T CONGRESS: కాంగ్రెస్ టికెట్లకు అప్లికేషన్ ఫీజు వెనుక “కన్నడ కథ”!

ఓసీ, బీసీ వర్గాల వారు రూ.50 వేలు.. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు రూ.25వేల రుసుమును చెల్లించి టికెట్ కోసం అప్లై చేయాలి. ఆషామాషీగా పార్టీ టికెట్ల కోసం ఓ దరఖాస్తు పడేసి, నాయకుల చుట్టూ తిరుగుతూ ఉండే నాన్ సీరియస్ నేతలను తొలిదశలోనే వడపోత పోయడానికి ఇలా అప్లికేషన్ ఫీజును నిర్ణయించారని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 18, 2023 | 03:07 PMLast Updated on: Aug 18, 2023 | 3:07 PM

T Congress Charges Rs 50k Fee From Contenders For Assembly Polls Accepts Applications From Today

T CONGRESS: శ్రావణ శుక్రవారం శుభ ముహూర్తం… అసెంబ్లీ టికెట్లను ఆశించే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు కాంగ్రెస్‌ పార్టీ ఈరోజే శ్రీకారం చుట్టింది. ఈ నెల 25 వరకు ఆశావహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెలాఖరు నుంచి సెప్టెంబరు 5లోగా అప్లికేషన్లను వడపోసి.. ఆ వెంటనే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు అందుకు నిర్ణీత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.
ఓసీ, బీసీ వర్గాల వారు రూ.50 వేలు.. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు రూ.25వేల రుసుమును చెల్లించి టికెట్ కోసం అప్లై చేయాలి. ఆషామాషీగా పార్టీ టికెట్ల కోసం ఓ దరఖాస్తు పడేసి, నాయకుల చుట్టూ తిరుగుతూ ఉండే నాన్ సీరియస్ నేతలను తొలిదశలోనే వడపోత పోయడానికి ఇలా అప్లికేషన్ ఫీజును నిర్ణయించారని తెలుస్తోంది. నిజానికి ఓసీ అభ్యర్థుల నుంచి రూ. 10వేలు, ఎస్సీ, ఎస్టీల నుంచి రూ.5వేలు మాత్రమే వసూలు చేయాలని తొలుత అనుకున్నారు. అయితే అది చివరికి రూ.50వేలు, రూ.25 వేలుగా డిసైడ్ అయింది. అయితే ఇలా డబ్బు కట్టిన తర్వాత దరఖాస్తుదారుల నుంచి ఒత్తిడి ఎలా ఉంటుందో వేచిచూడాలి.
కన్నడ కాంగ్రెస్.. అప్లికేషన్ ఫీజు ఫార్ములా..
అసెంబ్లీ టికెట్లకు ఇలా అప్లికేషన్ ఫీజు వసూలు చేయడం అనేది కొత్తగా కనిపిస్తుండొచ్చు గానీ.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లు చాలా చీప్ గురూ అని ఆ పార్టీ నేతలు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. కర్ణాటకలో ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ బ్లైండ్‌గా కన్నడ కాంగ్రెస్ సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతోంది. పార్టీ టికెట్ కోసం అప్లికేషన్లతో పాటు ఫీజును సేకరించడం అనేది అక్కడే జరిగింది. కాకపోతే కన్నడ కాంగ్రెస్ టికెట్ల ధర చాలా ఎక్కువ. అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసే ప్రతి ఒక్కరి నుంచి అక్కడ రూ.2 లక్షలు వసూలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం కన్సెషన్ కూడా ఇచ్చారు. ఇలా ఆశావహుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని పార్టీ కార్యాలయం నిర్మాణానికి, పార్టీ ప్రచార కార్యక్రమాలకు వెచ్చిస్తామని కన్నడ కాంగ్రెస్ పెద్దలు అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణలో సేకరిస్తున్న అప్లికేషన్ ఫీజును కూడా అదే విధంగా ఖర్చు చేసే ఛాన్స్ ఉంది.
ఉమ్మడి వరంగల్‌ నుంచి అప్లికేషన్లు పోటెత్తే ఛాన్స్
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చూసుకుంటే.. వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి గతంలో గెలిచిన కొండా సురేఖ మళ్లీ పోటీ చేసేందుకు సన్నద్ధమవుతుండగా.. ఆమెకు దాదాపుగా టికెట్‌ ఖాయమన్న ప్రచారం ఉంది. డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ కూడా ఇక్కడి నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. ములుగులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ధనసరి సీతక్క, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణలు పోటీ చేయనున్నారు. వరంగల్‌ పశ్చిమలో పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పోటీ చేస్తానంటూ పదేపదే ప్రకటించడంతో పాటు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో పాలకుర్తి నుంచి పోటీచేసి ఓడిపోయిన జంగా రాఘవరెడ్డి వరంగల్‌ పశ్చిమ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించి కార్యక్రమాలు చేస్తున్నారు. వేం నరేందర్‌రెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది. జనగామ నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిలు ఎవరికి వారుగా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. వీరిద్దరి మధ్య పోరు తారస్థాయికి చేరగా.. ఇటీవల కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని జనగామ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడంపై పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌ కోసం మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్‌, డాక్టర్‌ భూక్యా మురళీనాయక్‌ పోటీపడుతున్నారు.