T CONGRESS: బీసీలను ఆకర్షించే మంత్రం.. అత్యధిక సీట్లు ఇవ్వనున్న తెలంగాణ కాంగ్రెస్..?
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీ ఓటు బ్యాంకు కీలకం. బీసీలు ఎటువైపు మొగ్గితే అటువైపు విజయం తథ్యం. అందుకే బీసీలకు అధిక సీట్లు ఇవ్వడంతోపాటు, ఇతర పథకాల్ని కూడా కాంగ్రెస్ ప్రకటించబోతుంది.
T CONGRESS: ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ప్రజాకర్షక పథకాలను ప్రకటించడంతోపాటు, అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అధిక సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీ ఓటు బ్యాంకు కీలకం. బీసీలు ఎటువైపు మొగ్గితే అటువైపు విజయం తథ్యం.
అందుకే బీసీలకు అధిక సీట్లు ఇవ్వడంతోపాటు, ఇతర పథకాల్ని కూడా కాంగ్రెస్ ప్రకటించబోతుంది. ఈ నెల 30న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభలోనే ప్రియాంకతో బీసీ డిక్లరేషన్ ప్రకటింపజేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేసింది. బీసీలను ఆకట్టుకునేలా ఈ డిక్లరేషన్ ఉండబోతుంది. ఇప్పటికే తెలంగాణలో బీసీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీంతో మరింత జాగ్రత్తగా వారి ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్లాన్ ప్రకారం.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో రెండు స్థానాలను బీసీలకు కేటాయించాలని నిర్ణయించింది.
అంటే 17 లోక్‌సభ స్థానాలకు గాను 34 మంది బీసీ అభ్యర్థులు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారు. బీఆర్ఎస్, బీజేపీ.. ఈ స్థాయిలో టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేకపోవచ్చు. దీంతో ఇది కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. కొల్లాపూర్ సభలో బీసీ డిక్లరేషన్‌తోపాటు, మహిళా డిక్లరేషన్ కూడా ప్రకటించే వీలుంది. ఈ సభ తర్వాత మళ్లీ ప్రత్యేకంగా బీసీ గర్జన సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరవుతారు. సిద్ధరామయ్య బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయనను ఆహ్వానించబోతున్నారు. అలాగే ఆగష్టు 15న కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సభ నిర్వహిస్తారు.
ఈ సభలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో వివరిస్తారు. వచ్చే నెలలో అటు బీసీల కోసం ఒక సభ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం మరో సభకు ప్లాన్ చేసింది. వీటి ద్వారా ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. కర్ణాటకలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలను ఆకట్టుకునే పథకాలు ప్రకటించడం, వారు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపడం వల్లే అక్కడ ఆ పార్టీ గెలిచింది. అందుకే అదే తరహా వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తోంది.