T CONGRESS: వామపక్షాలతో పొత్తుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్.. ఏడు సీట్లడిగిన కామ్రేడ్లు..?
కాంగ్రెస్ గెలవాలంటే ఇదొక్కటే సరిపోదని, వామపక్షాల మద్దతు కూడా అవసరం అని ఆ పార్టీ భావిస్తోంది. గతంలోనే వామపక్షాలు తమతో కలిసి వస్తాయని కాంగ్రెస్ భావించింది. పైగా కేంద్రంలో కాంగ్రెస్ ఉన్న ఇండియా కూటమిలో కూడా వామపక్షాలు భాగస్వాములుగా ఉన్నాయి.
T CONGRESS: బీఆర్ఎస్ హ్యాండ్ ఇవ్వడంతో లెఫ్ట్ పార్టీలు ఖంగుతిన్న సంగతి తెలిసిందే. దీంతో మరో ప్రత్యామ్యాయ రాజకీయం వైపు సీపీఐ, సీపీఎం చూస్తున్నాయి. ఇదే సమయంలో వామపక్షాలకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మానిక్ రావు థాక్రే వామపక్ష నేతలను ఫోన్‌లో సంప్రదించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుంటోంది. పొంగులేటి, జూపల్లి, జిట్టా వంటి నేతలు కాంగ్రెస్‌లో చేరారు. షర్మిల కూడా చేరబోతున్నారు. తుమ్మల, మైనంపల్లి వంటి నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అయితే, కాంగ్రెస్ గెలవాలంటే ఇదొక్కటే సరిపోదని, వామపక్షాల మద్దతు కూడా అవసరం అని ఆ పార్టీ భావిస్తోంది. గతంలోనే వామపక్షాలు తమతో కలిసి వస్తాయని కాంగ్రెస్ భావించింది. పైగా కేంద్రంలో కాంగ్రెస్ ఉన్న ఇండియా కూటమిలో కూడా వామపక్షాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో తమతో సీపీఐ, సీపీఎం కలిసొస్తాయని భావించినా ఆ దిశగా అడుగులు పడలేదు. కమ్యూనిస్టులు మాత్రం బీఆర్ఎస్, కేసీఆర్‌వైపు చూశారు. రాబోయే ఎన్నికల్లోపు కేసీఆర్ తమతో పొత్తు పెట్టుకుంటారని, నాలుగైదు సీట్లైనా కేటాయిస్తారని భావించారు. కానీ, వారి అంచనాలకు తలకిందులు చేస్తూ కమ్యూనిస్టులతో పొత్తు లేదని కేసీఆర్ తేల్చేశారు. నాలుగు సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇది కమ్యూనిస్టులకు పెద్ద షాక్‌గానే చెప్పాలి. గత మునుగోడు ఎన్నికలో తమ పొత్తు కోసం అభ్యర్థించిన కేసీఆర్.. ఇప్పుడు కనీసం తమను సంప్రదించకుండానే, ఏకపక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్.. పొత్తు ధర్మం పాటించలేదని వామపక్ష నేతలు విమర్శించారు. తాము కలిసి వెళ్తామని, ఎలా పోటీ చేయాలనేది త్వరలో నిర్ణయించుకుంటామని చెప్పాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ విషయంలో సానుకూలంగా స్పందించారు కమ్యూనిస్టు నేతలు.
ఈ అవకాశాన్ని వాడుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. వామపక్షాలతో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఇంచార్జి ఠాక్రే కమ్యూనిస్టు నేతలకు ఫోన్ చేసి, పొత్తు గురించి చర్చించారు. కాగా, సీపీఐ, సీపీఎం కలిసి తమకు నాలుగు సీట్లైనా కావాలని సీపీఎం, మూడు సీట్లు ఇవ్వాలని సీపీఐ అడుగుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులపై సీపీఐ, సీపీఎం నేతలు కూనంనేని వంటి నేతలు చర్చలు జరుపుతున్నారు. పార్టీలో ఒక స్పష్టత వస్తే ఆ తర్వాత కాంగ్రెస్‌తో పూర్తిస్థాయి ఒప్పందం కుదుర్చుకుంటారు. ప్రస్తుతానికి కమ్యూనిస్టులకు కాంగ్రెస్.. కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టుల అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే కలిసి పోటీ చేస్తే మరిన్ని సీట్లు గెలవొచ్చని, కేసీఆర్‌ను ఓడించవచ్చని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. కమ్యనిస్టులకు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మంచి పట్టుంది. ఈ జిల్లాల్లో కమ్యూనిస్టుల మద్దతు తమకు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పొత్తులపై మరికొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.