T BJP: తెలంగాణలో బీజేపీకి అసలైన సవాళ్లు ఇవే.. ఇవి దాటితే సరే.. లేదంటే కష్టమే..!
తెలంగాణ బీజేపీ సంక్షోభంలో ఉంది. పార్టీలో గందరగోళం నెలకొంది. అసలే అంతర్గత కుమ్ములాటలు, కర్ణాటకలో ఓటమితో పార్టీకి భారీ నష్టం కలిగితే.. మరోవైపు అధిష్టానం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. ఎన్నికలపై ఫోకస్ చేసి, ప్రజల్లోకి వెళ్లాల్సిన టైంలో నేతల మధ్య పంచాయితీ తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
T BJP: తెలంగాణలో బీజేపీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మొన్నటివరకు బీఆర్ఎస్‌కు పోటీగా నిలిచి, ధీటుగా కనిపించిన బీజేపీ ఇప్పుడు బలహీనపడినట్లు కనిపిస్తోంది. అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ మార్పు, అధికార బీఆర్ఎస్‌తో రహస్య ఒప్పదం అంటూ జరుగుతున్న ప్రచారం ఆ బీజేపీని దెబ్బతీస్తున్నాయి. అయితే, వీటన్నింటినీ ఎదుర్కోగలిగితేనే బీజేపీ తెలంగాణలో బలపడి మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. లేదంటే ఎప్పట్లాగే సింగిల్ డిజిట్‌కు పరిమితమవ్వాల్సి వస్తుంది.
ఇవే సవాళ్లు
తెలంగాణ బీజేపీ సంక్షోభంలో ఉంది. పార్టీలో గందరగోళం నెలకొంది. అసలే అంతర్గత కుమ్ములాటలు, కర్ణాటకలో ఓటమితో పార్టీకి భారీ నష్టం కలిగితే.. మరోవైపు అధిష్టానం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. ఎన్నికలపై ఫోకస్ చేసి, ప్రజల్లోకి వెళ్లాల్సిన టైంలో నేతల మధ్య పంచాయితీ తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అసలు పార్టీలో ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో అని కార్యకర్తల్లోనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఎన్నికలకు ఆరు నెలలు కూడా లేని టైంలో నాయకత్వ మార్పు మరో అడ్డంకి. దీనికితోడు బీఆర్ఎస్‌తో రహస్య ఒప్పందం ఉందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం, కాంగ్రెస్‌కు నేతల వలసలు వంటివి అడ్డంకిగా ఉన్నాయి. వీటన్నింటి విషయంలో బీజేపీ ఎలా స్పందిస్తుంది అనేదానిపైనే బీజేపీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
నేతల పంచాయితీ తేలేనా..?
పార్టీలో బలమైన, సీనియర్ నేతలు ఎందరైనా ఉండొచ్చు. కానీ, వారి మధ్య సఖ్యత లేకపోతే కష్టం. నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తేనే ఏ పార్టీ అయినా ప్రజల్లోకి వెళ్తుంది. అందరూ కలిసి కార్యక్రమాలు చేపడితేనే పార్టీపై ప్రజల్లో సానుకూలత ఏర్పడుతుంది. అలాంటిది వారిలో వారే విమర్శించుకుంటే ప్రజల్లో చులకన కావాల్సి వస్తోంది. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి కూడా ఇదే. బండి సంజయ్‌కు అనుకూల, వ్యతిరేక వర్గాలు బీజేపీలో ఉన్నాయి. బండిని తొలగించినందుకు కొందరు సంతోషిస్తుంటే, మరికొందరు ఆవేదనతో ఉన్నారు. అసలు నేతలంతా కలిసి పని చేసే పరిస్థితి లేదు. ఎవరి దారి వారిదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటప్పుడు పార్టీ చేపట్టే కార్యక్రమాలు ఎలా విజయవంతమవుతాయి..? సభలు, ర్యాలీలు సక్సెస్ అవుతాయా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేతలు అందరూ ఒక్కటిగా పని చేస్తూ, ఎవరి నియోజకవర్గంలో వాళ్లు పార్టీని బలపరిచే కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెరుగుతాయి. దీని కోసం నేతలంతా తమ ఇగోలు పక్కనబెట్టాలి. నేతలంగా ఐక్యంగాపార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయాలి.
