒకవేళ వీసా సబ్‌స్ర్కిప్షన్లు ఎక్కువగా ఉంటే.. అధికంగా వేతనాలు చెల్లించే సంస్థలకు ప్రాధాన్యమివ్వాలి.
హెచ్-1బీ గడువును రెండేళ్లకు నిర్ణయించాలి. అవసరాన్ని బట్టి మాత్రమే నాలుగేళ్లకు పొడిగించే వెసులుబాటు ఉండాలి. గ్రీన్‌కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉంటే.. ఆటోమేటిక్‌గా హెచ్-1బీ పొడిగింపు విధానాన్ని రద్దుచేయాలి. ఇవి అమెరికా తీసుకోబోయే నిర్ణయాలుగా తెలుస్తోంది. స్టెమ్ కోర్సులు చేసిన అమెరికన్లలో ఆరింట ఒక వంతు మంది అంటే దాదాపు 20లక్షల మంది ఎలాంటి ఉద్యోగాలు చేయడం లేదట. దీంతో అందుబాటులో ఉన్న మానవ వనరులను వినియోగించుకునేందుకు వీసా విధానాలను ప్రక్షాళన చేయనుంది అమెరికా. దాంతో పాటు నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులను ‘గ్వాంటానామో బే’కి తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రెసిడెన్షియల్ మెమోరండంపై సంతకం చేశారు. 30 వేల మంది సామర్థ్యమున్న గ్వాంటానామో బేలో ఇప్పటి వరకు ఉగ్రవాదులను నిర్బంధించేవారు. అక్రమ వలసదారులను ఆయా దేశాలు కట్టడి చేస్తాయనే నమ్మకం లేకే.. ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.