YS Avinash Reddy: అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమా? సుప్రీంకోర్టు నిర్ణయంతో మారిన సీన్..

అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఇకపై ఎప్పడైనా అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే వీలుంది. వివేకా హత్య కేసులో తనను అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2023 | 06:21 PMLast Updated on: Apr 24, 2023 | 6:21 PM

Supreme Court Sets Aside Telangana Hc Order Directing Cbi To Provide Printed Questions To Ysrcp Mp Avinash Reddy

YS Avinash Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లే కనిపిస్తోంది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఇకపై ఎప్పడైనా అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే వీలుంది. వివేకా హత్య కేసులో తనను అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 25 వరకు ఆయనను అరెస్టు చేయవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని కొట్టివేసింది.
వైఎస్ వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ అనుమానిస్తోంది. దీంతో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన అవినాష్ రెడ్డి తనను అరెస్టు చేయవద్దని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన కోర్టు ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేసు తదుపరి విచారణ వాయిదా వేసింది.

హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల్ని కొట్టివేసింది. ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. ఇది సీబీఐ దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. మరోవైపు ఈ కేసు విచారణ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. గతంలో ఏప్రిల్ నెలాఖరులోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. తాజాగా ఈ గడువు పొడిగించింది.
అవినాష్ రెడ్డి వాదనలపై అభ్యంతరం
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సునీత వేసిన పిటిషన్‌ను అవినాష్ తరఫు లాయర్లు వ్యతిరేకించారు. ఈ నెల 25 వరకు అతడిని అరెస్టు చేయకుండా చూడాలని, మంగళవారం దీనిపై హైకోర్టు విచారణ ఉన్నందున అప్పటివరకు అరెస్టు చేయకుండా చూడాలని కోరారు. కానీ, దీన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వలేమని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వాటికి అనుగుణంగా ఆదేశాలిస్తే అవి పరస్పర విరుద్ధంగా ఉంటాయని న్యాయమూర్తి అన్నారు. మరోవైపు సీబీఐ అడిగే ప్రశ్నల్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు అడగడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

ys vivekananda reddy
ఏ క్షణమైనా అరెస్టు
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న అవినాష్ రెడ్డిని సీబీఐ ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇంకా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. దీనికి అవినాష్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ విచారణ సందర్భంగానే కాకుండా ఎప్పుడైనా సీబీఐ అతడిని అరెస్టు చేయొచ్చు. అరెస్టు తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి ఇంతకాలం చేసిన ప్రయత్నలు విఫలమైనట్లే. అందరూ భావిస్తున్నట్లుగానే అవినాష్ రెడ్డి అరెస్టైతే అది రాజకీయంగా సంచలనం సృష్టించే అవకాశం ఉంది.

వైఎస్ వివేకా హత్య, అవినాష్ రెడ్డి వ్యవహారం ఇప్పటికే రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ, టీడీపీ ఈ విషయంలో పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు వైసీపీ వర్గాలు, ఆ పార్టీ మీడియా దీన్ని డిఫెండ్ చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అవినాష్ రెడ్డికి, ఈ హత్యకు అసలు సంబంధమే లేదన్నట్లు, ఇదంతా టీడీపీ కుట్ర అని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే, నిజంగా అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందా? లేదా? ఇంకా కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.