"అమెరికా దాని మిత్రదేశాలతో పోరుకు సిద్ధం.. అణ్వాయుధ దళాలూ సిద్ధమే".. సరిగ్గా రెండు నెలల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ నార్త్ కొరియా డిక్టేటర్ చేసిన ఈ వ్యాఖ్యలే సెగలు రేపాయి. అంతేనా, అణు వ్యాఖ్యలు చేసి వారం రోజులు పూర్తి కాకముందే డేంజరస్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించి రెచ్చిపోయారు కిమ్. ఈ మిస్సైల్ టెస్టు దెబ్బకు జపాన్ జనం నిలువునా వణికిపోయారు. కట్‌చేస్తే ఇప్పుడు మరోసారి అదే పని చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ సౌత్ కొరియా, జపాన్‌లో పర్యటి స్తున్న సమయంలో డెడ్లీ మిస్సైల్ ప్రయోగం నిర్వహించి పెద్దన్న ముందే తొడగొట్టారు. అగ్రరాజ్యంలో ఏ లక్ష్యాన్ని అయినా ధ్వంసం చేస్తామని సవాల్ చేశారు. కానీ, ఏం చేసుకుని కిమ్ జోంగ్ ఉన్ ఇంతలా రెచ్చి పోతున్నారు? అమెరికాతోనే యుద్ధానికి సిద్ధం అని ఎందుకంటున్నారు? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం.. నార్త్ కొరియా హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించింది. ఆ మిసైల్ పసిఫిక్ సముద్రం వైపు ఉన్న ఏ శత్రువునైనా నమ్మకంగా ఎదుర్కోగలదనీ.. ఇది కచ్చితంగా తమ భద్రతను పెంచుతుందని స్వయంగా కిమ్ ప్రకటించారు. ఈ క్షిపణి శబ్ధం కంటే 12 రెట్ల వేగంతో 1500 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో పడిందని కిమ్ పేర్కొన్నారు. నిజానికి.. ఇంతకుముందే అమెరికాను ధ్వంసం చేయడమే లక్ష్యంగా కిమ్ ఒక డెడ్లీ మిస్సైల్ సిద్ధం చేశారు. అమెరికాను అరగంటలో ఢీ కొట్టే ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్‌ను ఉత్తరకొరియా అభివృద్ధి చేసింది. ఇది 33 నిమిషాల్లో అమెరికాలోని లక్ష్యాలపై గురి తప్పకుండా ఢీ కొంటుందని నివేదికలు తేల్చాయి. అమెరికాలో ఇప్పటికే ఉన్న క్షిపణి రక్షక వ్యవస్థ కూడా ఉత్తరకొరియా అభివృద్ధి చేసిన మిసైల్‌ను గుర్తించలేదు. అమెరికాలోని తూర్పు తీరాన్ని అలాగే పశ్చిమతీరాన్ని కూడా ఈ క్షిపణి సులభంగా చేరగలుగుతుంది. హ్వాసోంగ్-15 పేరిట ఉత్తరకొరియాలోని కిమ్ ప్రభుత్వం అభివృద్ధి పరిచిన ఈ అణ్వస్త్ర క్షిపణి రేంజ్ అక్షరాలా 13 వేల కిలోమీటర్లు. ఇప్పుడు దానికి సొనసాగింపుగా మరో డెడ్లీ క్షిపణిని పరీక్షించారు. ఈ వరుస ప్రయోగాలే అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలు అక్కడెక్కడో ఉత్తర కొరియా మిస్సైల్స్ ప్రయోగిస్తుంటే అమెరికాకు వచ్చిన నష్టమేంటి? మిసైల్స్ ప్రయోగిస్తే అమెరికాపై ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది అంటే.. కచ్చితంగా పెరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికా హెచ్చరికలు పక్కన పెట్టి మరీ అణ్వాయుధ ప్రయోగాలు చేస్తోంది నార్త్ కొరియా. అంటే అమెరికాను తాము కేర్ చేయడం లేదని స్పష్టంగా చెబుతోంది. దీన్ని అమెరికా లైట్ తీసుకుంటే.. రేపొద్దున్న మరో దేశం ఇలానే చేస్తుంది. అప్పుడు పెద్దన్న అనే పదానికి అర్థమే ఉండదు. ఇప్పుడు ఉత్తరకొరియాను బెదిరించో, బతిమిలాడో.. క్షిపణి ప్రయోగాలు చేయకుండా ఆపాలి. లేదంటే అమెరికా పరువు మొత్తం పోతుంది. అటు కిమ్ మాత్రం అమెరికా తన కాళ్ల దగ్గరకు రావా ల్సిందేనన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమే కానీ..