T CONGRESS: జూలై నుంచి కాంగ్రెస్ దూకుడు.. 30 శాతం కమీషన్ సర్కారు అంటూ బీఆర్ఎస్‌పై పోరుకు సిద్ధం

కర్ణాటకలో పేసీఎం అంటూ 40 శాతం కమీషన్ తీసుకునే సీఎం ఫొటోతో ఒక క్యూఆర్ కోడ్, పోస‌్టర్లు రూపొందించి విస్తృత ప్రచారం చేసింది కాంగ్రెస్. దీనిద్వారా బీజేపీ ప్రభుత్వ అవినీతి ప్రజల్లోకి వెళ్లింది. ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణలో 30 శాతం బీఆర్ఎస్ సర్కారు అంటూ ప్రచారం చేయబోతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 29, 2023 | 01:26 PMLast Updated on: Jun 29, 2023 | 1:27 PM

T Congress Focused On Telangana To Beat Brs Coming With An Action Plan

T CONGRESS: తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచబోతుంది. జూలై 2న ఖమ్మంలో జరిగే సభ తర్వాత నుంచి మరింత దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించింది. దీనికోసం కర్ణాటక తరహా వ్యూహాన్ని అమలు చేయబోతుంది. అక్కడ అధికార బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ సర్కారు అంటూ అప్పట్లో కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఇది పార్టీ విజయానికి ఉపయోగపడింది. ఇదే తరహాలో తెలంగాణలో 30 శాతం కమీషన్ సర్కారు అంటూ ప్రచారం చేయబోతుంది.
బీఆర్ఎస్ అవినీతిపై పోరాడటమే లక్ష్యం
అధికార బీఆర్ఎస్‌ను క్షేత్రస్థాయిలో ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది. మిషన్ 120 డేస్ ప్లాన్‌లో భాగంగా కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటోంది. కర్ణాటకలో పేసీఎం అంటూ 40 శాతం కమీషన్ తీసుకునే సీఎం ఫొటోతో ఒక క్యూఆర్ కోడ్, పోస‌్టర్లు రూపొందించి విస్తృత ప్రచారం చేసింది కాంగ్రెస్. దీనిద్వారా బీజేపీ ప్రభుత్వ అవినీతి ప్రజల్లోకి వెళ్లింది. ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణలో 30 శాతం బీఆర్ఎస్ సర్కారు అంటూ ప్రచారం చేయబోతుంది. 30 శాతం కమీషన్ సర్కారు అనే నినాదంతోనే బీఆర్ఎస్‌పై పోరాడేంటుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇప్పుడు అధికారం రాకపోతే ఇంకెప్పటికీ రాదు అనే ప్రణాళికతో, అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేలా ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్న దళిత బంధు విషయంలో ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడ్డారని, పద్ధతి మార్చుకోవాలని సీఎం కేసీఆర్ హెచ్చరించిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తి చేస్తోంది. అంటే ఎమ్మెల్యేలు ఈ పథకంలో కమీషన్ తీసుకున్నారనే విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రస్తావించారంటే దీనిలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించబోతుంది. దీనిపై క్యూఆర్ కోడ్, డిజైన్‌ను త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించబోతుంది. అలాగే ప్రభుత్వ పథకాలు, వాటి అమలులో వైఫల్యం, అవినీతి అంశాలతో నివేదిక రూపొందిస్తోంది.
ఖమ్మం సభ నుంచి కార్యాచరణ
జూలై 2న ఖమ్మంలో జరిగే సభ ముగిసిన తర్వాత నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ తన ప్రణాళికను అమలు చేయబోతుంది. నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాల్ని చేపట్టబోతుంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందువల్ల బీఆర్ఎస్ అవనీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ మొదటి ప్రాధాన్యమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వీటిని పర్యవేక్షించడానికి స్టీరింగ్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ, మానిటరింగ్ కమిటీ, కో ఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేయబోతుంది. ఎన్నికల సమయంలో కనిపించే ఇలాంటి వ్యవస్థను ఇప్పటినుంచే కాంగ్రెస్ మరింత పకడ్బందీగా అమలు చేయబోతుంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు ఈ కార్యక్రమల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తోంది.
ఇంచార్జిగా కాంగ్రెస్ సీనియర్
ఎన్నికల సమయంలో పార్టీని నడిపించేందుకు ప్రత్యేకంగా ఒక సీనియర్ నేతను నియమించాలని ఏఐసీసీ భావిస్తోంది. కర్ణాటకలో ఈ తరహా బాధ్యతలు తీసుకున్న రణ్‌దీప్ సూర్జేవాలాను తెలంగాణకు నియమించే అంశాన్ని పరిశీలిస్తోంది. లేదా మరొక సీనియర్‌ను అయినా నియమించే అవకాశం ఉంది. రెండు నెలలపాటు ఇంచార్జి ఇక్కడే ఉండి పార్టీని సమన్వయం చేస్తారు. దక్షిణాది రాష్ట్రాల గురించి అవగాహన ఉన్నవారిని ఇక్కడి నియమిస్తారు. మరోవైపు కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న వారికి ఇప్పటికిప్పుడే ఎలాంటి హామీ ఇవ్వకపోయినా.. నియోజకవర్గంలో పని చేసుకోవాలని సూచిస్తోంది. త్వరలో దాదాపు 60 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో మొదలవ్వబోతున్నాయి.