T Congress: మేనిఫెస్టో సిద్ధం చేస్తున్న కాంగ్రెస్.. ఆ రోజే విడుదలకు సిద్ధం..!

అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమైన కాంగ్రెస్.. ఇప్పుడు మేనిఫెస్టోను కూడా త్వరగా రూపొందిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతుల మీదుగా, సెప్టెంబర్ 17న మేనిఫెస్టోను విడుదల చేయనుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 4, 2023 | 11:51 AMLast Updated on: Jul 04, 2023 | 11:51 AM

T Congress Readying Manifesto Wants To Release Soon By Sonia Gandhi

T Congress: తెలంగాణలో ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. సభలు, పాదయాత్రలు వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది. కీలక పథకాల్ని ప్రకటించేసింది. ఎన్నికల గెలుపులో ప్రధాన పాత్ర పోషించే మేనిఫెస్టోను కూడా సిద్ధం చేస్తోంది. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
బీఆర్ఎస్, బీజేపీకంటే తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుమీదుంది. కర్ణాటకలో గెలుపు ద్వారా వచ్చిన ఊపుతో దూసుకెళ్తోంది. ఎన్నికల వరకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. అందరికంటే ముందుగానే అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమైన కాంగ్రెస్.. ఇప్పుడు మేనిఫెస్టోను కూడా త్వరగా రూపొందిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతుల మీదుగా, సెప్టెంబర్ 17న మేనిఫెస్టోను విడుదల చేయనుంది కాంగ్రెస్. ఆ రోజు తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ సందర్భంగా సోనియా గాంధీ తెలంగాణలో పర్యటిస్తారు. సోనియా రాకతో భారీ సభ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ సభలోనే మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. మేనిఫెస్టో విడుదలైన రోజు నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. అప్పటి నుంచి ఎన్నికల ప్రచారం షురూ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
పలు పథకాల ప్రకటన
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు పథకాల్ని ప్రకటించింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో రైతు డిక్లరేషన్ ప్రకటించగా, ఆ తర్వాత ప్రియాంకా గాంధీతో యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన సభలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, డయాలసిస్ రోగులకు రూ.4 వేలు పెన్షన్ ప్రకటించారు. అలాగే వ్యవసాయ రుణమాఫీ, నిరుద్యోగ భృతి గురించి కూడా కాంగ్రెస్ ప్రకనటలు చేసింది. వీటితోపాటు అన్ని వర్గాలను ఆకట్టుకునే పథకాల్ని కూడా ప్రకటించబోతున్నారు. అలాగే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ, రైతుబందు సహాయం పెంపు, పంటకు మద్దతు ధరతో పాటు బోనస్, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, విద్యార్థినులకు ఎలక్ట్రికల్ బైక్స్ వంటి కీలక హామీలను సోనియా గాంధీ ప్రకటించబోతున్నారు. అయితే, కర్ణాటకలో హామీ ఇచ్చిన ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీల విషయంలో ఆచితూచి ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పథకాలు కొన్ని సమస్యల్ని సృష్టిస్తున్నాయి. రైతులు, మహిళలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థి, యువత, సంక్షేమ, పాలన డిక్లరేషన్లను మేనిఫెస్టోలో చేరుస్తున్నారు. వీటిని అధిష్టానానికి పంపుతారు. అక్కడ ఆమోదం లభిస్తే మేనిఫెస్టోలో చేరుస్తారు. ఇతర పార్టీలకంటే ముందుగానే మేనిఫెస్టోను ప్రకటించి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ అనుకుంటోంది.
బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాతే
అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. దీనికి తగ్గట్లే అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది. నిజానికి అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించాలనుకున్నప్పటికీ, దానివల్ల కొన్ని సమస్యలొస్తాయని కాంగ్రెస్ ఆగిపోయింది. మరికొద్ది రోజుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. అందువల్ల బీఆర్ఎస్‌లో సీట్లు రానివారిని తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అక్కడి అసంతృప్తుల కోసం కాంగ్రెస్ చూస్తోంది. అందువల్ల బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన రావొచ్చు. మరోవైపు బీజేపీలో కుమ్ములాటలు కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశమే. బీజేపీ అసంతృప్త నేతలు కాంగ్రెస్‌వైపే చూస్తున్నారు. వారిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.