T CONGRESS: కేసీఆర్ వ్యతిరేక నేతలే టార్గెట్.. యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్న కాంగ్రెస్..?
బీఆర్ఎస్‌లో ఉన్న కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ టిక్కెట్స్ ఇవ్వడం లేదు. ఆ పార్టీలోనే కేసీఆర్ అంటే గిట్టని వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాగే బీజేపీలో కొనసాగుతున్న వారిలో కొందరికి కేసీఆర్ అంటే నచ్చదు. ఇలా కేసీఆర్‌ను వ్యతిరేకించే వాళ్లపై ఇప్పుడు కాంగ్రెస్ ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది.
T CONGRESS: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకోసం యాంటీ కేసీఆర్ టీమ్‌ను రెడీ చేస్తోంది. బీఆర్ఎస్‌లో ఉన్న కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ టిక్కెట్స్ ఇవ్వడం లేదు. ఆ పార్టీలోనే కేసీఆర్ అంటే గిట్టని వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాగే బీజేపీలో కొనసాగుతున్న వారిలో కొందరికి కేసీఆర్ అంటే నచ్చదు. ఇలా కేసీఆర్‌ను వ్యతిరేకించే వాళ్లపై ఇప్పుడు కాంగ్రెస్ ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది.
బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్త నేతలతోపాటు, బీఆర్ఎస్ బహిష్కృత నేతలు, కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ నేతలపై కాంగ్రెస్ గురిపెట్టింది. వీళ్లందరినీ కాంగ్రెస్‌లోకి రప్పించాలని చూస్తోంది. ఈ బాధ్యతను అధిష్టానం పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుకు అప్పగించింది. అధికారికంగా వీళ్లు ఇంకా పార్టీలో చేరకపోయినప్పటికీ ఇప్పటి నుంచే పార్టీ కోసం పని చేస్తున్నారు. దీంతో ఈ బాధ్యత తీసుకున్న పొంగులేటి, జూపల్లి ఇప్పటికే పని ప్రారంభించారు. కేసీఆర్ అంటే అస్సలు పడని ఈటల రాజేందర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్‌లో చేరాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉంటేనే కేసీఆర్‌ను ఎదుర్కోవడం సాధ్యమని ఆయా నేతలకు పొంగులేటి సూచించారు. ఈ విషయంపై ఈటల, కోమటిరెడ్డి తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
కాంగ్రెస్‌లో చేరాలని ఉన్నప్పటికీ భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయి అనే అంశాలపై అంచనా వేసుకుంటున్నారు. తమ అనుచరులతో చర్చిస్తున్నారు. కాంగ్రెస్ ప్రతిపాదనలు నచ్చి, సరైన హామీ గనుక లభిస్తే వీళ్లు కాంగ్రెస్‌లో చేరడం ఖాయం. వీరితోపాటు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన నేతలపై కూడా కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ప్రస్తుతానికి విజయశాంతి, డీకే అరుణ, పట్నం మహేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆరేపల్లి మోహన్, సోయం బాపూరావు, రేఖా నాయక్, సత్య నారాయణ గౌడ్, తీగల అనితా రెడ్డి, వేముల వీరేశం, పాల్వాయి రజని, నేతి విద్యా సాగర్ వంటి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వీరిలో చాలా మంది కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు కోదండరాం, షర్మిలను తమ పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం చేసేలా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే నేతలను చేర్చుకుని, బీఆర్ఎస్‌కు ధీటుగా ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.