వెళ్లిపోతున్నా.. స్వరూపానంద్రేంద్ర షాకింగ్ నిర్ణయం
శాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్‌కు శారదాపీఠం తరఫున లేఖ రాశారు. 2019 నుంచి 2024 వరకూ తన భద్రత, శ్రేయస్సు కోసం ప్రస్తుత, గత ప్రభుత్వాలు పోలీసు రక్షణ అందించాయని..
విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్‌కు శారదాపీఠం తరఫున లేఖ రాశారు. 2019 నుంచి 2024 వరకూ తన భద్రత, శ్రేయస్సు కోసం ప్రస్తుత, గత ప్రభుత్వాలు పోలీసు రక్షణ అందించాయని.. 2019 నుంచి విశాఖపట్నంలోని శారదాపీఠానికి మద్దతు ఇచ్చినందుకు వైఎస్సార్‌సీపీ, కూటమి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇకపై రిషికేశ్‌లో తపస్సులోనే ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నానని.. అందుకే తనకు కేటాయించిన గన్‌మెన్‌లను వెనక్కు తీసుకోవాలని కోరారు. విశాఖపట్నం శారదా పీఠానికి కేటాయించిన భూముల్ని కూడా ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో భీమిలి మండలం కొత్తవలస సమీపంలో కేటాయించిన 15 ఎకరాల భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
ఈ భూముల్ని అప్పటి ప్రభుత్వం నామమాత్రపై ధరకే కేటాయించారని.. నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భూ కేటాయింపుల్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. విశాఖపట్నం జిల్లా యంత్రాంగం ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. కొత్తవలస గ్రామ పరిధి సర్వే నంబర్లు 102/2లో 7.70 ఎకరాలతో పాటుగా 103లో 7.30 ఎకరాలు కలిపి మొత్తం 15 ఎకరాలను శారదా పీఠానికి గత ప్రభుత్వం కేటాయించింది. ఈ ఏరియాలో ఎకరం భూమి 15 కోట్ల వరకు పలుకుతోంది. ఆ లెక్కన ఈ 15 ఎకరాల భూమి విలువ దాదాపుగా 225 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే అంత విలువున్న భూమిని గత ప్రభుత్వం మాత్రం కేవలం ఎకరా లక్షకు మాత్రమే శారదా పీఠానికి కేటాయించింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ భూ కేటాయింపుల్ని రద్దు చేసింది. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో.. 2023 డిసెంబరు 26న శారదాపీఠానికి అప్పటి టీటీడీ బోర్డు తిరుమలలోని గోగర్భం డ్యామ్ వద్ద భూమి కేటాయించింది.
అయితే తిరుమలలో శారదా పీఠానికి భూమి కేటాయింపు, భవన నిర్మాణ తీర్మానాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు దేవాదాయశాఖ టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే భవిష్యత్‌లో ఈ తరహా భూ కేటాయింపులు, భవనాల నిర్మాణానికి సంబంధించిన అంశాల తీర్మానాల కంటే ముందుగా ప్రభుత్వ పరిశీలనకు పంపాలని ప్రభుత్వం సూచిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తిరుమలలో శ్రీశారదా పీఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలకు సిద్ధమైంది టీటీడీ. ఈ మేరకు న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా టీటీడీ నలుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. వీరిలో డిప్యూటీ ఈవో, సీఈ, న్యాయ అధికారితోపాటు పట్టణ ప్రణాళిక విభాగం నిపుణులు ఉన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో స్వరూపానంద్రేంద్ర స్వామి రిషికేశ్ వెళ్లిపోవాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.