T Congress: తెలంగాణ కాంగ్రెస్‌కు సీనియర్లు ఝలక్ ఇస్తున్నారా..? పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారా..?
కాంగ్రెస్ హవా మొదలైంది అనుకుంటున్న తరుణంలో సీనియర్లు షాకిస్తారేమో అనే ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్‌లో రెబల్స్‌గా చెప్పుకొనే జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి వంటి నేతలు కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు.
T Congress: తెలంగాణలో ఒకపక్క కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటూ ఉంటే మరోపక్క అదే పార్టీకి చెందిన సీనియర్ నేతలు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారా..? కొందరు నేతలు సైలెంట్‌గా ఉండటం వెనుక కారణమేంటి?
తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేతలు తమలో తామే గొడవలు పడుతూ పార్టీని దెబ్బతీస్తుంటారు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడయ్యాక ఈ గొడవలు మరింత పెరిగాయి. కోమటిరెడ్డి పార్టీ వీడి వెళ్లిపోయారు. ఉన్నవాళ్లు కూడా సహకరించలేదు. అయితే, కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత పార్టీ నేతలు మారినట్లు కనిపించారు. ఇంతకాలం నిరసన గళం వినిపించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క వంటి కొందరు నేతలు తమ స్వరం మార్చారు. రేవంత్ నాయకత్వంలో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి పెరుగుతున్న గ్రాఫ్ చూసి తమ వైఖరి మార్చుకున్నారు. మరోవైపు జూపల్లి, పొంగులేటి వంటి నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారు. కోమటిరెడ్డి కూడా రేవంత్‌తో కలిసి పని చేస్తున్నారు. ఇంకేం.. కాంగ్రెస్ హవా మొదలైంది అనుకుంటున్న తరుణంలో సీనియర్లు షాకిస్తారేమో అనే ప్రచారం ఊపందుకుంది.
మౌనంగా ఉంటున్న నేతలు
కాంగ్రెస్‌లో రెబల్స్‌గా చెప్పుకొనే జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి వంటి నేతలు కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. గతంలో అంటే కాంగ్రెస్ బలహీనంగా అనిపించింది.. రేవంత్ నాయకత్వం నచ్చలేదేమో అని అనుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ బలపడుతున్నట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి మద్దతు పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు నేతలు పార్టీకి పెద్దగా సహకరించడం లేదు. దీంతో జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి వంటి సీనియర్ నేతలు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బీఆర్ఎస్ పెద్దలతో వీళ్లు టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. గతంలోనే ఈ నేతలు రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించి, బీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి తనకు రాజకీయ వారసుడని గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఉత్తమ పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలోనే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరారు. దీనివెనుక ఉత్తమ్ ఉన్నాడే ప్రచారం జిరిగింది అప్పట్లో. పీసీసీ అధ్యక్షుడే అయినప్పటికీ బీఆర్ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తారని ఉత్తమ్‌పై విమర్శలొచ్చాయి. ఇక జగ్గారెడ్డి, జానారెడ్డి కూడా కేసీఆర్ కోసమే పని చేస్తుంటారనే విమర్శ ఎప్పట్నుంచో ఉంది. జానారెడ్డి తన రాజకీయ వారసుడి కోసం బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు గతంలోనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్లంతా త్వరలో బీఆర్ఎస్‌లో చేరుతారని తాజాగా ప్రచారం ఊపందుకుంది.
కాంగ్రెస్ కుట్ర..? బీఆర్ఎస్ కుట్రా..?
ఈ ప్రచారాన్ని ఆయా నేతలు ఖండిస్తున్నారు. తాము పార్టీ మారబోవడం లేదంటున్నారు. తమపై కాంగ్రెస్ పార్టీలోనే కుట్ర జరుగుతోందని విమర్శిస్తున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తనపై కాంగ్రెస్ పార్టీయే దుష్ప్రచారం చేస్తోందని కొంతకాల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం కార్యాలయంపై దాడి చేసి, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా తాను పార్టీ మారడం లేదని జగ్గారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని జానారెడ్డి కూడా చెబుతున్నారు. అయితే, తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం వెనుక బీఆర్ఎస్ కుట్ర కూడా ఉండొచ్చని ఆయా నేతలు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు బీఆర్ఎస్ చేస్తున్న కుట్రగా కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా తెలంగాణలో ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉన్న నేపథ్యంలో నేతలు ఏ పార్టీలోనైనా చేరొచ్చు.