Chandrababu Naidu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా..
మంగళవారం విచారణ వాడీవేడిగా సాగింది. చంద్రబాబు తరఫున సుప్రీం సీనియర్ లాయర్ హరీష్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సెక్షన్ 17ఏతోపాటు, ఇదే తరహా ఆరోపణలకు సంబంధించి కోర్టులు ఇచ్చిన వివిధ తీర్పుల గురించి తీవ్ర చర్చ జరిగింది.
Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. అంతకుముందు ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ వాడీవేడిగా సాగింది. చంద్రబాబు తరఫున సుప్రీం సీనియర్ లాయర్ హరీష్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సెక్షన్ 17ఏతోపాటు, ఇదే తరహా ఆరోపణలకు సంబంధించి కోర్టులు ఇచ్చిన వివిధ తీర్పుల గురించి తీవ్ర చర్చ జరిగింది.
సెక్షన్ 17ఏ పరిధిలోని అంశాలను చంద్రబాబు తరఫు లాయర్ హరీష్ సాల్వే కోర్టుకు వివరించారు. దీనిలో భాగంగా గతంలో రఫెల్ కొనుగోళ్లలో యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, ఈ అంశంలో వచ్చిన తీర్పులను సాల్వే ఉదహరించారు. యశ్వంత్ సిన్హా కేసులో తీర్పు ఆధారంగా స్కిల్ కేసులో చంద్రబాబుపై నమోదైన ఎఫ్‌ఐఆర్ చట్టబద్ధం కాదని, ఈ కేసును సవాల్ చేస్తున్నామని, ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని సాల్వే అన్నారు. చంద్రబాబుపై నమోదైన కేసు కొట్టివేయాలని కోరారు. అనంతరం ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ తన వాదన వినిపించారు. 2018లో సెక్షన్ 17ఏ చట్టసవరణ తర్వాత చంద్రబాబు పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదన్నారు. ఆయనపై 2021లో కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్‌లో పేరు ఎప్పుడు చేర్చినప్పటికీ విచారణ కొనసాగుతున్నట్లుగానే భావించాలన్నారు. నేరం ఎప్పుడు జరిగిందో.. అప్పటి చట్టం ప్రకారమే విచారణ జరపాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎప్పటి నేరానికి అప్పటి చట్టమే వర్తించాలన్నారు.
రోహత్గీ వాదనలు విన్న సుప్రీం జడ్జి జస్టిస్ బేలా త్రివేది ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధించారు. 17ఏ సెక్షన్ నేరానికి వర్తిస్తుందా..? నిందితులకు వర్తిస్తుందా..? అని అడిగారు. ఈ కేసు విచారణ ప్రారంభించినప్పుడు ఏం గుర్తించారని అడిగారు. అవినీతికి సంబంధించిన సెక్షన్స్ అమలుకాకపోతే.. వేరు సెక్షన్స్ కింద ప్రత్యేక కోర్టులు విచారించవచ్చా.. ఆ సెక్షన్ల కింద పెట్టిన కేసులు చెల్లుబాటు అవుతాయా..? అని జడ్జి.. ముకుల్ రోహత్గీని ప్రశ్నించారు. అనంతరం కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ జడ్జి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జరిగే విచారణను అనుసరించి క్వాష్ పిటిషన్‌పై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.