Supreme court: రండి.. క్లీన్‌చిట్‌లు తీసుకొని వెళ్లండి! ఆఫర్‌ డబ్బున్న వాళ్లకి మాత్రమే!

న్యాయస్థానాలపై, న్యాయమూర్తులపై రోజురోజుకు నమ్మకం సన్నగిల్లుతోంది. అప్పుడెప్పుడో 2జీ స్కామ్‌ అసలు స్కామే కాదన్నారు.. సరేలే అనుకున్నాం. ఆ తర్వాత బాబ్రీ మసీద్‌ కూల్చివేతలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నేతలకు క్లీన్‌చిట్ ఇచ్చారు. ఎప్పుడో ముగిసిపోయిన గొడవలే కదా అని సర్దిచెప్పుకున్నాం. ఇక తాజాగా అదానీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది సుప్రీం ప్యానెల్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 20, 2023 | 01:30 PMLast Updated on: May 20, 2023 | 1:33 PM

Supreme Court Panel Gives Clean Chit To Adani Group India All Clean Chits To Only Rich People

Supreme court: మీరు పెద్ద పెద్ద స్కాముల్లో ఇరుక్కున్నారా? అందినకాడికి దోచుకున్నారా? మసీద్‌లు పగలగొట్టారా? జనాలు నరుక్కొని చస్తూంటే సినిమా చూసినట్లు చూసి వదిలేశారా? అయితే ఏం భయపడొద్దు.. మీకు క్లీన్‌చిట్‌ ఇచ్చి పంపిస్తాం.. రండి.. త్వరపడండి..!
న్యాయస్థానాలపై, న్యాయమూర్తులపై రోజురోజుకు నమ్మకం సన్నగిల్లుతోంది. అప్పుడెప్పుడో 2జీ స్కామ్‌ అసలు స్కామే కాదన్నారు.. సరేలే అనుకున్నాం. ఆ తర్వాత బాబ్రీ మసీద్‌ కూల్చివేతలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నేతలకు క్లీన్‌చిట్ ఇచ్చారు. ఎప్పుడో ముగిసిపోయిన గొడవలే కదా అని సర్దిచెప్పుకున్నాం. ఇక తాజాగా అదానీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది సుప్రీం ప్యానెల్‌. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడుతోందంటూ హిండెన్ బర్గ్ సంస్ధ ఇచ్చిన రిపోర్టును పరిశీలించిన సుప్రీంకోర్టు కమిటీ.. అదానీ గ్రూప్‌ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని తేల్చింది. అదానీ గ్రూప్ సంస్థ సెబీ నియంత్రణలో వైఫల్యం చెందిందని తేల్చడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చెప్పింది. సుప్రీం ప్యానల్‌ రిపోర్టుతో నిన్నమొన్నటి వరకు అదానీని విమర్శించిన వాళ్ల మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. అటు అదానీ పరువును దేశ ప్రతిష్టకు ముడిపెట్టిన జాతీయవాదులు (అలా చెప్పుకుంటారు) సుప్రీం ప్యానల్‌ తీర్పుతో ఆనందంలో మునిగిపోయారు. దటీజ్‌ అదానీ అంటూ ఎగిరి గంతులేస్తున్నారు.
ఇప్పుడే కాదు.. ఎప్పుడూ ఇంతే
2002 గుజరాత్ అల్లర్లు దేశానికి మాయని మచ్చ. మత విద్వేషం పతాక స్థాయికి చేరుకుంటే ఏం అవుతుందో కళ్లకు కట్టినట్లు చూపించిన ఘటన. అక్కడ అల్లర్లు జరుగుతాయని ముందస్తుగా సమాచారమున్నా.. దాన్ని ఆపడంలో నాటి గుజరాత్ సీఎం, ప్రస్తుత ప్రధాని మోదీ విఫలమయ్యారని కోర్టులో పలువురు పిటిష్లను వేస్తే.. అసలు మోదీకి, ఈ అల్లర్లకు సంబంధమే లేదని కోర్టు తీర్పునిచ్చింది. సీఎంగా అల్లర్లను నియంత్రించడంలో మోదీ ఫెయిల్ గురించి మాట్లాడితే అయనకు ఈ గొడవల్లో హస్తం లేదని చెప్పడం వెనుక ఉద్దేశమేంటో అర్థంకాలేదు.

supreme court of india
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం
2జీ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ అప్పటి టెలికమ్ మంత్రి రాజా, కరుణానిధి కుమార్తె కనిమొళిపై సీబీఐ కేసు నమోదు చేయడం దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో కచ్చితంగా కనిమొళి, రాజాకు శిక్ష పడుతుందని అంతా భావించారు. అయితే ఓపీ షైనీ నేతృత్వంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 మంది నిందితులను నిర్దోషులుగా తేల్చడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. యూపీఏ హయాంలో జరిగిన ఈ కుంభకోణం వల్ల ప్రభుత్వ ఖజనాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2010 నవంబరు నాటి తన నివేదికలో పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన రెండు కేసుల్లో రూ.30 వేల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఉంది. అయినా కూడా నిందితులంతా నిర్దోషులే! మరి దోషి ఎవరూ?
ధర్మం గెలిచింది.. న్యాయం ఓడింది
దేశ రాజకీయాల ముఖ చిత్రం మార్చేసిన బాబ్రీ మసీదు కూల్చివేతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 2020లో తీవ్ర చర్చనీయాంశమైంది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ఎలాంటి ముందస్తు ప్రణాళిక చేయలేదని, నిందితులకు వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యాలు లేవని, రామజన్మభూమి ఉద్యమాన్ని ముందుండి నడిపిన అద్వానీ సహా నాటి యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌తో పాటు బీజేపీ బ్రాండ్‌ లీడర్లకు క్లిన్‌ చిట్ ఇచ్చారు. అందరూ నిర్ధోషులైతే కూల్చిందెవరో అర్థంకాలేదు. మసీదు దానికంతట అదే కూలిపోయిందా అని చాలామంది వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఈ కేసులో తీర్పునిచ్చిన నాటీ సీజేఐ రంజన్‌ గొగొయ్.. పదవీ విరమణ తర్వాత బీజేపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ఇవ్వన్నీ మచ్చుకే కొన్ని.. క్లీన్‌ చిట్‌లకు కొదవే లేని న్యాయస్థానాలు మనవి. రాజకీయ పలుకుపడి, డబ్బు ఉంటే చాలు.. చిన్న చిన్న దొంగతనాలకు శిక్షలు ఉంటాయి.అవి అమలవుతాయి. అది కూడా బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోతేనే.. ఉంటే మాత్రం హాయిగా వేరే కంట్రీకి జంప్‌ అవ్వచ్చు..!