ఏపీకి రాజ్యసభ సభ్యులు అచ్చిరావట్లేదా ? పార్టీ ఏదయినా జంపవడం కామనా ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్రకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి గెలిచి రాజ్యసభ్యులు...మరో పార్టీలోకి జంపయిపోతున్నారు. ఎవరికి వారు తమ స్వార్థాన్ని చూసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్రకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి గెలిచి రాజ్యసభ్యులు…మరో పార్టీలోకి జంపయిపోతున్నారు. ఎవరికి వారు తమ స్వార్థాన్ని చూసుకుంటున్నారు. విలువలు, విశ్వాసాలు సంగతి దేవుడెరుగు…మన ఫ్యూచర్ మనకు ముఖ్యమని ఫిక్సయిపోతున్నారు. ఏపీలోని ప్రతిపక్ష ఎంపీలు…గోడ దూకడం కామన్ గా మారిపోయింది. వాళ్లు వీళ్లు అన్న తేడా లేదు. అంతా ఆ తాను ముక్కలే.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ సభ్యులు…ఈజీగా కండువాలు మార్చేస్తున్నారు. చొక్కా తీసినంత ఈజీ…పార్టీలకు బై బై చెబుతున్నారు. మొన్న తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు…నేడు వైసీపీ ఎంపీలు. సభ్యులు మారుతున్నారు కానీ…పార్టీలు మాత్రం ఆ రెండే. 2024లో వైసీపీ ఎంపీలు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ క్రిష్ణయ్యలు…వైసీపీకి రాజీనామా చేశారు. కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికే…ఆ పార్టీ తరపునే పెద్దల సభలో అడుగు పెట్టారు. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి….ఆర్ క్రిష్ణయ్యను తెలంగాణ నుంచి తీసుకొచ్చి పదవి ఇచ్చారు. నాలుగేళ్లు పదవి ఉండగానే…వైసీపీకి రాం రాం చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు పలు కేసుల్లో జైలుకు వెళ్లిన మోపిదేవి వెంకటరమణ…2020లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2024 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయాక…పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి గుడ్ బై చెప్పాడు. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆయనకు పార్టీలో ఎలాంటి పదవి దక్కలేదు.
2022లో వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన బీద మస్తాన్ రావు…నాలుగేళ్ల పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ రాం రాం చెప్పేశారు. గతేడాది అక్టోబరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అదే పార్టీ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. తాజాగా విజయసాయిరెడ్డి…పార్టీకి, పదవికి రాజీనామా చేసేశాడు. ఈయన కూడా జగన్ తో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. జైలుకు వెళ్లివచ్చాడు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో…పార్టీతో పాటు పదవికి రాజీనామా చేశారు. తొలి ముగ్గురు రాజీనామాలు పెద్దగా ఆశ్చర్యపరచకపోయినా…విజయసాయిరెడ్డి జగన్ కు దూరమవడం…ఎంపీ పదవికి గుడ్ బై చెప్పడం…రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మరో నాలుగేళ్ల పదవీకాలం ఉండగానే…రాం రాం చెప్పడంతో వైసీపీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ అధికార పార్టీలోకి చేరిపోతే…క్రిష్ణయ్య కమలం కండువా కప్పుకున్నారు.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఆ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్ రావులు…కాషాయ పార్టీ గూటికి చేరిపోయారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో…వైసీపీ సూపర్ మెజార్టీ గెలవడంతో…సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ కాషాయ గూటికి చేరిపోయారు. ఒక్క కనకమేడల రవీంద్ర కుమార్ మాత్రమే…టీడీపీలో కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ నుంచి సీఎం రమేశ్ ఎంపీగా గెలుపొందారు. సుజనా చౌదరి మాత్రం బీజేపీ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. డబ్బు, అధికారం ముందు విశ్వసనీయత, నమ్మకం పని చేయడం లేదు. ఏ పార్టీ నుంచి గెలిచినా…పదవీకాలం ముగిసే వరకు ఎంపీలుగా చాలా మంది కొనసాగడం లేదు. మధ్యలోనే ప్లేట్ ఫిరాయిస్తున్నారు. తమ దారి తాము చూసుకొని…పార్టీ అధినేతలకు ఊహించని షాకులు ఇస్తున్నారు.