T CONGRESS: తెలంగాణలో బీసీ మంత్రం జపిస్తున్న కాంగ్రెస్.. కర్ణాటక తరహా యాక్షన్ ప్లాన్?

తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) అత్యధిక సీట్లు ఇవ్వాలనుకుంటోంది. కర్ణాటకలో బీసీలకు అధిక సీట్లు కేటాయించడం కలిసొచ్చింది. కర్ణాటకలో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించింది కాంగ్రెస్. దీంతో ప్రజల్లో సానుకూలత ఏర్పడింది. మొదటి రెండు దఫాల్లో విడుదల చేసిన 166 మంది అభ్యర్థుల్లో సగానికిపైగా.. అంటే 94 మంది బీసీ అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. దీంతో తెలంగాణలో కూడా ఇదే అమలు చేయాలని భావిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 12, 2023 | 10:00 AMLast Updated on: Jun 12, 2023 | 10:02 AM

T Congress Wants Give Priority To Bcs To Attract Voters

T CONGRESS: కర్ణాటక ఎన్నికల్లో విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉపయోగించిన వ్యూహాల్నే ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) అత్యధిక సీట్లు ఇవ్వాలనుకుంటోంది. కర్ణాటకలో బీసీలకు అధిక సీట్లు కేటాయించడం కలిసొచ్చింది. కర్ణాటకలో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించింది కాంగ్రెస్. దీంతో ప్రజల్లో సానుకూలత ఏర్పడింది. మొదటి రెండు దఫాల్లో విడుదల చేసిన 166 మంది అభ్యర్థుల్లో సగానికిపైగా.. అంటే 94 మంది బీసీ అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. దీంతో తెలంగాణలో కూడా ఇదే అమలు చేయాలని భావిస్తోంది. తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువగా ఉంది. తెలంగాణలో బీసీలకు అధిక సీట్లు ఇచ్చేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించింది.
తెలంగాణలో ఉన్న బలమైన బీసీ నేతలు ఎవరు.. టిక్కెట్ ఇస్తే గెలిచే అభ్యర్థులు ఎంత మంది.. ఇలాంటి అంశాలపై కాంగ్రెస్ అంతర్గత సర్వే నిర్వహిస్తోంది. అన్నీ అనుకూలిస్తే వీలైనంత మంది బీసీలకు సీట్లు కేటాయించాలని భావిస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి కూడా బీసీలకు అధిక సీట్లు కేటాయించాలని అధిష్టానం సూచించింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రేకు అధిష్టానం ఈ విషయంపై సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
వీలైతే సగం సీట్లు
బీసీలకు కనీసం 40 శాతం సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. అవసరమైతే యాభై శాతం ఇచ్చేందుకు కూడా ప్రయత్నిస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వుడ్ సీట్లు ఇవ్వడంతోపాటు మిగిలిన సీట్లలో అత్యధిక సీట్లు బీసీలకే ఇవ్వాలని నిర్ణయించారు.ఏ పార్టీ గెలుపోటముల్లో అయినా.. బీసీల పాత్ర కీలకం. అందుకే బీసీలకు దగ్గర కావాలని కాంగ్రెస్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కులగణన జరపాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం డిమాండ్ చేస్తున్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడం లేదు. బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతం పెంచాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. వారికి గతంలోకంటే ఎక్కువ సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్.. బీజేపీని కోరుతోంది.
మేనిఫెస్టోలో ప్రాధాన్యం
బీసీలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీసీలను ఆకట్టుకునేలా, వారి సంక్షేమానికి ఉపయోగపడేలా పథకాలు రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తోంది. సామాజిక వర్గాల వారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బీఆర్ఎస్ లబ్ధి పొందుతోంది. అందుకే ఆ పార్టీకి ధీటుగా సంక్షేమ కార్యక్రమాలు రూపొందించాలని కాంగ్రెస్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ మేనిఫెస్టో రూపకల్పన కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయబోతుంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే మేనిఫెస్టో తయారు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ ఎంపికపై త్వరలోనే పీసీసీ నిర్ణయం తీసుకుంటుంది. మరోవైపు ప్రజాకర్షక విధానాలపై కూడా గురిపెట్టింది. అమలు చేసేందుకు వీలున్నవాటినే మేనిఫెస్టోలో పెట్టి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ సూచించింది. కర్ణాటకలో అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, మహిళలకు బస్సులో ఉచిత రవాణా, మహిళ బ్యాంకు ఖాతాలో రూ.2 వేలు జమ చేయడం వంటి పథకాల్ని తెలంగాణలోనూ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.