T Congress: కమిట్‌మెంట్ లెటర్ ఇచ్చి కట్టుబడి ఉంటారా..? పాపం.. కాంగ్రెస్‌ను వెంటాడుతున్న గతం..!

ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ కోసం పార్టీ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగి.. కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి.. ఎన్నికలైపోగానే.. వేరే పార్టీ వైపు చూసే వాళ్లను కట్టడి చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందుకోసం అగ్రిమెంట్ ప్లాన్ అమలు చేస్తున్నట్టు సమాచారం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 26, 2023 | 03:52 PMLast Updated on: Jun 26, 2023 | 3:52 PM

T Congress Asked Leaders To Sign On Commitment Letters

T Congress: మనదేశంలో రాజకీయాలు ఎప్పుడూ గాలివాటంగా ఉంటాయి. ఏ నేత మెడలో ఎప్పుడు ఏ కండువా కనిపిస్తుందో ఊహించడం కష్టం. ఫలానా పార్టీలో కమిటెడ్ సోర్జర్ అనుకున్న వ్యక్తే.. తెల్లారే సరికి ప్రత్యర్థి పార్టీ ఆఫీసులో ప్రత్యక్షమవుతున్నాడు. పార్టీ విధానాలు, సిద్ధాంతాల కంటే.. నేతలు, వాళ్ల వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయారాం.. గయారాం టైపు రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ గట్టి ఎదురుదెబ్బలు తిన్నది.

ముఖ్యంగా తెలంగాణలో గత ఎన్నికల్లో గెలిచిన అనేకమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చాలామంది కేసీఆర్ టీమ్‌లో చేరి మంత్రులుగా మారిపోయారు. ఒకానొక దశలో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఇక అస్థిత్వమే లేదు అన్న స్థాయికి రాష్ట్రంలో పార్టీ బలహీనపడిపోయింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌కు మంచి ఊపురావడంతో జంపింగ్ జిలానీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ కోసం పార్టీ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగి.. కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి.. ఎన్నికలైపోగానే.. వేరే పార్టీ వైపు చూసే వాళ్లను కట్టడి చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందుకోసం అగ్రిమెంట్ ప్లాన్ అమలు చేస్తున్నట్టు సమాచారం.
టిక్కెట్ కావాలంటే.. ముందు కమిట్‌మెంట్ లెటర్ ఇవ్వాల్సిందే
ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను పార్టీ మారబోనని, ఒకవేళ పార్టీ మారాల్సిన పరిస్థితులు వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే పార్టీ మారతానని రాత పూర్వకంగా హామీ ఇస్తూ సంతకం చేయాలి. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయాలనకుంటున్న అభ్యర్థులందరూ ఇలా పార్టీకి కమిట్‌మెంట్ లెటర్ రాసివ్వాలి. ఇలా రాసిచ్చిన అభ్యర్థులకు మాత్రమే టిక్కెట్లు కేటాయించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో దీన్ని అమలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలయ్యాక ఎదురుదెబ్బలు తినడం కంటే.. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేల నుంచి ఒప్పంద పత్రాలు తీసుకోవడం ఉత్తమమని పార్టీ భావిస్తున్నట్టు వినికిడి.

2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 21 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో 19 స్థానాలకే పరిమితమైంది. పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు ఉండకూడదని భావించిన కేసీఆర్ ఆ పార్టీ నుంచి భారీగా వలసలను ప్రోత్సహించారు. కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ స్థానాలు కూడా రాని నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉంటే వ్యక్తిగతంగా బాగుపడతామని భావించిన ఎమ్మెల్యేలు గోడ దూకేశారు. అసలే గెలిచింది కొంతమంది. వాళ్లలో మెజార్టీ సభ్యులు పార్టీ మారడం కాంగ్రెస్‌ను షేక్ చేసింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ రిపీట్ కాకుండా ఉండేందుకే అభ్యర్థుల నుంచి హామీ పత్రాలు స్వీకరించాలి అనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.
ఎలక్షన్ గేమ్ మొత్తం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరునెలల సమయం కూడా లేదు. ప్రస్తుతానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ట్రైయాంగిల్ ఫైట్‌ కనిపిస్తున్నా కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీలో ఆ జోష్ కనిపించడం లేదు. కాస్తో కూస్తో ప్రజాదరణ ఉన్న నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హ్యాట్రిక్ విజయం సాధిస్తామని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆ పార్టీ నేతలు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. అటు కర్ణాటక ఇచ్చిన కిక్‌తో దూకుడుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి తెలంగాణ ప్రజలు తమకే పట్టం కట్టబోతున్నారని ధీమాతో ఉంది. ఎన్నికల ఫలితాలు ఈ రెండు పార్టీల మధ్య పొలిటికల్ గేమ్‌ను పీక్స్‌కి తీసుకువెళ్లే అవకాశముంది. తాము అనుకున్న స్థానాలు గెలవలేకపోతే ఎమ్మెల్యేలకు ఎరవేసే పరిస్థితులు తలెత్తవచ్చు. అందుకే కాంగ్రెస్ ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. తమ పార్టీ బీ ఫారమ్‌పై గెలిచే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారిపోకుండా జాగ్రత్త పడుతోంది. అందుకే కమిట్‌మెంట్ లెటర్స్ కోసం పట్టుపడుతోంది.
లెటర్ ఇస్తారు.. ఆ తర్వాత జారుకుంటే..!
ప్రస్తుత రాజకీయాల్లో నైతిక విలువలు అన్న దానికి అర్థమేలేదు. ప్రజా ప్రయోజనాల కోసమో.. ప్రజలకు సేవ చేయడం కోసమో రాజకీయాల్లోకి వచ్చినట్టు మన సోకాల్డ్ నేతలు చెప్పుకుంటున్నా.. రాజకీయాలను అడ్డం పెట్టుకుని వాళ్ల సామ్రాజ్యాలను విస్తరించుకునే వాళ్లే ఎక్కువ. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. అందరూ ఆ తాను ముక్కలే. నేను ఏపార్టీలోకి మారను అని కమిట్‌మెంట్ లెటర్ రాసిచ్చిన వాళ్లు ఆ తర్వాత రకరకాల కారణాలు చెప్పి పార్టీ ఫిరాయిస్తే చేసేది ఏమీ ఉండదు. పార్టీ ఫిరాయింపుల చట్టాలు కూడా కాగితాలకే పరిమితమయ్యాయి. ఇలాంటి సందర్భంలో ఇలా కమిట్‌మెంట్ లెటర్స్ తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే చెప్పాలి. రాజకీయాలు మొత్తం అవకాశవాదంగా మారినప్పుడు పక్క చూపులు చూసేనేతలు కచ్చితంగా ఉంటారు. నీతి, నిజాయితీగా, నిబద్దతతో పనిచేసే వాళ్లు తక్కువైపోయినప్పుడు.. పార్టీలకు ఇలాంటి నేతలతో ఎప్పుటికీ తలనొప్పే.