Top Story: రివేంజ్ తీర్చుకుంటున్న తాలిబన్లు.. పాకిస్తాన్ కథ ముగిసినట్టేనా?

అసలే ఆర్ధిక సంక్షోభం.. ఆపై తిరుగుబాట్లు, ఎదురు దెబ్బలు, అంతర్గత కలహాలు.. ఇలాంటి సమయంలో ఏ దేశమూ ఎవరితోనూ వివాదాలను కొనితెచ్చుకోదు. మరీ ముఖ్యంగా కాలకేయుల్లాంటి తాలిబన్లతో అస్సలు పెట్టుకోదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2024 | 12:33 PMLast Updated on: Dec 30, 2024 | 12:33 PM

Taliban Seeking Revenge Is Pakistans Story Over

అసలే ఆర్ధిక సంక్షోభం.. ఆపై తిరుగుబాట్లు, ఎదురు దెబ్బలు, అంతర్గత కలహాలు.. ఇలాంటి సమయంలో ఏ దేశమూ ఎవరితోనూ వివాదాలను కొనితెచ్చుకోదు. మరీ ముఖ్యంగా కాలకేయుల్లాంటి తాలిబన్లతో అస్సలు పెట్టుకోదు. కానీ, పాక్ పాలకుల తీరే వేరు.. కష్టకాలంలో ఎవరితో పెట్టుకోకూడదో వారినే పనికట్టుకుని కెలికేశారు. ఆఫ్ఘాన్‌లో ఎయిర్ స్ట్రైక్స్ చేసి వీరత్వం చూపించారు. నిండా మునిగిన సమయంలో వాళ్లు చేసిన అతిపెద్ద తప్పు ఇదే. ఇప్పుడా తప్పే పాకిస్తాన్‌ను షరియా పాలన దిశగా తీసుకుపోతోంది. అంతా అనుకున్నట్టు జరిగితే మరికొన్ని రోజుల్లోనే ఇస్లామాబాద్‌లో తాలిబన్ల జెండా ఎగరబోతోంది. ఎందుకంటే సరిహద్దుల్లో వేలమంది తాలిబన్లు చీమల దండులా కదిలారు. చివరికి పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలపై విరుచుకుపడ్డారు. ఆ డీటెయిల్స్ ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

‘మీరు పాములను పెరట్లో ఉంచి, అవి మీ పొరుగువారిని మాత్రమే కాటు వేయాలని ఆశించలేరు. చివరికి, ఆ పాములు పెరట్లో ఉన్నవారిపైనే తిరబడబోతున్నాయి’. పాకిస్తాన్‌ను ఉద్దేశించి 2011లో హిల్లరీ క్లింటన్ చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఆ మాటే నిజం అవుతోంది. పాక్ ఎవరిని అయితే పెంచి పోషించిందో ఇప్పుడు వారే ఇస్లామాబాద్ పాలిట భస్మాసుర హస్తంగా మారుతున్నారు. అచ్చంగా 2021లో ఆఫ్ఘనిస్తాన్ నగరాలపై ఎలా విరుచుకుపడ్డారో ఇప్పుడు పాక్ భూభాగాలపైనా అలానే విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నారు. ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 15వేల మంది తాలిబన్లు మెరుపు వేగంతో పాక్ సరిహద్దులకు చేరుకున్నారు. ఆ లెక్క డే బై డే మరింత పెరగబోతోంది. అంటే మూడేళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక్కో నగరాన్నీ ఎలా అయితే ఆక్రమించుకున్నారో ఇప్పుడు పాకిస్తాన్ విషయంలోనూ అదే చేయబోతున్నారని చెప్పొచ్చు. కానీ, ఎందుకిలా?

ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ ఔట్‌పోస్టుపై టీటీపీ దాడి చేసి 16 మంది పాక్ సైనికులను హతమార్చింది. టీటీపీ అంటే తెహ్రీక్-ఇ-తాలిబన్. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సంస్థ పూర్తిగా పాకిస్తాన్‌దే. సింపుల్‌గా చెప్పాలంటే పాకిస్తాన్ పాలుపోసి పెంచి సంస్థే ఇది. కానీ, ఇటీవల జరిగిన ఆర్మీ ఔట్‌పోస్టుపై దాడికి పాకిస్తాన్ ఆఫ్ఘాన్ తాలిబన్లను నిందించింది. ఆ దేశంపై వైమానిక దాడులు చేసి 46 మందిని పొట్టనపెట్టుకుంది. ఇక్కడే ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకి చిర్రెత్తుకొచ్చింది. ఇక పాకిస్తాన్‌ను ఉపేక్షించకూడదని డిసైడ్ అయింది. అనుకున్నట్టే కాబూల్ నుంచి వేలాది మంది తాలిబన్ ఫైటర్లు పాక్ సరిహద్దులవైపు కదిలారు. ఇప్పుడు ఆ బోర్డర్‌‌లోనే మాటువేసుకుని కూర్చున్నారు. చివరికి ఊహించినట్టే పాకిస్తాన్‌పై ప్రతీకార దాడులకు దిగారు.

సరిహద్దులకు చేరుకున్న 15వేల మంది తాలిబన్ ఫైటర్లు పాకిస్తాన్‌లోని కొన్ని కీలక స్థావరాలకు లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపారు. ఈ విషయాన్ని అఫ్గాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘‘పాకిస్తాన్‌పై అఫ్గాన్‌ ప్రతీకార దాడులకు దిగింది. ఆ దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు, రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాం’’ అని రక్షణ శాఖ ప్రతినిధి ఇనాయాతుల్లా క్వార్జామి సోషల్ మీడియాలో వెల్లడించారు. పాక్‌పై ఈ దాడులు ఎలా చేశారు. దీనిలో ఎంతమంది మరణించారనే అంశాలను ప్రతినిధి ప్రస్తావించలేదు. ఐతే.. తాలిబన్లకు మద్దతు గల ఓ మీడియా సంస్థ మాత్రం ఈ దాడుల్లో 19 మంది పాకిస్తాన్‌ సైనికులు మరణించారని కథనంలో పేర్కొంది. కానీ, ఈ దాడులు ఇక్కడితో ఆగవు.. తమ దేశంలో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకునే ప్రక్రియలో ఈ దాడులు ట్రైలర్ మాత్రమే.

నిజానికి.. తాలిబన్ల యుద్ధ వ్యూహాలను కనిపెట్టి నిలవడం అంత ఈజీ కాదు. 2021లో కాబూల్‌ను ఆక్రమించుకున్న తీరు చూస్తేనే అది అర్థమవుతుంది. ఆ సమయంలో తాలిబన్లు అమలు చేసిన వ్యూహాలనుచూసి అగ్రరాజ్యాలే ఆశ్చర్యపోయాయి. తమకంటే ఆఫ్ఘన్‌, అమెరికా సేనలే అధికంగా ఉన్నా, వారి దగ్గరే అత్యధికంగా ఆయుధాలు ఉన్నా, విజయం కూడా భయపడి తాలిబన్లకే లొంగిపోయింది. దీనికి కారణం ఈ నయా కాలకేయులు అమలు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షనే. చీమల దండులా చొచ్చుకుపోతూ ఒక్కో రాష్ట్ర రాజధానులనే లక్ష్యంగా చేసుకున్నారు. దారిలో ఎదురైన సైనికుల్ని ఎదురయినట్టే అంతంచేస్తు వారి ఆయుధాలతో వారినే మట్టుబెట్టేశారు. చివరికి కాబూల్‌పై తమ జెండా ఎగురవేశారు. ఈ మొత్తం తతంగమంతా కేవలం కొన్ని నెలల్లోనే జరిదింది. ఇది ఎంత షార్ట్‌ టైమో ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని చూస్తే ఇట్టే అర్ధమవుతోంది. అలాంటి తాలిబన్లు ఇప్పుడు పాకిస్తాన్‌పై దండెత్తితే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కముక్కలో పాకిస్తాన్‌ విషయంలో తాలిబన్లు ఇంతే సీరియస్‌గా ముందుకెళితే పాక్ ప్రభుత్వాన్ని కూలదోసి ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా షరియా ఆధారిత ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు చేయడం తాలిబన్లకు పెద్ద విషయం కాదు.