T CONGRESS: ముస్లింల కోసం కాంగ్రెస్ పార్టీ “డిక్లరేషన్”.. ఏముంది..?

వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ముస్లింలను తమవైపు తిప్పుకునేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. గత పదేళ్లుగా బీఆర్ఎస్ వెంట నడుస్తున్న ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకొని.. మునుపటిలా మళ్లీ తమవైపు తిప్పుకునేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 9, 2023 | 08:40 PMLast Updated on: Aug 09, 2023 | 8:40 PM

T Congress Plans To Announce Muslim Declaration Soon

T CONGRESS: దక్షిణ భారతదేశంలో కేరళ, కర్ణాటక తర్వాత అత్యధిక ముస్లిం జనాభా ఉన్న మూడో రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ జనాభాలో ముస్లింలు 13 శాతం వరకు ఉన్నారు. వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ముస్లింలను తమవైపు తిప్పుకునేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. గత పదేళ్లుగా బీఆర్ఎస్ వెంట నడుస్తున్న ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకొని.. మునుపటిలా మళ్లీ తమవైపు తిప్పుకునేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. దానిపేరే.. ముస్లిం డిక్లరేషన్‌!!

ఇందులో ఏయే అంశాలను చేర్చాలి..? బీఆర్ఎస్ పార్టీకి భిన్నంగా, సరికొత్తగా ముస్లింల కోసం ఎలాంటి స్కీమ్స్‌ను ప్రకటిస్తే బాగుంటుంది..? అనే అంశాలపై రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు మేధోమధనం చేస్తున్నారు. ఇందుకోసం నిపుణుల అభిప్రాయాలు, సలహాలను తీసుకుంటున్నారు. కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో విజయ ఢంకా మోగించింది. అక్కడ ముస్లింలకు కాంగ్రెస్ చేసిన వాగ్దానాల నుంచి తెలంగాణ పరిస్థితులకు ఇమిడిపోయే వీలున్న వాటిని ముస్లిం డిక్లరేషన్‌లో చేర్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు ముగిశాయని, ముస్లిం డిక్లరేషన్‌ డ్రాఫ్ట్‌ను ఖరారు చేశామని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఇటీవల వెల్లడించారు.
రుణాలు, రాయితీలతో సహకారం..
4 శాతం ముస్లిం రిజర్వేషన్లకు చట్టపరమైన రక్షణ కల్పించే అంశాన్ని ముస్లిం డిక్లరేషన్‌‌లో కాంగ్రెస్ చేర్చనుందని అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇది ఇప్పటికీ విద్య, ఉద్యోగాలకు వర్తిస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల అంశంపై కేసీఆర్ ప్రభుత్వ స్పందన సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లను కాపాడేందుకు తగిన న్యాయపోరాటం చేస్తుందనే హామీని ముస్లిం డిక్లరేషన్‌‌లో పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఆ కేసులో విజయవంతమైతే ముస్లింలకు రిజర్వేషన్లను మరింత పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తామని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. దీన్ని కూడా డిక్లరేషన్‌‌లో ప్రస్తావించే ఛాన్స్ ఉంది. ముస్లింలలో చాలామంది పాన్ డబ్బాలు, హరేక్‌మాల్ బండ్లు, పంక్చర్ షాపులు, చికెన్, మటన్ సెంటర్లు, మెకానిక్ షాపులు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారికి స్వయం ఉపాధి పథకాల ద్వారా రుణాలు, రాయితీలతో సహకారాన్ని అందించాలనే ప్రతిపాదనలతో టీ కాంగ్రెస్ ఉంది.
ఈసారి పెద్ద ఛాలెంజ్ అదే..
రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 50కి పైగా సెగ్మెంట్లలో ముస్లిం ఓట్లు కీలకంగా ఉన్నాయి. 20కిపైగా సెగ్మెంట్లలో గెలుపోటములను శాసించే స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. మొత్తం 17 లోక్‌‌సభ స్థానాలు ఉండగా, వాటిలో 4 చోట్ల ముస్లిం ఓట్లే అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేస్తాయి. అందుకే ముస్లింలపై కాంగ్రెస్ అంతగా శ్రద్ధ పెడుతోంది. మజ్లిస్ పార్టీతో ఎంతో సఖ్యంగా మెలుగుతున్న బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటూ.. ముస్లిం ఓటర్లను మచ్చిక చేసుకోవడం ఈసారి కాంగ్రెస్‌కు పెద్ద ఛాలెంజ్‌గా మారనుంది. అయితే ముస్లిం ఓటర్ల స్పందన అనేది ఆయా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను బట్టి కూడా మారుతుంది. స్థానికంగా ముస్లింల సమస్యలపై బాగా స్పందించే నాయకులను పార్టీలకు అతీతంగా ముస్లిం ఓటర్లు ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2018 ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ కలిసి తెలంగాణలో మొత్తం 26 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించాయి. అయితే వీరిలో ఏడుగురు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎంతమంది ముస్లిం అభ్యర్థులకు టికెట్స్ ఇస్తుందనేది వేచి చూడాలి.