అమెరికాకు తలొంచే ప్రసక్తే లేదన్నట్లుగా ఉంది కిమ్ తీరు. కిమ్ చర్యలతో అమెరికానే కాదు దక్షిణ కొరియా, జపాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కిమ్ అసలు లక్ష్యం అణు పరీక్షలతో ఐక్యరాజ్యసమితి, అమెరికాపై ఒత్తిడి తేవడమే. ఉత్తర కొరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసేలా చేయాలనేదే కిమ్ ఉద్దేశం. ఇలాంటి సంక్షోభాలు సృష్టించి తనకు కావాల్సింది చేసుకోవడం ఉత్తరకొరియాకు కొత్తేమీ కాదు. 2010లో దక్షిణ కొరియా నౌకాదళ కొర్వెట్ చియోనాన్‌ను నార్త్ కొరియా ముంచింది. ఆపై కొన్ని నెలల పాటు బయట ద్వీపాలపై బాంబులతో దాడి చేసింది. ఆ తర్వాత 2017లో జపాన్ మీదుగా లాంగ్ రేంజ్ మిస్సైల్ ప్రయోగించి.. జపాన్‌నే హెచ్చరించింది. ఇప్పుడు మరో సంక్షోభం సృష్టించే దిశగా కిమ్ అడుగులు వేస్తున్నాడు. అమెరికా తమను సీరియస్‌గా తీసుకోవాలన్నది కిమ్ ఆలోచన. తమ దగ్గర అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులు ఉన్నాయన్న విషయాన్ని బైడెన్ గుర్తించాలని అతను భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి వరుసగా ప్రయోగాలు చేస్తున్నాడు. మరోవైపు.. దక్షిణి కొరియాతో శాంతి ఒప్పందం, కొరియా ద్వీపకల్పం నుంచి అమెరికా సేనల ఉపసంహరణను కిమ్ సీరియస్‌గా తీసుకున్నారు. దానికోసం ఆయుధ శక్తిని వినియోగిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో అమెరికా దృష్టి తమవైపు తిప్పుకునేందుకు కిమ్ ట్రై చేస్తున్నాడు. ఉత్తర కొరియా దగ్గర దాదాపు 100నుంచి 370 కిలో టన్నుల న్యూక్లియర్ పేలుడు పదార్థాలున్నట్టు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. జపాన్‌లోని హిరోషిమాలో అమెరికా ప్రయోగించిన బాంబు కంటే.. ఆరు రెట్లు శక్తివంతమైన అణు బాంబులు కిమ్ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని చూపించి తమ దేశం అణు, క్షిపణి పరీక్షలపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను ఎత్తివేసేలా అమెరికాతో చర్చలు జరపాలనేది కిమ్ ప్లాన్. త్వరలో బైడెన్ దిగిపోయి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. కిమ్‌తో చర్చలు జరిపేందుకు ట్రంప్ ఇంట్రస్ట్ చూపిస్తారు. ఒకవేళ ఆసక్తి చూపకపోతే మరిన్ని క్షిపణి పరీక్షలతో డొనాల్డ్ ట్రంప్‌ను కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తారు. సో.. ట్రంప్ ఛార్జ్ తీసుకున్న తర్వాతే కిమ్ యాక్షన్‌లో ఛేంజ్ ఉంటుందా లేక కొనసాగుతుందా అనేది తేలుతుంది.[embed]https://www.youtube.com/watch?v=hIeYRqt2hpE[/embed]