Rahul Gandhi: హమ్మయ్య.. రాహుల్ పార్లమెంట్‌కు వెళ్లొచ్చు.. పరువు నష్టం కేసులో సుప్రీంలో రిలీఫ్
ఆయన చేసిన వ్యాఖ్యలకు గరిష్టంగా ఎందుకు రెండేళ్ల శిక్ష విధించారో సెషన్స్ కోర్టు సరైన ఆధారాలను చూపలేకపోయిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టు అన్ని అంశాలను పరిశీలించకుండా ఇచ్చిన తీర్పు ప్రభావం ప్రజాప్రతినిధిపై తీవ్ర స్థాయిలో పడిందని సుప్రీం అభిప్రాయపడింది.
Rahul Gandhi: మోడీ అనే ఇంటి పేరు విషయంలో నోరు జారి గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు కోర్టుల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గుజరాత్ సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీపై విధించిన అనర్హత శిక్షపై సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. మోడీ ఇంటి పేరును కించపరుస్తూ రాహుల్ గాంధీ వివిధ సందర్భాల్లో ప్రసంగాలు చేశారంటూ ఆయనపై 2019లో కేసు నమోదయ్యింది. దీంతో పాటు రాహుల్ అనేక పరువు నష్టం కేసులు ఎదుర్కొంటున్నా.. మోడీ ఇంటి పేరు కేసు మాత్రం ఆయన మెడకు చుట్టుకుంది. మోడీ అన్న ఇంటి పేరు ఉన్న వాళ్లందర్నీ రాహుల్ కించపరిచారని బీజేపీ నేతలు గుజరాత్‌లో కోర్టుకెక్కారు. ఇటీవలే సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించింది. పరువు నష్టం కేసులో గరిష్టంగా శిక్ష పడటంతో ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వంపై కూడా అనర్హత పడింది. సూరత్ కోర్టు తీర్పు ఇవ్వగానే.. లోక్‌సభ సెక్రటరీ ఆయనపై అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన మాజీ ఎంపీగా మారిపోయారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు లైన్ క్లియరయ్యింది.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది..?
సూరత్ కోర్టు తీర్పు రద్దు చేయాలంటూ రాహుల్ గాంధీ గతంలో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రయల్ కోర్టు తీర్పుపై విచారణ జరిపిన గుజరాత్ ఉన్నత న్యాయస్థానం జులై 7న సూరత్ కోర్టు తీర్పును సమర్ధిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో మళ్లీ సుప్రీంలో సవాల్ చేశారు రాహుల్. ఆయన చేసిన వ్యాఖ్యలకు గరిష్టంగా ఎందుకు రెండేళ్ల శిక్ష విధించారో సెషన్స్ కోర్టు సరైన ఆధారాలను చూపలేకపోయిందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టు అన్ని అంశాలను పరిశీలించకుండా ఇచ్చిన తీర్పు ప్రభావం ప్రజాప్రతినిధిపై తీవ్ర స్థాయిలో పడిందని సుప్రీం అభిప్రాయపడింది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా రాహుల్ ప్రజా జీవితంలో ఉండలేని పరిస్థితి తలెత్తిందని చెప్పింది.
రాహుల్‌కు చురకలు అంటిస్తూనే
సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీం కోర్టు రాహుల్ గాంధీకి కూడా చురకలు అంటించింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సమర్థించలేదు. ప్రజా జీవితంలో ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడటం ఏమాత్రం సరికాదని, సున్నితంగా విమర్శించింది. భవిష్యత్తులో ఏం మాట్లాడినా.. ఆచితూచి వ్యవహరించాలని రాహుల్‌కు సూచించింది సుప్రీంకోర్టు. ఇకపై హుందాగా వ్యవహరించాలంటూ హెచ్చరించింది.
రాహుల్ కరుడుకట్టిన నేరస్థుడా..?
రాహుల్ గాంధీ తరపున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నేత అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. రాహుల్ గాంధీ కరుడుగట్టిన నేరస్థుడు కాదని, ఆయనపై రాజకీయంగా కక్ష సాధించేందుకే బీజేపీ నేతలు పరువు నష్టం కేసులు వేశారని వాదించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమని, అంతమాత్రాన విమర్శలను పరువు నష్టం కింద చూడటం సరికాదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సూరత్ కోర్టు విధించిన శిక్ష కారణంగా రాహుల్ ఇప్పటికే రెండు పార్లమెంట్ సెషన్స్‌ను కోల్పోయారన్నారు. అభిషేక్ మను సింఘ్వీ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది.