విలువలకు తిలోదకాలు ఇచ్చిన తెలుగుదేశం కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిందెవరు ?
ఆంధ్రప్రదేశ్ లో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎవరు కండువా మార్చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే..
ఆంధ్రప్రదేశ్ లో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎవరు కండువా మార్చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే..ఆ పార్టీలోకి దూకేస్తున్నారు. కౌన్సిలర్ స్థాయి నుంచి పార్లమెంట్ సభ్యుడు దాకా…విలువలు పనేముంది ? పదవులే ముఖ్యమంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు విలువల గురించి గొప్పగా చెప్పిన తెలుగుదేశం కూటమి…ఇప్పుడు చేస్తున్నదేంటి ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జుగుప్సాకరంగా మారిపోయాయి. సిగ్గు ఎగ్గులేకుండా నేతలు ప్రవర్తిస్తున్నారు. షర్ట్ మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తున్నారు. బెల్లం చుట్టే ఈగలు వాలుతాయన్నట్లు…అధికారం ఎటు వైపు ఉంటే…అటే దూకేస్తున్నారు. ఈ పార్టీ…ఆ పార్టీ అన్న తేడా లేదు. అన్ని పార్టీల నేతలు…ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. 2024 వరకు వైసీపీ అధికారంలోకి ఉంది. వైసీపీ హయంలో జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో…తెలుగుదేశం పార్టీ బొక్క బొర్లా పడింది. ఒక్క తాడిపత్రి మున్సిపాల్టీలో తప్పా…మిగిలిన చోట్ల అడ్రస్ లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ పార్టీ నేతలే మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. మూడేళ్లకు పైగా పదవులు అనుభవించారు. భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారు.
సీన్ కట్ చేస్తే 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి దాకా ఫ్యాన్ కింద సేద తీరిన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లు…అధికారం మారగానే చొక్కాలు మడతెట్టేశారు. కొందరు పదవులకు రాజీనామా చేస్తే…మరికొందరు పార్టీనే మార్చేశారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి…వైసీపీకి రాంరాం చెప్పేశారు. అప్పటి దాకా జగన్మోహన్ రెడ్డే సర్వస్వం అన్న వాళ్లంతా…ఇప్పుడు స్వేచ్ఛ లేదంటూ బయటకు వచ్చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి…కీలక పదవులు దక్కించుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు నీతులు చెప్పిన చంద్రబాబు…ఇప్పుడేం చేస్తున్నారన్న ప్రశ్నలు సామాన్య జనం నుంచి వస్తున్నాయి. పదవులకు రాజీనామా చేసి…టీడీపీలోకి రావాలని చంద్రబాబు చెప్పారు. మరి ఇప్పుడు జరుగుతున్నందేంటి ? ప్రతిపక్షంలో విలువు గుర్తొస్తాయి కానీ…అధికారంలోకి రాగానే అవన్నీ బంగాళాఖాతంలో కలిసిపోయాయా ? అని నిలదీస్తున్నారు.
వైసీపీలో పదవులు అనుభవించిన వారే…టీడీపీ హయాంలో కూడా వారే చక్రం తిప్పుతున్నారు. దీంతో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వారు లోలోపల రగిలిపోతున్నారు. వైసీపీ హయాంలో నామినేషన్లు వేయడానికి భయపడ్డ సమయంలో…ఎంతో మంది ధైర్యంగా వచ్చి పోటీ చేశారు. భారీగా డబ్బు ఖర్చు పెట్టారు. వైసీపీ నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నారు. కేసులు పెట్టించుకున్నారు. పోలీసుల చేత దెబ్బలు తిన్నారు. కొందరు జైళ్లకు కూడా వెళ్లి వచ్చారు. అయినా వైసీపీని ఎదుర్కొని ఎన్నికల్లో నిలబడ్డారు. ఓడిపోయినా తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. వైసీపీని ఎదుర్కొని స్థానిక సంస్థల్లో పోటీ చేసిన వారి పరిస్థితి…ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది.
వైసీపీ హయాంలో పదవులు అనుభవించిన వారే…తెలుగుదేశం కండువాలు కప్పుకోవడంతో…టీడీపీ కింది స్థాయి నేతలు రగిలిపోతున్నారు. పార్టీని నమ్ముకున్న తమని కాదని…వలస నేతలకు పదవులు ఎలా ఇస్తారన్న చర్చ అంతర్గతంగా మొదలైంది. డబ్బులు నష్టపోయి….కేసులు ఎదుర్కొని…పోలీసుల చేత దెబ్బలు తింటే…వలసపక్షులకు ప్రాధాన్యత ఇస్తారా ? ఇది పార్టీకి మంచిదేనా ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.