MLC KAVITHA: కవిత అరెస్టు లేనట్లే.. పిటిషన్ విచారణ నవంబర్ 20కి వాయిదా..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉన్నట్లు తేలడంతో ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నోటీసులు రద్దు చేయాలని, తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2023 | 01:43 PMLast Updated on: Sep 26, 2023 | 1:43 PM

Supreme Court Relief To Mlc Kavtitha In Delhi Liquor Policy Case

MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణ నవంబర్ 20కి వాయిదా పడింది. దీంతో అప్పటివరకు కవితపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. మరో రెండు నెలల వరకు కవితకు నోటీసుల ఇవ్వడంగానీ, అరెస్టు చేయడంగానీ లేనట్లే. దీనిపై ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. నవంబర్ 20 వరకు ఎలాంటి విచారణకు పిలవొద్దని సూచించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉన్నట్లు తేలడంతో ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నోటీసులు రద్దు చేయాలని, తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవలే కవిత విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే, తను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని, కోర్టు తీర్పును అనుసరించి మాత్రమే విచారణకు సహకరిస్తానని కవిత.. ఈడీకి తెలిపింది. దీంతో కవితకు ఇచ్చిన నోటీసులను ఈడీ ఉపసంహరించుకుంది. మహిళలను ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు తమ కార్యాలయాల్లోకి పిలిచి విచారించకూడదని, ఇంట్లోనే విచారించేలా చూడాలని కోర్టును కోరింది. కవిత వేసిన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళ అయినంతమాత్రాన విచారణ వద్దనలేం అని సుప్రీం వ్యాఖ్యానించింది.

అయితే, మహిళలకు కొన్ని రక్షణలు కల్పించాల్సి ఉంటుందని సుప్రీం అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే కవితకు తాత్కాలిక ఊరటనిచ్చింది. కేసు విచారణ నవంబర్ 20కి వాయిదా వేసింది. అప్పటివరకు కవితను విచారణకు పిలవొద్దని, ఆమెపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ఈడీకి సూచించింది. దీనికి ఈడీ కూడా అంగీకరించింది. నవంబర్ 20 వరకు కవితకు నోటీసులు ఇవ్వబోమని పేర్కొంది. అంటే అప్పటివరకు కవిత విచారణ, అరెస్టు జరిగే అవకాశం లేదు.