చేరికలేవి..?
బీజేపీలో కొందరు కీలక నేతలు ఉండొచ్చు. అయితే, వారి ద్వారానే పార్టీ గెలిచేస్తుందనుకుంటే పొరపాటే. అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన నేతలు కావాలి. అంటే ఇతర పార్టీల నేతల్ని కూడా చేర్చుకోవాలి. ఈ విషయంలో బీజేపీ వెనుకబడింది. గతంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి వంటి నేతలు పార్టీలో చేరారు. ఆ తర్వాత ఊపు తగ్గింది. కొంతకాలంగా చెప్పుకోదగ్గ నేతలెవరూ పార్టీలో చేరలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఈ విషయంలో బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకుంటేనే పార్టీకి హైప్.. లేదంటే జనాదరణ లేని నేతలతో నెగ్గుకురాలేరు. అయితే.. కొత్తవాళ్లను చేర్చుకోవడం సంగతి పక్కనబెడితే.. ఉన్నవాళ్లు చేజారకుండా ఉంటే చాలు అన్నట్లు తయారైంది ఇప్పుడు బీజేపీ పరిస్థితి.
బీఆర్ఎస్‌తో ఒప్పందం సంగతి తేలాలి..?
బీజేపీపై ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ.. బీఆర్ఎస్‌తో రహస్య ఒప్పందం కుదిరిందని. బీజేపీతో కేసీఆర్ రాజీ కుదుర్చుకున్నారని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలి. బీఆర్ఎస్.. బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దీనికి తగ్గట్లే రెండు పార్టీలూ వ్యవహరిస్తున్నాయి. గతంలోలాగా బీజేపీని కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ విమర్శించడం లేదు. చాలా కాలం తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీకి కేటీఆర్ ప్రయత్నించారు. కేంద్రంలో ప్రతిపక్ష కూటమికి బీఆర్ఎస్ దూరంగా ఉంటోంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉన్నా అరెస్టు చేయడం లేదని, బీజేపీతో బీఆర్ఎస్‌కు కుదిరిన ఒప్పందంలో భాగంగానే కవితపై చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. బీజేపీ నుంచి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలోలాగా కార్యక్రమాలు చేపట్టడం లేదు. వీటన్నింటికీ బీజేపీ సమాధానం చెప్పాల్సి ఉంది. కవిత విషయంలో సీబీఐ స్పందించడం, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదన్న సంకేతాల్ని పంపాలి. లేదంటే కాంగ్రెస్‌కు లాభం కలిగించినట్లే.
నడిపించే నాయకుడవుతాడా..?
తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న కిషన్ రెడ్డి గతంలో కూడా ఈ పదవిలో పని చేశారు. అయితే, పార్టీలో ఊపు మాత్రం తేలేకపోయారు. ఇది సగటు కార్యకర్తలు చెప్పేమాట. కిషన్ రెడ్డి హయాంలో హైదరాబాద్ దాటి కార్యక్రమాలు చేపట్టింది చాలా తక్కువ. కానీ, బండి సంజయ్ దీనికి భిన్నంగా వ్యవహరించారు. తెలంగాణ అంతటా ఏదో ఒక కార్యక్రమం చేపట్టారు. కింది స్థాయి కార్యకర్తలకు దగ్గరయ్యారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా ముందుండి నడిపించారు. దీంతో బండి సంజయ్ మాస్ లీడర్‌గా ఎదిగారు. పార్టీని ముందుండి నడిపించారు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఈ పని చేయగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్ లాగా పార్టీని నడిపిస్తేనే కార్యకర్తలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పార్టీకి మైలేజ్ వస్తుంది. వీటన్నింటిపై దృష్టి పెడితేనే తెలంగాణలో బీజేపీకి ఛాన్స్. లేదంటే.. మరో దఫా ఎన్నికల కోసం ఎదురు చూడాల్సిందే.